పారిశ్రామిక దిగ్గజం జీఎన్ నాయుడు కన్నుమూత
ABN , Publish Date - Apr 30 , 2026 | 04:22 AM
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, రీజెన్సీ పరిశ్రమల అధినేత డాక్టర్ జీఎన్ నాయుడు (85) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ....
అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస
జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఎల్లుండి అంత్యక్రియలు
రీజెన్సీ పరిశ్రమ స్థాపించి 6 వేల మందికి ఉపాధి
వరకట్నం నిర్మూలనకు కృషి.. కట్నం తీసుకోని వారికి ఉద్యోగం
విద్యా సంస్థలు ఏర్పాటు చేసి సామాజిక సేవ
పలువురు ప్రముఖుల సంతాపం
యానాం/రాజంపేట, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, రీజెన్సీ పరిశ్రమల అధినేత డాక్టర్ జీఎన్ నాయుడు (85) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రితో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అల్లుడు నరాల సత్యేంద్ర ప్రసాద్ రీజెన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీ్‌సకు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కుమార్తెలు రాధిక, బిందు సంస్థల డైరెక్టర్లుగా ఉన్నారు. జీఎన్ నాయుడు అంత్యక్రియలు శనివారం (మే 2న) జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోనూ జీఎన్ నాయుడు అంటే తెలియని వారు ఉండరు. ఆయన 1985లో యానాం, పుదుచ్చేరి ప్రాంతాల్లో రీజెన్సీ సిరామిక్ పరిశ్రమలు ఏర్పాటు చేసి సుమారు ఆరు వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. రీజెన్సీ సిరామిక్ టైల్స్‌ను పలు దేశాలకు ఎగుమతి చేసి ప్రపంచవ్యాప్తంగా పేరు గడించారు. రీజెన్సీ హైస్కూల్, రీజెన్సీ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, బీఈడీ కళాశాల, రీజెన్సీ నలందా విద్యా సంస్థలను స్థాపించారు.

జీఎన్ నాయుడు ప్రస్థానం
జీఎన్ నాయుడు అసలు పేరు గుడారు నారప్పనాయుడు. ఉమ్మడి కడప జిల్లాలోని పుల్లంపేట మండలం టి.కమ్మపల్లె గ్రామంలో 1941 జూలై 1న వ్యవసాయ కుటుంబానికి చెందిన గుడారు పెద్ద వెంకటయ్యనాయుడు, చెంగమ్మ దంపతులకు జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో వ్యవసాయశాఖ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సరోజినీనాయుడును వివాహమాడారు. వారికి ఇద్దరు కుమార్తెలు రాధిక, బిందు ఉన్నారు. టి.కమ్మపల్లెలో ప్రాథమిక విద్యనభ్యసించిన జీఎన్ నాయుడు... పుల్లంపేట హైస్కూల్‌లో పదో తరగతి వరకు చదువుకున్నారు. అనంతపురం జేఎన్‌టీయూ యూనివరన్శిటీలో సివిల్ ఇంజనీరింగ్, రూర్కీ యూనివర్సిటీలో ఎంటెక్ పూర్తి చేశారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వివిధ శాఖల్లో సివిల్ ఇంజనీర్‌గా సేవలందించారు. అనంతరం ఉద్యోగానికి రాజీనామా చేసి యానాంలో అప్పటి లెప్టినెంట్ గవర్నర్ కోన ప్రభాకర్‌రావు ప్రోత్సాహంతో.. 1985లో రీజెన్సీ పరిశ్రమను స్థాపించారు. రీజెన్సీ సిరామిక్ సంస్థ, రీజెన్సీ ప్యాకింగ్ సంస్థ, రీజెన్సీ ట్రాన్స్‌పోర్ట్ సంస్థలను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పించే విషయంలో పలు పరిశ్రమల స్థాపన, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, సంచార వైద్యశాలల ద్వారా గ్రామీణ ప్రజల ముంగిట్లోకి మెరుగైన వైద్యసేవలందించడం వంటి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డుతో ఆయనను సన్మానించింది. బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో థీసిస్ ను సమర్పించినందుకు రూర్కీ విశ్వవిద్యాలయం నాయుడుకు డాక్టరేట్ ప్రదానం చేసి గౌరవించింది. నాయుడుకు రాజంపేటలో సొంత ఇల్లు ఉన్నప్పటికీ ఎక్కువగా హైదరాబాద్‌లోనే నివాసం ఉండేవారు. 2012లో జరిగిన కార్మికుల ఆందోళనలో రీజెన్సీ పరిశ్రమ అగ్నికి ఆహుతయ్యింది. ఈ గొడవల్లో జీఎన్ నాయుడు సమీప బంధువు కూడా మరణించారు. ఈ సంఘటన ఆయనను తీవ్రంగా కలచివేసింది. యానాంలో పారిశ్రామికాభివృద్ధినీ దెబ్బతీసింది. యానాం రీజెన్సీ పునరుద్ధరణకు నాటి నుంచి నాయుడు కృషి చేస్తూనే ఉన్నారు.
క్రమశిక్షణ, నిరాడంబరతకు నిలువుటద్దం
క్రమశిక్షణ, నిరాడంబరతకు నాయుడు మారుపేరు. ఆయన తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి.. 4.30 గంటలకల్లా దినచర్యను ప్రారంభించేవారు. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమిస్తారు. చుట్టుపక్కల చిన్న చిత్తు కాగితం కనిపించినా తానే తీసిపడేసేవారు. ఫంక్షన్లలో ఎవరైనా భోజనం వదిలేస్తే ఒప్పుకునేవారు కాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం.. అని చెప్పి.. మొత్తం తినేదాకా ఊరుకునేవారు కాదు. ఇటీవల రాజంపేటలో తన రీజెన్సీ నలందా విద్యాసంస్థల విద్యార్థుల ద్వారా స్వయంగా చీపురు చేతబట్టి కలెక్టర్, ఎస్పీ ఇతర ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో రోడ్లు శభ్రం చేసి స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు.
ఎన్టీఆర్ మొదలు అనేక మంది నేతలతో పరిచయం
దివంగత ఎన్టీ రామారావు, రోశయ్య, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఇలా అనేకమంది ప్రముఖ నేతలతో నాయుడుకు సన్నిహితంగా ఉండేవారు. చంద్రబాబు అన్నా, ఆయన పరిపాలన అన్నా ఎంతో మక్కువ. తన చివరి అంకంలో ఆరోగ్యం సహకరించకపోయినా విజయవాడకు వెళ్లి చంద్రబాబును కలిసి వచ్చారు. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ఆయన చాలా బాధపడ్డారు. హైదరాబాద్ నుంచి రాజంపేటకు వచ్చి చంద్రబాబు అక్రమ అరె్‌స్టకు నిరసిస్తూ రిలే నిరసన దీక్షలో పాల్గొన్నారు. ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే వీకెండ్ కామెంట్ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. జీఎన్ నాయుడుకు రాజంపేట నుంచి పార్లమెంటు సభ్యుడిగా గెలవాలనే కోరిక ఉండేది. కానీ.. సామాజిక సమీకరణాల కారణంగా ఆయనకు అనేకమార్లు టికెట్ దక్కలేదు. రాజ్యసభ సభ్యుడిగానూ ఆయనకు అవకాశం రాలేదు. టీటీడీ చైర్మన్ స్థానంలో శ్రీవారికి సేవ చేయాలనుకున్నా కుదరలేదు.
ప్రముఖుల సంతాపం
జీఎన్ నాయుడు మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేశారు. పుదుచ్చేరి సీఎం ఎన్.రంగసామి, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప, కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, యానాం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ కార్యదర్శి ఈలప్రోలు విష్ణువర్ధనరావు, యానాం ఎన్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాడి శామ్యూల్ సంతాపం తెలిపారు. అలాగే రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ, ఆర్టీసీ మాజీ చైర్మన్ ఎద్దుల సుబ్బరాయుడు, ఎంపీ మేడా రఘునాఽథరెడ్డి, రాజంపేట టీడీపీ ఇన్‌చార్జి చమర్తి జగన్‌మోహన్‌రాజు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యాదర్శి చెన్నూరు సుధాకర్ సంతాపం వ్యక్తం చేశారు.
కట్నం తీసుకోని వారికి ఉద్యోగం
వరకట్న నిర్మూలనకు ఆయన కృషి చేశారు. దీనికోసం ఎవరైనా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే.. తన రీజెన్సీ సంస్థల్లో ఇద్దరికీ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. అలా అనేక మంది నిరుద్యోగ జంటలకు తన సంస్థల్లో ఉద్యోగాలిచ్చారు. రీజెన్సీ ప్యాకింగ్ ఇండస్ట్రీలో ఉద్యోగాలకు మహిళలకు ప్రాధాన్యత కల్పించారు. ఆవులంటే ఆయనకు ఎంతో ఇష్టం. అందుకే రీజెన్సీ పరిశ్రమల్లో వెయ్యి ఆవులతో గోశాలలు ఏర్పాటు చేశారు. వాటిలో అనేక గోవులకు దేవతామూర్తుల పేర్లు పెట్టారు. వాటిని ఆ పేర్లతో పిలవగానే అవి పరిగెత్తుకుంటూ ఆయన వద్దకు వచ్చేవి. నేటి అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లె, రాయచోటి పట్టణాల్లో గతంలో తీవ్ర నీటిఎద్దడి ఉండేవి. అక్కడి ప్రజలు గుక్కెడు మంచినీటికి ఇబ్బంది పడేవారు. ఈ విషయాన్ని గమనించి మదనపల్లె, రాయచోటి ప్రాంతాల్లో తన రీజెన్సీ పరిశ్రమల ద్వారా ప్రత్యేక ట్యాంకర్లు ఏర్పాటు చేసి నిరంతరం తాగునీరు అందించారు. రాజంపేట పట్ణణంలో కూడా ఆయన తాగునీరు అందించారు.
ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కోసం...
దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకునేందుకు, భావితరాల వారికి మార్గదర్శకంగా ఉండేలా ఎన్టీ రామారావు కాంస్య విగ్రహాన్ని యానాం రీజెన్సీ పరిశ్రమ సమీపంలో ఏర్పాటు చేయాలని నాయుడు సంకల్పించారు. ఈ మేరకు ఎన్టీరామారావు నిలువెత్తు విగ్రహాన్ని పరిశ్రమకు కూతవేటు దూరంలో జాతీయ రహదారి 216పై ప్రతిష్టింపచేశారు. దీన్ని సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించాలని, ఇటీవల విజయవాడలో ఆయన్ను స్వయంగా కలిసి కోరారు. కోనసీమ పర్యటనలో భాగంగా వస్తానని చంద్రబాబు ఆయనకు మాటిచ్చారు. అయితే కోరిక తీరకుండానే జీఎన్ నాయుడు హఠాన్మరణం చెందడం అటు నాయుడు అభిమానులతోపాటు, ఇటు టీడీపీ క్యాడర్‌నూ కలచివేసింది.