డీఎంఈగా విష్ణువర్థన్
ABN , Publish Date - May 27 , 2026 | 05:57 AM
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌గా (డీఎంఈ) డాక్టర్ ఏ విష్ణువర్థన్ పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రస్తుతం కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న ఆయనకు డీఎంఈగా బాధ్యతలు అప్పగించింది.
ప్రస్తుతం డీఎంఈ రఘునందన్ బదిలీ
అమరావతి, మే 26 (ఆంధ్రజ్యోతి): డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌గా (డీఎంఈ) డాక్టర్ ఏ విష్ణువర్థన్ పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రస్తుతం కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న ఆయనకు డీఎంఈగా బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం డీఎంఈ డాక్టర్ రఘునందన్ పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆయన స్థానంలో డాక్టర్ విష్ఘువర్థన్‌ను నియమించింది. రఘునందన్‌ను విజయవాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌గా బదిలీ చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు బుధ, లేదా గురువారం విడుదల కానున్నాయి. అలానే ఏలూరు ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా ఉన్న ఎం.ఎస్ .రాజును రాజమండ్రి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా బదిలీ చేశారు. ఇటీవల 15 మంది ప్రొఫెసర్లకు ప్రభుత్వం అడిషినల్ డీఎంఈగా పదోన్నతి కల్పించింది. వాళ్లందరికీ వివిధ బోధనాస్పత్రుల్లో పోస్టింగ్స్ ఇచ్చింది. గుంటూరు మెడికల్ కాలేజీ న్యూరాలజీ ప్రొఫెసర్ కేవీవీ సత్యనారాయణను డీఎంఈ కార్యాలయంలో అదనపు డీఎంఈగా నియమించింది. రంగరాయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పి.ఉషాకిరణ్, పాడేరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా బసుమిత్ర దాస్, పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఎస్.గోవిందు, ఒంగోలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఎస్.శివానీని, విశాఖ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డైరెక్టర్‌గా వీ మన్మధరావును నియమించింది. కాగా, డీఎంఈ పరిధిలోని 9 ఆస్పత్రులకు కొత్త సూపరింటెండెంట్లను ప్రభుత్వం నియమించనుంది. రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి.