Share News

పేదల సొంతింటి కల సాకారం!

ABN , Publish Date - Mar 30 , 2026 | 04:50 AM

రాష్ట్రంలో మరో 2.5 లక్షల మంది పేదలకు సొంతింటి కల నెరవేరనుంది. కూటమి ప్రభుత్వం రెండో విడత ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా...

పేదల సొంతింటి కల సాకారం!

  • నేడు 2.5 లక్షల మందికి ఇళ్ల పంపిణీ

  • రాష్ట్రవ్యాప్తంగా లక్ష టిడ్కో ఇళ్లతోపాటు..

  • మరో 1.5 లక్షల ఇళ్ల పంపిణీకి కూటమి శ్రీకారం

  • తిరుపతి జిల్లా పుదూరులో పాల్గొననున్న సీఎం

  • 21 నెలల్లో 5.50 లక్షల మంది పేదలకు ఇళ్లు

అమరావతి, తిరుపతి (కలెక్టరేట్‌), మార్చి 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో 2.5 లక్షల మంది పేదలకు సొంతింటి కల నెరవేరనుంది. కూటమి ప్రభుత్వం రెండో విడత ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా లక్ష టిడ్కో ఇళ్లతోపాటు మరో 1.50 లక్షల గృహాలను లబ్ధిదారులకు అదించనుంది. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పుదూరులో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పాల్గొని లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.5 లక్షల ఇళ్లకు ఏకకాలంలో గృహప్రవేశాలు నిర్వహించనున్నారు.

నేడు తిరుపతి జిల్లాలో సీఎం పర్యటన

ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు రాజధాని అమరావతి నుంచి బయల్దేరి నాయుడుపేట మండలంలోని పుదూరుకు చేరకుంటారు. 11.40 గంటలకు టిడ్కో గృహాలను ప్రారంభించి లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ప్రజావేదిక సభలో మాట్లాడతారు. మధ్యాహ్నం 2.40 గంటలకు టీడీపీ శ్రేణులతో సమావేశమవుతారు. సాయంత్రం 4.40 గంటలకు తిరుపతి చేరుకుని పద్మావతి మహిళా యూనివర్సిటీలో జరిగే పీ4 వార్షికోత్సవ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా బంగారు కుటుంబాలకు చేయూతనిచ్చిన పలువురు మార్గదర్శకులను సన్మానిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి రాత్రి 8.50 గంటలకు అమరావతికి చేరుకుంటారు.


21 నెలల్లో 5.50 లక్షల ఇళ్లు...

కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత 21 నెలల్లో రెండోసారి ఇళ్ల పంపిణీ చేస్తోంది. గతేడాది నవంబరులో రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్లను పేదలకు అప్పగించింది. రెండో విడతలో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట మండలం పూదూరులో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చేతులమీదుగా లబ్ధిదారులకు ఇళ్లు అందించనుంది. ఈ కార్యక్రమం అనంతరం పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన పీ4 కార్యక్రమం మొదలుపెట్టి ఏడాదవుతున్న సందర్భంగా తిరుపతిలో నిర్వహించే వార్షికోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.

Updated Date - Mar 30 , 2026 | 04:53 AM