Share News

ద్రావిడ భాషలకు ముప్పేమీ లేదు

ABN , Publish Date - Feb 08 , 2026 | 11:22 PM

ద్రావిడ భాషలకు ప్రస్తుతం వచ్చిన ముప్పేమీ లేదని కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం కన్వీనర్‌ డాక్టర్‌ సి.మృణాళిని అన్నారు.

   ద్రావిడ భాషలకు ముప్పేమీ లేదు
సమావేశంలో ప్రసంగిస్తున్న డాక్టర్‌ సి. మృణాళిని

హిందీ ఆధిపత్యం ఏనాటికీ సాధ్యం కాదు

కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం కన్వీనర్‌ డాక్టర్‌ మృణాళిని

ముగిసిన ప్ర.ర.వే 8వ రాష్ట్ర మహాసభలు

కర్నూలు కల్చరల్‌, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): ద్రావిడ భాషలకు ప్రస్తుతం వచ్చిన ముప్పేమీ లేదని కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం కన్వీనర్‌ డాక్టర్‌ సి.మృణాళిని అన్నారు. ద్రావిడ భాషలపై హిందీ బాష ఆధిపత్యం ఏనాటికీ సాగదన్నారు. కర్నూలు నగరంలోని కేవీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల్లో రెండు రోజులుగా కొనసాగిన ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్ర.ర.వే) 8వ రాష్ట్ర మహాసభలు వివిధ సెషన్ల మధ్య జరిగిన చర్చల అనంతరం ఆదివారం సాయంత్రం ఘనంగా ముగిశాయి. కేవీఆర్‌ కళాశాల్లోని అనిశెట్టి రజిత ప్రాంగణంలో ‘ద్రావిడ సమాజ సాహిత్యాలు - సారూప్యత, ఐక్యత, పోరాటం’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ మహాసభల్లో డాక్టర్‌ సి.మృణాళిని ‘ద్రావిడ భాషల స్త్రీల సాహిత్యం - సారూప్యం’ అనే అంశంపై ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ ద్రావిడ భాషల్లోని సాహిత్యాలు ఎన్నటికీ అంతరించి పోయే అవకాశం లేదని, అవి మరింత విస్తృతం అవుతున్నాయని చెప్పారు. సాహిత్యకారుల నిరంతర కృషి కొనసాగుతూనే ఉందని, ఈ క్రమంలో ద్రవిడ భాషలపై ఏనాటికీ ఆధిపత్యం చెలాయించే అవకాశం హిందీ భాషకు లేదని స్పష్టం చేశారు. అయితే ద్రావిడ భాషల మధ్య సారూప్యత పెరుగుతూనే ఉందని, ఈ క్రమంలో మరింత భాషా ఉద్యమాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని అన్నారు. జాతీయ భాషగా హిందీని బలవంతంగా రుద్దే క్రమాన్ని రాజకీయంగా ఎదుర్కోవాల్సిన అంశమని తెలిపారు. రెండోరోజు మొదటి సెషనకు సభాధ్యక్షులుగా డీఎల్‌ సుహాసిని వ్యవహరించగా, సభను పాత శ్రీలక్ష్మి నిర్వహించారు.

సభలో నాలుగో సెషనలో ‘ద్రావిడ భాషా సమాజాలు - అస్తిత్వ రాజకీయాలు’ అనే అంశంపై ప్రముఖ సాహితీవేత్త, విమర్శకుడు జిలకర శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఫాసిజం పెరుగుతున్న సందర్భంలో ద్రావిడ భాషల మధ్య ఐక్యత అనివార్యమని సూచించారు. ఆ దిశగా పోరాటం చేయాలని అన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచే పరిస్థితి నేడు ఉందని ప్రగతిశీల వాదులు తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. సమావేశానికి జహా ఆర అధ్యక్షత వహించగా, పులిపాక శోభారాణి సభను నిర్వహించారు.

ఫ ద్రావిడ భాషలపై మరింత పరిశోధనలు పెరగాలి : కెంగార మోహన

అనంతరం జరిగిన ‘ద్రావిడ సాహిత్య ఉద్యమం రాబోతున్నదా?’ అనే అంశంపై జరిగిన చర్చలో సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కెంగార మోహన మాట్లాడుతూ ద్రావిడ భాషలపై మరింత పరిశోధనలు జరగాలని, పాఠ్యాంశాలన్నీ మత ప్రాతిపదికన రూపొందించకుండా చూడాలని అన్నారు. ద్రావిడ భాషలపై అన్య భాషల పెత్తనం సరికాదని, ఈ క్రమంలో ప్రతి జిల్లాలో భాషా అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రాయలసీమ విద్యావంతుల వేదిక నాయకుడు రత్నం ఏసేపు మాట్లాడుతూ పాఠశాల స్థాయిలోని పాఠ్యాంశాల్లో పూర్తి మార్పులు రావాలని, అప్పుడే లౌకిక సమాజం నిర్మించడానికి సాధ్యమని చెప్పారు. ఈ సదస్సులో అపర్ణ తోట, డాక్టర్‌ గంధం అరుణ, ఇనాయతుల్లా, పీడీఎ్‌సయూ రాష్ట్ర నాయకుడు భాస్కర్‌లు మాట్లాడుతూ భాషల అస్తిత్వానికి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. అనంతరం జరిగిన ముగింపు సభకు రాజ్యలక్ష్మి అధ్యక్షత వహించగా తాళ్లపాక యాకమ్మ సదస్సును సమీక్షించారు. ఆప్త వాక్యాన్ని సుభాషిణి అందించగా, సభను బండారు సుజాత నిర్వహించారు.

Updated Date - Feb 08 , 2026 | 11:22 PM