నా దేహం చీల్చి.. పాఠం చెప్పు కన్నా..!
ABN , Publish Date - Mar 12 , 2026 | 03:29 AM
‘కన్నా.. నేను చనిపోయాక నా దేహాన్ని వృథాగా పడేయకు. దాన్ని చీల్చి నీ శిష్యులకు పాఠాలు చెప్పు..’ అని కన్న కొడుకుకు దిశానిర్దేశం చేసి కన్నుమూసిందో మాతృమూర్తి!.
‘వైద్య’ కుమారుడికి తల్లి దిశానిర్దేశం
బెళగావి ఆయుర్వేద వైద్య కళాశాలకు శతాధిక వృద్ధురాలి పార్థివ దేహం
తల్లి దేహంతో పాఠాలు చెప్పనున్న డాక్టర్ మహంతేశ్
పదహారేళ్ల క్రితం తండ్రి దేహంతో పాఠాలు
బళ్లారి గాంధీనగర్, మార్చి 11(ఆంధ్రజ్యోతి): ‘కన్నా.. నేను చనిపోయాక నా దేహాన్ని వృథాగా పడేయకు. దాన్ని చీల్చి నీ శిష్యులకు పాఠాలు చెప్పు..’ అని కన్న కొడుకుకు దిశానిర్దేశం చేసి కన్నుమూసిందో మాతృమూర్తి!. ఒకప్పుడు తండ్రి శరీరాన్ని బోధనకు వినియోగించిన వైద్యుడు, తాజాగా తల్లి దేహాన్ని కూడా వైద్య విద్యాబోధనకు వాడనున్నారు. బెళగావి జిల్లా బైలహొంగల పట్టణానికి చెందిన రామన్నవర్ కుటుంబం వైద్యులకు ప్రసిద్ధి. ఆ కుటుంబానికి చెందిన డాక్టర్ సుశీలాదేవి(101) ఈ నెల 9న తుదిశ్వాస విడిచారు. ఆమె కోరిక మేరకు, మరుసటి రోజు ఆమె పార్థివదేహాన్ని కంకణవాడీ ఆయుర్వేద కళాశాలకు కుటుంబ సభ్యులు అప్పగించారు. సుశీలాదేవి కుమారుడు డాక్టర్ మహంతేశ్ రామన్నవర్.. ఈ ఆయుర్వేద కళాశాల అనాటమీ విభాగంలో అసిసెంట్ ప్రొఫెసర్. 2010లో తన తండ్రి డాక్టర్ బసవన్నెప్ప సంగప్ప రామన్నవర్ కోరిక మేరకు, ఆయన దేహాన్ని తానే విచ్ఛేదనం చేసి వైద్య విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఇది వైద్య చరిత్రలో అరుదైన సంఘటనగా రికార్డులకు ఎక్కింది. తాజాగా మహంతేశ్ తల్లి సుశీలాదేవి కూడా తన దేహాన్ని స్వయంగా విచ్ఛేదనం చేసి విద్యార్థులకు పాఠాలు చెప్పాలని, పరిశోధనల కోసం వినియోగించాలని సూచించారు.
చరిత్ర పునరావృతం
సుశీలాదేవి నాడు తన భర్త దేహదానానికి మద్దతుగా నిలిచారు. బంధువర్గాలు అభ్యంతరం చెబుతున్నా, ఆమె తన కుమారుడిని ప్రోత్సహించారు. మోక్షం పొందాలంటే మృతదేహాన్ని దహనం చేయాలని, లేదా పూడ్చిపెట్టాలని వారి బంధువులు పట్టుబట్టినా ఆమె వెనుకంజ వేయలేదు. ఇక, రామన్నవర్ దంపతులిద్దరూ వైద్యవృత్తి ద్వారా ప్రజలకు విశేష సేవలు అందించారు. భర్త డాక్టర్ బసవన్నెప్ప రామన్నవర్ దంత వైద్యులు, ఆయుర్వేద వైద్యులు. బెళగావి జిల్లాలో బైలహొంగలలో ఆయన క్లినిక్ నిర్వహించేవారు. కర్ణాటక, మహారాష్ట, కేరళ రాష్ట్రాల్లోని 113 గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. సుశీలాదేవి రామన్నవర్ కూడా ఆయుర్వేద వైద్యురాలు. తన భర్త నిర్వహించే సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొనేవారు. రామన్నవర్ కుటుంబంలో మొత్తం 14 మంది సభ్యులు తమ శరీరాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. వీరిలో డాక్టర్ మహంతేశ్ దంపతులు కూడా ఉన్నారు. రామన్నవర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు వందలాది మందిని దేహదానం వైపు మళ్లించింది ఆ కుటుంబం.