స్కూళ్ల వద్ద ఫాస్ట్‌ఫుడ్ స్టాల్స్ తొలగించాలి!
ABN , Publish Date - Feb 14 , 2026 | 02:35 AM
చిన్నపిల్లలు, యువత ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని.. యువతలో గుండెపోట్లు పెరగడానికి ఇదే కారణమని ప్రముఖ గ్యాస్ర్టో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ డి నాగేశ్వర్‌రెడ్డి అన్నారు.
చిన్నారులు, యువత ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి
కుప్పంలో జీర్ణకోశ వ్యాధుల బ్యాక్టీరియాపై పరిశోధనలు
ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి
విజయవాడ/భారతీనగర్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): చిన్నపిల్లలు, యువత ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని.. యువతలో గుండెపోట్లు పెరగడానికి ఇదే కారణమని ప్రముఖ గ్యాస్ర్టో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ డి నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. స్కూళ్లు, విద్యాసంస్థల వద్ద ఫాస్ట్‌ఫుడ్ స్టాల్స్ లేకుండా చర్యలు తీసుకోవాలని, అక్కడున్న స్టాల్స్‌ను తొలగించాలని సూచించారు. చిన్నపిల్లల్లో జీర్ణాశయ, కాలేయ సమస్యలు రావడానికి ఫాస్ట్‌ఫుడ్డే కారణమని స్పష్టం చేశారు. ఈ ఆహారం వల్ల చెడు బ్యాక్టీరియా తయారవుతుందని చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జీర్ణకోశ వ్యాధులకు సంబంధించిన బ్యాక్టీరియాపై పరిశోధనలు చేస్తున్నామని, ఈ పరిశోధనల్లో మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియాను గుర్తిస్తామని ఆయన తెలిపారు. ఏడాదిపాటు ఈ పరిశోధన జరుగుతుందన్నారు. విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ‘ఇండియన్ సొసైటీ ఆ్‌ఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఏపీ చాప్టర్’ ఎనిమిదో వార్షికోత్సవ సదస్సు, ‘ఏపీ ఈఎస్జీకాన్-2026’ కార్యక్రమాలను శుక్రవారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పిల్లల గట్ హెల్త్‌పై బ్యాలం నుంచే శ్రద్ధ చూపించాలని తల్లిదండ్రులకు సూచించారు. రాష్ట్రంలో కాలేయం, జీర్ణాశయ అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు. ఈ సమస్యలను నయం చేయడానికి ఆధునిక చికిత్స, మందులు అందుబాటులోకి వచ్చాయన్నారు. సంప్రదాయ ఆహారమే ఆరోగ్యానికి మేలు చేస్తుందన్నారు. ఫాస్ట్‌ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల పెద్దవారిలో మతి మరుపు, పిల్లలకు ఆటిజం వస్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఏపీ ఈఎస్జీకాన్ నిర్వాహక కమిటీ ప్రతినిధులు డాక్టర్ జవ్వాజి సతీశ్, డాక్టర్ జాలాది గోపీకృష్ణ, బత్తిన రాజేశ్, తాతా రవిశంకర్, చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ ప్రమోద్ గార్గ్, డాక్టర్ ఐ.ఆర్.ఎస్.గిరినాథ్ తదితరులు పాల్గొన్నారు.