నేలకొరిగిన విద్యుత్ స్తంభం
ABN , Publish Date - Mar 31 , 2026 | 11:19 PM
భారీ ఈదురు గాలుల ప్రభావంతో విద్యుత్ సరఫరా కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఆలూరు రూరల్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): భారీ ఈదురు గాలుల ప్రభావంతో విద్యుత్ సరఫరా కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళవారం సాయంత్రం ఈదురు గాలుల వల్ల 132 కేవీ ఆలూరు సబ్ స్టేషన్ నుంచి మొలగవల్లి, నగరడోన వెళ్లే కేవీ 33 విద్యుత్ లైన్ విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మంగళ వారం సాయంత్రం నుంచి ఆలూరు, మొలగవల్లి గ్రామాలకు విద్యుత్ స రఫరాకు అంతరాయం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గంటల కొద్దీ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ అంతరాయం లేకుండా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి సరఫరా చేస్తామని ఏఈ గుర్రప్ప తెలిపారు.
ఆలూరు: ఆలూరు పట్టణంలో మంగళవారం గంటపాటు ఉరు ములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షం కురిసింది. ఎండ వేడిమితో అల్లాడుతున్న జనానికి వర్షం రావడంతో వాతావరణం కాస్త చల్లబడడంతో ప్రజలకు ఉపశమనం కలిగింది.
బసినేపల్లిలో వర్షం
మద్దికెర మండల పరిధిలోని బసినేపల్లి గ్రామంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో పొలాల్లో నీరు నిలిచింది. మంగళవారం బసినేపల్లి, పెరవలి గ్రామాల మధ్య దాదాపు గంట పాటు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం పడటంతో గ్రామంలో వర్షం కురిసింది. వేసవి కాలం ఎండలు మండుతుండటంతో ఈ వర్షంతో ప్రజలకు వేడిమి నుంచి కాస్త ఉపశమనం కలిగించింది. అలాగే మండలంలోని పలు గ్రామాల్లో చిరు జల్లులు కురిశాయి.