దిబ్బపాలెంలో డ్రైనేజీల పునర్నిర్మాణం
ABN , Publish Date - Jul 07 , 2026 | 05:00 AM
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం (సెజ్ పునరావాస కాలనీ)లో డ్రైనేజీల పునర్నిర్మాణ పనులను ఎమ్మెల్యే సుందరపు ..
రూ.నాలుగు కోట్ల వ్యయంతో పనులు ప్రారంభం
‘అక్షరమే అండగా, పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమానికి స్పందన
అచ్యుతాపురం, జూలై 6 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం (సెజ్ పునరావాస కాలనీ)లో డ్రైనేజీల పునర్నిర్మాణ పనులను ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు సోమవారం ప్రారంభించారు. దిబ్బపాలెం పంచాయతీ పరిధిలో అచ్యుతాపురం, రాంబిల్లి మండలాలకు చెందిన 22 గ్రామాలకు చెందిన ఐదు వేల కుటుంబాలు ఉంటున్నాయి. ఐదు వందల ఎకరాల విస్తీర్ణం గల పునరావాస కాలనీలో సుమారు 53 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించారు. రహదారులకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మించారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కాలనీ గురించి అసలు పట్టించుకోకపోవడంతో డ్రైనేజీలు పూడుకుపోయాయి. ఫలితంగా ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచిపోతోంది. మార్చి 12వ తేదీన దిబ్బపాలెంలో ‘ఆంధ్రజ్యోతి’, ‘ఏబీఎన్’ నిర్వహించిన ‘అక్షరం అండగా, పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమంలో స్థానికులు మంచినీరు, డ్రైనేజీ సహా అనేక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఆయన స్పందిస్తూ సాధ్యమైనంత త్వరలో కాలనీలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో మరమ్మతులకు గురైన వాటర్ ప్లాంటును సుమారు రూ.రెండు లక్షలతో మరమ్మతులు చేయించి గత నెల 16న ప్రారంభించారు. సోమవారం డ్రైనేజీ పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇందుకు సుమారు రూ.నాలుగు కోట్లు అవుతాయని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం పంచాయతీలో ఉన్న రూ.రెండు కోట్లతో పనులు ప్రారంభించాలని, మరో రూ.2 కోట్లు తాను సమకూరుస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. డ్రైనేజీల నుంచి వచ్చే మురుగు నీటిని శుద్ధి చేసిన అనంతరం చెరువుల్లో వదిలే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బైలపూడి శ్రీరామదాసు, రాజాన విజయ్, నీరుకొండ నరసింగరావు, లాలం రాజు తదితరులు పాల్గొన్నారు.