Share News

చిలక్కొట్టుడు!

ABN , Publish Date - Feb 25 , 2026 | 01:17 AM

గ్రామ పంచాయతీ కార్యదర్శులుగా పనిచేసిన అనేక మంది ఇంటి పన్నుల వసూలులో అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ఏటా జరిగే ఆడిట్‌లోనూ చూపకుండా మాయాజాలం ప్రదర్శించారు. ప్రభుత్వం ఇటీవల ఆన్‌లైన్‌ పన్ను వసూలు విధానం ప్రవేశపెట్టడంతో గతంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇదే అదనుగా మచిలీపట్నంలో మండంలోని ఓ పెద్ద పంచాయతీలో కార్యదర్శిగా పనిచేస్తున్న కార్యదర్శి డీపీవో కార్యాలయంలో ఉంటూ చక్రం తిప్పుతున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. ఆయన పనిచేసిన పంచాయతీల్లో కూడా అక్రమాలు జరిగినట్టు తెలిసింది. దీనిపై ఫిర్యాదు చేసేందుకు కూటమి నాయకులు రెడీ అవుతున్నారు.

చిలక్కొట్టుడు!

- ఇంటి పన్నుల వసూలులో కార్యదర్శుల చేతివాటం

- అడిట్‌లోనూ చూపకుండా మాయాజాలం

- ఆన్‌లైన్‌ విధానం అమల్లోకి రావడంతో వెలుగుచూస్తున్న అక్రమాలు

- డీపీవో కార్యాలయంలో ఉంటూ వ్యవహారం నడుపుతున్న పంచాయతీ కార్యదర్శి

- ఆయన పనిచేసిన గ్రామాల్లోనూ అనేక అక్రమాలు

- ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న కూటమి నాయకులు

గ్రామ పంచాయతీ కార్యదర్శులుగా పనిచేసిన అనేక మంది ఇంటి పన్నుల వసూలులో అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ఏటా జరిగే ఆడిట్‌లోనూ చూపకుండా మాయాజాలం ప్రదర్శించారు. ప్రభుత్వం ఇటీవల ఆన్‌లైన్‌ పన్ను వసూలు విధానం ప్రవేశపెట్టడంతో గతంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇదే అదనుగా మచిలీపట్నంలో మండంలోని ఓ పెద్ద పంచాయతీలో కార్యదర్శిగా పనిచేస్తున్న కార్యదర్శి డీపీవో కార్యాలయంలో ఉంటూ చక్రం తిప్పుతున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. ఆయన పనిచేసిన పంచాయతీల్లో కూడా అక్రమాలు జరిగినట్టు తెలిసింది. దీనిపై ఫిర్యాదు చేసేందుకు కూటమి నాయకులు రెడీ అవుతున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:

జిల్లాలోని 474 గ్రామ పంచాయతీల్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.65.61 కోట్ల ఇంటి పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పంచాయతీల్లో ఇంటి పన్నులు, ఆస్తి పన్ను, పంచాయతీ చెరువుల వేలం పాటలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ల ద్వారా వచ్చే అద్దెలు, కాల్వ గట్లు, వలకట్ల పాటలు తదితరాల రూపంలో నగదును వసూలు చేసేవారు. గతంలో పంచాయతీ కార్యదర్శులు లేదా బిల్‌కలెక్టర్‌లు, పంచాయతీ పాలకవర్గం నియమించిన సిబ్బందితో ఈ తరహా పన్నులను నేరుగా వసూలు చేసి పంచాయతీల ఖాతాల్లో జనరల్‌ ఫండ్‌ కింద జమచేసేవారు. దీంతో పాటు 14, 15 ఆర్థిక సంఘం నిధులు ట్రెజరీల్లో జమ అయితే, పంచాయతీల్లో చేసిన పనులను బట్టి ఇంజనీరింగ్‌ అధికారులు చేసిన బిల్లులను ఆధారంగా నగదు డ్రా చేసుకునేవారు. ఈ లెక్కలు కొంతమేర పారదర్శకంగా ఉండేవి కావు. ప్రస్తుతం పంచాయతీలకు ఇంటిపన్నులు, ఇతరత్రాల రూపంలో వచ్చే రాబడి, ఖర్చులకు సంబంధించిన వ్యవహారాలు మొత్తం ఆన్‌లైన్‌ ద్వారానే జరుగుతుండటంతో అసలు లెక్కలు బయటకు వస్తున్నాయని పంచాయతీరాజ్‌ విభాగం అధికారులు చెప్పుకుంటున్నారు.

చక్రం తిప్పుతున్న పంచాయతీ ఉద్యోగి

మచిలీపట్నం మండలం గతంలో ఒకే మండలంగా ఉండేది. ప్రస్తుతం నార్త్‌, సౌత మండలాలుగా విభజించారు. సౌత మండలంలోని పెద్ద పంచాయతీకి కార్యదర్శిగా పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు నిత్యం జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) కార్యాలయంలోనే ఉంటూ జిల్లాలోని పలు పంచాయతీల ఉద్యోగులను తన చెప్పుచేతల్లో పెట్టుకుని తెరవెనుక చక్రం తిప్పుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కాలం వరకు నార్త్‌ మండలంలోని తాళ్లపాలెం, పోతేపల్లి పంచాయతీలకు ఇన్‌చార్జిగా ఈ కార్యదర్శి వ్యవహరించాడు. రెండు పంచాయతీల్లో రూ.5లక్షలు చొప్పున వివిధ రకాల పనులు చేసినట్లుగా చూపి, బిల్లులు చేసేందుకు ప్రయత్నించడంతో సంబంధిత పంచాయతీ పాలకవర్గం సభ్యులు, సిబ్బంది అడ్డుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం మండలస్థాయి అధికారుల వద్దకు వెళ్లడంతో ఈ రెండు పంచాయతీల నుంచి ఈ కార్యదర్శికి అదనపు బాధ్యతలు తప్పించారు. పోతేపల్లి, తాళ్లపాలెం పంచాయతీలకు వేరే ఉద్యోగులను కార్యదర్శులుగా నియమించారు. పోతేపల్లి పంచాయతీలో రోల్డ్‌గోల్డ్‌ పరిశ్రమలు అధికంగా ఉండటంతో ఇంటి పన్నులు, రియల్‌ ఎస్టేట్‌ లేఅవుట్‌లు తదితర కట్టడాల రూపంలో ఈ పంచాయతీకి అధిక ఆదాయం వస్తోంది. దీంతో ఈ కార్యదర్శి ఈ పంచాయతీపైనే అధికంగా దృష్టి సారించి, అక్కడే తిష్టవేసి ఈ పంచాయతీలో ప్రతి అంశాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకుని తెరవెనుక వ్యవహారాలు నడుపుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కూటమి నాయకుల నిఘాతో అక్రమాలు వెలుగులోకి..

పోతేపల్లి పంచాయతీతో సంబంధం లేకున్నా గ్రామ పంచాయతీ కార్యదర్శిగా అక్కడ పెత్తనం చేస్తున్న ఈ కార్యదర్శి వ్యవహారశైలిపై కూటమి నాయకులు కొన్ని రోజులుగా నిఘా పెట్టారు. దీంతో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. పంచాయతీల్లో ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగంలో పనులు జరగకున్నా, జరిగినట్లుగా చూపి బిల్లులు చేయించి, అందుకు ప్రతిఫలంగా నగదు వసూలు చేస్తున్నట్లుగా గుర్తించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ మచిలీపట్నం కార్యాలయంలో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న ఒక ఉద్యోగిని అడ్డుపెట్టుకుని అతని ద్వారా తెరవెనుక బేరాలు కుదుర్చుకుని నగదు వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. సౌత మండలంలోని ఒక పెద్ద పంచాయతీలో రహదారి నిర్మాణం చేయకుండానే చేసినట్టు బిల్లులు చేశారని, ఇందులో ఈ కార్యదర్శి పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కార్యదర్శి బాధ్యతలు చూసిన ప్రతి పంచాయతీలోనూ ఇదే తరహాలో అక్రమాలకు పాల్పడ్డాడని, మరింతలోతుగా విచారణ చేస్తే ఇంటి పన్నుల గోల్‌మాల్‌ అంశాలు బయట పడుతున్నాయని కూటమి నాయకులు అంటున్నారు. ఈ కార్యదర్శి అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Updated Date - Feb 25 , 2026 | 01:17 AM