Share News

తాగునీరు కలుషితం!

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:50 AM

గుడివాడ మండలం లింగవరంలో గ్రామస్థులు, చెరువు లీజుదారుడి మధ్య వివాదం నడుస్తోంది. పదెకరాల తాగునీటి చెరువులో నిబంధనలకు విరుద్ధంగా వివిధ రకాల చేపలను సాగు చేస్తున్నాడు. వాటికి మేత కూడా నీటిలోనే కట్టాడు. వీటి వల్ల తాగునీరు కలుషితమవుతుందని గత నెలలో గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామ కార్యదర్శి, ఎంపీడీవో లీజుదారుడికి అనుకూలంగా వ్యవహరించి, సమస్యను పరిష్కరించకుండానే పరిష్కరించినట్టు ఫిర్యాదును మూసివేశారు. దీంతో ఇదే విషయాన్ని సోమవారం కలెక్టరేట్‌కు వెళ్లి విన్నవించారు. డీపీవో కార్యాలయ అధికారి ఈ విషయంపై చిరాకు పడటంతో పాటు వీరిని బయటకు పంపాలని పోలీసులకు చెప్పడంపై గ్రామస్థులు మండిపడ్డారు. ఈ విషయం గుడివాడ ఎమ్మెల్యే వద్ద తేల్చుకుంటామని వెళ్లిపోయారు.

తాగునీరు కలుషితం!

- లింగవరంలో చెరువు లీజుదారుడి నిర్వాకం

- నిబంధనలకు విరుద్ధంగా వివిధ రకాల చేపల పెంపకం

- నీరు పాడవుతుందని అధికారులకు గ్రామస్థుల ఫిర్యాదు

- పాటదారుడికి అనుకూలంగా వ్యవహరించిన గ్రామకార్యదర్శి, ఎంపీడీవో

- సమస్య పరిష్కరించినట్టు ఫిర్యాదు మూసివేత

- దీనిపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేసిన గ్రామస్థులు

- చిరాకుపడిన డీపీవో కార్యాలయ అధికారి

- వీరిని బయటకు పంపాలని పోలీసులకు సూచన

- గుడివాడ ఎమ్మెల్యే వద్ద తేల్చుకుంటామని వెళ్లిపోయిన గ్రామస్థులు

గుడివాడ మండలం లింగవరంలో గ్రామస్థులు, చెరువు లీజుదారుడి మధ్య వివాదం నడుస్తోంది. పదెకరాల తాగునీటి చెరువులో నిబంధనలకు విరుద్ధంగా వివిధ రకాల చేపలను సాగు చేస్తున్నాడు. వాటికి మేత కూడా నీటిలోనే కట్టాడు. వీటి వల్ల తాగునీరు కలుషితమవుతుందని గత నెలలో గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామ కార్యదర్శి, ఎంపీడీవో లీజుదారుడికి అనుకూలంగా వ్యవహరించి, సమస్యను పరిష్కరించకుండానే పరిష్కరించినట్టు ఫిర్యాదును మూసివేశారు. దీంతో ఇదే విషయాన్ని సోమవారం కలెక్టరేట్‌కు వెళ్లి విన్నవించారు. డీపీవో కార్యాలయ అధికారి ఈ విషయంపై చిరాకు పడటంతో పాటు వీరిని బయటకు పంపాలని పోలీసులకు చెప్పడంపై గ్రామస్థులు మండిపడ్డారు. ఈ విషయం గుడివాడ ఎమ్మెల్యే వద్ద తేల్చుకుంటామని వెళ్లిపోయారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:

గుడివాడ మండలం లింగవరం గ్రామంలో ఆరు వేల నుంచి ఏడు వేల మంది వరకు ప్రజలు నివసిస్తున్నారు. గ్రామస్థుల తాగునీటి అవసరాలు తీర్చేందుకు 10 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. తాగునీటిని సరఫరా చేసేందుకు ఓవర్‌హెడ్‌ ట్యాంకు, ఫిల్టర్‌ బెడ్‌లు కూడా ఉన్నాయి. ఈ చెరువును గతంలో ఏడాదికి రూ.93 వేల చొప్పున మూడు సంవత్సరాల పాటు లీజుకు ఇస్తూ పంచాయతీ అధికారులు వేలం నిర్వహించారు. తాగునీటి చెరువులో సహజసిద్ధంగా పెరిగే చేపలనే పెంచాలని, ఇతరత్రా చేపలు వేయరాదని, చెరువులో చేపలకు ఎలాంటి మేత కట్టకూడదని ఒప్పందంలో రాసుకున్నారు. కానీ లీజుకు తీసుకున్న వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా చేపలు వేయడంతో పాటు చేపల మేతను కూడా కడుతున్నాడు. దీంతో గ్రామస్థులు గత ఫిబ్రవరి 2వ తేదీన కలెక్టరేట్‌కు వచ్చి గ్రామంలో తాగునీటి చెరువులో చేపల మేత కడుతుండటంతో నీరు కలుషితమై తాగడానికి, వాడకానికి పనికి రావడంలేదని ఫిర్యాదు అందజేశారు. ఈ అంశంపై ఎంపీడీవోను విచారణ చేయాలని కలెక్టరేట్‌ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. గత ఫిబ్రవరి 10వ తేదీన పంచాయతీ కార్యదర్శి గ్రామస్థుల వద్దకు వెళ్లి మీరు పెట్టిన అర్జీపై విచారణ చేశామని, సమస్య పరిష్కారమైనట్లుగా సంతకాలు చేయాలని గ్రామస్థులను కోరారు. పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన కాగితాల్లో ఇది మంచినీటి చెరువుకాదని రాసి ఉండటంతో గ్రామస్థులు ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శులలో ఎవరు విచారణ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కాగితాలపై సంతకాలు చేసేది లేదని తెగేసి చెప్పారు. ఇలా ఉంటే మంచినీటి చెరువులో మళ్లీ మేత కడుతుండటంతో సోమవారం గ్రామస్థులు కలెక్టరేట్‌కు వచ్చి గతంలో జరిగిన అన్ని అంశాలను వివరిస్తూ అర్జీ అందజేశారు. సమస్య పరిష్కారమైతే మళ్లీ ఎందుకు వచ్చారని మీకోసం కార్యక్రమంలో ఉన్న డీపీవో కార్యాలయ అధికారి గ్రామస్థులతో అన్నారు. దీంతో విషయం పూర్తిగా తెలుసుకోవాలని గ్రామస్థులు కాస్త గట్టిగానే సమాధానం ఇచ్చారు. దీంతో డీపీవో కార్యాలయ అధికారి వీరిని మీకోసం హాలు నుంచి బయటకు పంపాలని అక్కడున్న ఏఎస్‌ఐకు పురమాయించారు.

గుడివాడ ఎమ్మెల్యే వద్ద పంచాయితీ!

లింగవరం గ్రామంలోని తాగునీటి చెరువులోని నీరు కలుషితమవుతున్న సమస్యను అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్థులు కలెక్టరేట్‌ నుంచి నేరుగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వద్దకు వెళ్లారు. తాగునీటి చెరువులో చేపల పెంపకం, చెరువులో మేత కడుతున్న విధానం, అధికారులు పాటదారుడికి అనుకూలంగా నివేదిక తయారు చేయడం వంటి అంశాలను వివరించారు. గ్రామంలో ఏడు వేల మందికిపైగా ప్రజలు ఉంటున్నారని, తాగునీరు కలుషితమైతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు కూడా పట్టించుకోకుంటే ఆందోళనకు దిగుతామని చెప్పకనే చెప్పారు. ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను అర్థం చేసుకోకుండా, సమస్యను పరిష్కరించకుండా, పక్కదారి పట్టించేలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. రానున్న వేసవిలో తాగునీటిని ఎలా సరఫరా చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది ఈ చెరువు చుట్టూ తాగునీటి అవసరాల కోసం మూడు బోర్లు వేశామని, రూ.1.90 లక్షలు ఖర్చయిందని, ఇంతవరకు ఆ బిల్లులు కూడా ఇవ్వలేదని ఎమ్మెల్యేకు వివరించారు. ఈ అంశంపై మంగళవారం ఉదయం 10 గంటలకు అధికారులను పిలిచి గ్రామస్థుల సమక్షంలో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపుతానని ఎమ్మెల్యే చెప్పడంతో గ్రామస్థులు వెనుదిరిగారు.

Updated Date - Mar 03 , 2026 | 12:50 AM