Share News

కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలి

ABN , Publish Date - Sep 16 , 2026 | 12:31 AM

ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న కరువును జాతీయ విపత్తుగా ప్రకటించి, నష్టపోయిన రైతాంగాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలి
పత్తికొండటౌన: ఎండిన వేరుశనగ పంటను పరిశీలిస్తున్న సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ

సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ

పత్తికొండ టౌన్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న కరువును జాతీయ విపత్తుగా ప్రకటించి, నష్టపోయిన రైతాంగాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పత్తికొండ పర్యటనకు వచ్చిన ఆయన సీపీఐ రాష్ట్రదర్శివర్గ సభ్యులు రామాంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్యతో కలిసి ఎండిపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు కింద రైతులు లక్షలాది ఎకరాల్లో పంటలను సాగు చేశారన్నారు. అయితే ఎల్‌నినో ప్రభావంతో సాగుచేసిన పంటలన్నీ ఎండిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. కరువు పరిస్థితులపై సీఎం చంద్రబాబును కలవనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నభిరసూల్‌, రాజాసాహెబ్‌, రైతు సంఘం నాయకులు నాగేంద్రయ్య, సీపీఐ మండల, పట్టణ కార్యదర్శులు రామాంజనేయులు, నాయకులు సురేంద్రకుమార్‌, ఉమాపతి, కారన్న, తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

సీఐ వైఖరిపై రామకృష్ణకు జర్నలిస్టుల వినతి

విలేకరుల పట్ల పత్తికొండ అర్బన్‌ సీఐ జయన్న దురుసుగా ప్రవర్తించడాన్ని పత్తికొండ పర్యటనకు వచ్చిన సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణకు జర్నలిస్టులు వినతి పత్రం అందించారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో జర్నలిస్టు సంఘం నాయకులు ఆయనను కలిసి సీఐ తీరుపై వివరించారు. వివిధ అంశాలపై సీఎం చంద్రబాబునాయుడిని కలుస్తున్నానని, పత్తికొండ సీఐ తీరుపై కూడా సీఎంకు తెలియజేస్తానని చెప్పారు.

మద్దికెర: ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు కురవక, రైతులు తీవ్రంగా నష్టపోయారనీ.. ఎకరాకు రూ.25వేల చొప్పున పంట నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. మండల పరిధిలోని మద్దికెర, ఎం.అగ్రహారం గ్రామాల్లో సీపీఐ కరువు బృందం పర్యటించింది. కార్యక్రమంలో జిల్లా సీపీఐ నాయకులు రామాంజనేయులు, గిడ్డయ్య, రాజాసాహేబ్‌, మండల సీపీఐ నాయకులు నాగరాజు, ఆర్‌ఎంపీ వైద్యులు వలిసాహేబ్‌, నెట్టికంటయ్య, బొజ్జన్న, ఎరవలి సుధాకర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 16 , 2026 | 12:31 AM