ద్రావిడ భాషా సంస్కృతులను కాపాడుకోవాలి
ABN , Publish Date - Feb 07 , 2026 | 11:48 PM
ఉత్తరాది ఆర్య భాషా సంస్కృతుల ఆఽధిపత్యం నుంచి దక్షిణాది రాషా్ట్రల ప్రజలు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే ద్రవిడ భాషా సంస్కృతుల కోసం ఉద్యమించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.
ప్రరవే మహాసభల్లో వక్తల పిలుపు
ఘనంగా ఆరంభమైన ప్రరవే 8వ రాష్ట్ర మహా సభలు
కర్నూలు కల్చరల్, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాది ఆర్య భాషా సంస్కృతుల ఆఽధిపత్యం నుంచి దక్షిణాది రాషా్ట్రల ప్రజలు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే ద్రవిడ భాషా సంస్కృతుల కోసం ఉద్యమించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే) రెండు రోజుల 8వ రాష్ట్ర మహాసభలు శనివారం నగరంలోని కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాల సమావేశ భవనంలో ఘనంగా ఆరంభమయ్యాయి. ‘ద్రావిడ సమాజ సాహిత్యాలు - సారూప్యత, ఐక్యత, పోరాటం’ అనే అంశంపై, అనిశెట్టి రజిత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహా సభల్లో తొలిరోజు సభల ప్రారంభ సందర్భంగా ప్రరవే పతాకాన్ని వేదిక జాతీయ కార్యదర్శి ఎండ్లూరి మానస, జాతీయ నాయకురలు కుంజా కల్యాణి, రాజ్యలక్ష్మి ఆవిష్కరించారు. మారుతి పౌరోహితం ఆప్త వాక్యం చెబుతూ ప్రరవే సమకాలీన సంక్షోభ సందర్భంలో అత్యవసరమైన భాషా సాంస్కృతిక ఇతివృత్తం తీసుకొని ఈ సభలు నిర్వహించడం సంతోషదాయకమని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక ్టర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ సమాజ హితం కోసం పోరాడుతున్న ప్రరవే సభలకు తమ కాలేజీ వేదిక కావడం గర్వకారణమని అన్నారు.
ద్రావిడ సాహిత్యోద్యమ సంకేతం ఈ మహా సభలు
ప్రారంభ సభలో కీలకోపన్యాసం ఇస్తూ ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకుడు కె. శ్రీనివాస్ ... రాబోయే రోజుల్లో ద్రావిడ భాషలు, సంస్కృతుల పరిరక్షణకు ఉద్యమ సంకేతాలు ఈ సభల్లో కనిపిస్తున్నాయని అన్నారు. చరిత్రను అధ్యయనం చేస్తే ఆర్యుల కంటే పూర్వమే ద్రావిడ భాష ఉందని 2014లో తమిళనాడులో జరిగిన తవ్వకాల్లో బయటపడిందని అన్నారు. హరప్పా, మొహంజోదారో కాలానికి కంటే ముందే ఇక్కడ ప్రాచీన నాగరికత ఉన్నదని తెలిపారు. జన్యు పరిశోధనల ఆధారంగా ప్రాచీన భాషలపై పరిశోధనలు ప్రారంభమయ్యాయని, దక్షిణ దేశంలో ఎన్నో లిపిలేని భాషల పట్ల కూడా పరిశోధన జరుగుతున్నదని, ఇవన్నీ చరిత్రను సరికొత్తగా అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయని అన్నారు. జన్యుశాస్త్రం ప్రకారం ఆర్య, ద్రావిడ మూలాలు ఒక్కటి కాదని స్పష్టమైందని అన్నారు. రాజకీయ ఆందోళనగా కూడా మారినప్పుడే ద్రావిడ సాహిత్యోద్యమం నిలబడగలుగుతుందని అన్నారు. ఈ సభలో ‘అంబేద్కర్’ పుస్తకాన్ని కవి జి. వెంకటకృష్ణ ఆవిష్కరించారు. వరంగల్‌కు చెందిన సాహిత్యవిమర్శకుడు మెట్టు రవీందర్ పరిచయం చేశారు.
ఫ సుదూర దృష్టితో, విశాలమైన ప్రపంచ చరిత్రను పరిశీలించాలి
దేశంలో వేగంగా జరుగుతున్న పరిణామాలను అర్ధం చేసుకోవాలంటే ప్రపంచ చరిత్రను వస్తుగతంగా పరిశీలించాలని, భాషా సాంస్కృతిక ఉద్యమంతోపాటు రాజకీయ ఉద్యమంగా కూడా ద్రావిడ భావజాలం ఎదగాలని ప్రముఖ పరిశోధకుడు, రచయిత కల్లూరి భాస్కరం అన్నారు. అన్య భాషల ప్రమేయంతో ద్రవిడ జాతి మనుడగకు ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉందని అన్నారు. ఈ సభలో దివంగత కవయిత్రి, ప్రరవే నాయకురాలు అనిశెట్టి రజిత స్మారకోపన్యాసం ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే చేశారు. ఆమె మాట్లాడుతూ అనిశెట్టి రజిత ప్రరవే అభివృద్ధికి, మనుగడకు కృషి చేశారని అన్నారు. రజిత నలభై ఏళ్లుగా సమష్ఠితో భాగంగా అన్ని ప్రజాపోరాటాల్లో, సాహిత్య ఉద్యమాల్లో అంతర్భాగమయ్యారని అన్నారు. ఆమె రాసిన కవిత్వం, పాటలు, వ్యాసాల్లో మన సమాజ పోరాట చరిత్ర కనిపిస్తుందని అన్నారు. ‘ఆధునిక ద్రావిడ భాషా సాహిత్యాలు - సంస్కృతులు’ అనే అంశంపై సామాజికవేత్త జి. భార్గవ ప్రసంగిస్తూ ఆధునికత ఒక్కో భాషా సమాజంలోకి ఒక్కోలాగా వస్తుందని, సంప్రదాయ సమాజాలకంటే కొత్త పోకడలను ఆధునికత అందిస్తుందని అన్నారు. ఈ ప్రమాణం మీద దక్షిణ భారత సామాజ, భాషా, సమాజాల్లో అనేక స్థాయిలో పురోగతి కనిపిస్తుందని వివరించారు. మరో వక్త కవి, విమర్శకుడు గూండ్ల వెంకటనారాయణ మాట్లాడుతూ తెలుగు భాష మీద మనకు అస్సలు పట్టింపు లేదని అన్నారు. సంస్కృత, వ్యవహారిక భాషా రూపాల నుంచి బైటపడినప్పుడే ద్రావిడ సాహిత్యోద్యమంలో తెలుగు రచయితలు, మేధావులు క్రియాశీలంగా భాగం కాగలరని అన్నారు. ఈ సభలో డాక్టర్ సుభాషిణి, డాక్టర్ గంధం అరుణ, డాక్టర్ ఆదిలక్ష్మి, నిర్మలారాణి, సుజాత, ఎన నాగమణి, డీటీఎఫ్ నాయకులు కె. రత్నం ఏసేపు, సుబ్బరాయుడు, సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కెంగార మోహన, ప్రధాన కార్యదర్శి జంధ్యాల రఘుబాబు, రచయిత మారుతి పాల్గొన్నారు.