టీటీడీ జేఈవోగా శరత్
ABN , Publish Date - Jan 21 , 2026 | 03:41 AM
టీటీడీ జేఈవోగా డాక్టర్ ఎ.శరత్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదిగా ఖాళీగా వున్న విద్య, ఆరోగ్య విభాగాల జేఈవో పోస్టులో ఆయన నియమితులయ్యారు.
తిరుపతి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): టీటీడీ జేఈవోగా డాక్టర్ ఎ.శరత్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదిగా ఖాళీగా వున్న విద్య, ఆరోగ్య విభాగాల జేఈవో పోస్టులో ఆయన నియమితులయ్యారు. కాగా, శరత్ రిటైర్డు ఐఏఎస్ అధికారి. గ్రూప్ 1 అధికారిగా ఆయన 1990వ దశకం చివర్లో మదనపల్లె ఆర్డీవోగానూ, తదుపరి కుప్పంలో కడా స్పెషలాఫీసర్‌గానూ పనిచేశారు. 2005లో ఐఏఎస్ హోదా అందుకుని వివిధ హోదాల్లో పనిచేశారు. ఆపై ఏపీ క్యాడర్ నుంచి తెలంగాణ క్యాడర్‌కు బదిలీ అయ్యారు. తెలంగాణలోనే సర్వీసు నుంచీ రిటైరయ్యారు. టీటీడీలో రిటైర్డు ఐఏఎస్ అధికారులను జేఈవో పోస్టులో నియమించడం చాలా అరుదు. గతంలో కుప్పంలో కడా ప్రత్యేక అధికారిగా విజయవంతంగా పనిచేసిన నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో సన్నిహిత పరిచయాలున్నాయి. ఆయన పనితీరు, వ్యవహార శైలి తెలిసినందునే ఏడాదిగా ఖాళీగా వున్న టీటీడీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వింగ్ జేఈవో పోస్టులో నియమించేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఆ పోస్టులో ప్రాథమికంగా ఏడాది పాటు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.