కదలరు!
ABN , Publish Date - Apr 28 , 2026 | 12:16 AM
మచిలీపట్నం పోర్టు అనుబంధ పరిశ్రమలకు భూముల కేటాయింపులో అధికారులు, పాలకులు నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేల కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టేందుకు పెద్ద కంపెనీలు ప్రతిపాదనలతో ముందుకు వస్తున్నా.. వాటికి అవసరమైన భూములు చూపడంలో విఫలమవుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. భవిష్యత్తులోనూ ఇదే పద్ధతి కొనసాగితే అనుబంధ పరిశ్రమల ఏర్పాటు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పన మరింత ఆలస్యం అయ్యే ప్రమాదం పొంచి ఉంది.
- బందరు పోర్టు అనుబంధ పరిశ్రమల ఏర్పాటుపై అధికారులు, పాలకుల్లో నిర్లక్ష్యం
- భూముల కేటాయింపులో నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించడంపై విమర్శలు
- వేల కోట్ల రూపాయలతో ప్లాస్టిక్ పరిశ్రమ పెట్టేందుకు ముందుకొచ్చిన జర్మనీ కంపెనీ
- కోడూరు మండలం రామకృష్ణాపురంలో భూములు పరిశీలించాలని అధికారుల సిఫార్సు
- ఈ భూములను చూసి వెనుదిరిగిన జర్మనీ కంపెనీ
- ఇదే కోవలో పలు కంపెనీల వెనుకడుగు
మచిలీపట్నం పోర్టు అనుబంధ పరిశ్రమలకు భూముల కేటాయింపులో అధికారులు, పాలకులు నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేల కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టేందుకు పెద్ద కంపెనీలు ప్రతిపాదనలతో ముందుకు వస్తున్నా.. వాటికి అవసరమైన భూములు చూపడంలో విఫలమవుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. భవిష్యత్తులోనూ ఇదే పద్ధతి కొనసాగితే అనుబంధ పరిశ్రమల ఏర్పాటు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పన మరింత ఆలస్యం అయ్యే ప్రమాదం పొంచి ఉంది.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
మచిలీపట్నం పోర్టు పనులు ఇప్పటికే 60 శాతం పూర్తయ్యాయి. ఈ ఏడాది డిసెంబరు నాటికి కాకున్నా, వచ్చే ఏడాది డిసెంబరు నాటికైనా పోర్టు నుంచి ఎగుమతులు, దిగుమతులు ప్రారంభమవుతాయి. పోర్టుకు అనుబంధంగా వివిధ రకాల పరిశ్రమల ఏర్పాటుకు బడా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఈ కంపెనీలకు భూములు కేటాయించే విషయంలో అధికారులు, పాలకులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. పోర్టు నుంచి కార్యకలాపాలు ప్రారంభమైతే సరుకుల ఎగుమతులు, దిగుమతులకు మాత్రమే పరిమితం కాకుండా, ముడి సరుకులను ఆధారంగా చేసుకుని వివిధ రకాల పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. పోర్టుకు అనుబంధంగా పరిశ్రమలు ఏర్పాటు అయితేనే జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెంది, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.
గేట్ వే ఆఫ్ అమరావతిగా మార్పు చేసే అలోచన!
రాష్ట్ర రాజధాని అమరావతికి అత్యంత సమీపంలో మచిలీపట్నం పోర్టు ఉంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్నదీ మచిలీపట్నం పోర్టు మాత్రమే. పోర్టు నిర్మాణం జరిగితే రెండు రాష్ర్టాల నుంచి విదేశాలకు సరుకుల ఎగుమతి, దిగుమతులు తక్కువ ఖర్చుతో చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అఽథారిటీ(ముడా)ని రద్దు చేసి సీఆర్‌డీఏ పరిధిని మచిలీపట్నం వరకు విస్తరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పోర్టు కార్యకలాపాలు ప్రారంభమైతే గేట్ వే ఆఫ్ అమరావతిగా మచిలీపట్నాన్ని మార్చే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్టు తెలిసింది. మచిలీపట్టణాన్ని సీఆర్‌డీఏలో కలిపే ప్రతిపాదన ఉందని సీఎం చంద్రబాబు ఇటీవల సూచన ప్రాయంగా వెల్లడించారు. మచిలీపట్నం పోర్టు నుంచి కార్యకలాపాలు ప్రారంభమైతే హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు జాతీయ రహదారి-65ను 12 లేన్ల రహదారిగా విస్తరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతరెడ్డి పదేపదే కోరుతున్నారు. మచిలీపట్నం పోర్టును ప్రారంభిస్తే రెండు తెలుగు రాష్ర్టాల నుంచి గ్రానైట్, సిమెంట్, బియ్యం, సుగంధద్రవ్యాలు, ఆక్వా ఉత్పత్తులు, కంప్యూటర్‌లు, ఇతరత్రా సరుకులు విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు వెళ్లకుండానే తక్కువ ఖర్చుతో విదేశాలకు ఎగుమతులు చేసేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు వంట నూనెలు, ఎరువులు, క్రూడాయిల్, విద్యుత ప్రాజెక్టులకు ఉపయోగించే బొగ్గును తక్కువ ఖర్చుతోనే దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
బడా పరిశ్రమల ఏర్పాటుకు పలు కంపెనీల ప్రతిపాదనలు ఇలా..
దేశంలోని వివిధ ప్రాంతాలకు సరుకుల రవాణాలో విజయవాడ రైల్వే జంక్షన్ మాదిరిగా, జల రవాణాలో మచిలీపట్నం పోర్టు అన్ని దేశాలకు జంక్షన్‌గా ఉంటుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. దీంతో మచిలీపట్నం పోర్టు నిర్మాణం జరిగితే జిల్లాలో క్రూడాయిల్‌ను ఆధారంగా చేసుకుని ఆయిల్ రిఫైనరీలు, వివిధ రకాల ప్లాస్టిక్ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు దేశ, విదేశాలకు చెందిన కంపెనీలు ముందుకు వస్తున్నాయి.
- జర్మనీకి చెందిన ఓ బడా సంస్థ ప్రతినిధులు ఇటీవల మచిలీపట్నంలో రూ.90 వేల కోట్లతో అత్యాధునిక పద్ధతిలో ప్లాస్టిక్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని, 10 వేల ఎకరాల భూమి కావాలనే ప్రతిపాదన చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ జర్మనీ కంపెనీకి మచిలీపట్నంలో అంతమేర భూమిని కేటాయించలేమని, కోడూరు మండలం రామకృష్ణాపురం, పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించాలని అధికారులు జర్మనీ ప్రతినిధులకు సూచించారు. రామకృష్ణాపురంలోని భూములను పరిశీలించిన అనంతరం జర్మనీ ప్రతినిధులు మారు మాట్లాడకుండా వెనుదిరిగి వెళ్లిపోయారని అధికారులే చెప్పుకుంటున్నారు.
- సుమారు రూ.75వేల కోట్ల వ్యయంతో మచిలీపట్నంలో ఆయిల్ రిఫైనరీని ఏర్పాటు చేసేందుకు కేంద్రప్రభుత్వ సంస్థ ఏడాదిన్నర క్రితం ముందుకు వచ్చింది. మచిలీపట్నం దక్షిణ మండలంలో భారత సాల్ట్‌కు కేటాయించిన 5వేల ఎకరాల భూములను ఆయిల్ రిఫైనరీకి కేటాయించే ప్రతిపాదనను అధికారులు చేశారు. అక్కడ భూమి పరీక్షలు చేసిన అనంతరం వేల కోట్ల రూపాయలు పెట్టుబడిని లోతట్టుగా ఉన్న ఈ భూముల్లో ఏర్పాటు చేసేందుకు అవకాశం లేదని తేల్చడంతో ఈ ఆయిల్ రిఫైనరీ వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది.
- రాజమండ్రికి చెందిన పారిశ్రామికవేత్తలు తమకు 1500 ఎకరాల భూమిని కేటాయిస్తే రూ.10 వేల కోట్లతో స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చారు.
- పలు ఫార్మా కంపెనీలు, ఎరువులకు సంబంధించిన పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని దేశంలోని బడా కంపెనీలు మచిలీపట్నం వచ్చి అధికారులు, పాలకులను కలిసి తమ ప్రతిపాదనలను వివరించారు.
- ఓడల తయారీ, మరమ్మతులు చేసే పరిశ్రమను మచిలీపట్నంలో ఏర్పాటు చేస్తామనే ప్రతిపాదనను గోవా షిప్‌యార్డు కంపెనీ ఇటీవల చేసింది.
- స్కూటర్‌లు తయారు చేసే ఎల్‌ఎంఎల్ కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ప్రతినిధులు ముందుకువచ్చారు. మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో పోర్టుకు అనుబంధంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని పారిశ్రామికవేత్తలు, బడా కంపెనీలు ముందుకువచ్చినా, భూములు కేటాయించే అంశంలో స్పష్టత ఇవ్వకుండా అధికారులు, ప్రభుత్వ పెద్దలు మిన్నకుండిపోవడం విస్మయం గొలుపుతోంది. పోర్టు పనులు పూర్తయ్యే నాటికి అనుబంధ పరిశ్రమల ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేసి, భూముల కేటాయింపులు చేసి తీర ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.