Minister Narayana: రివర్ బేసిన్ అంటే ఏంటో జగన్‌కు ఏం తెలుసు?
ABN , Publish Date - Jan 09 , 2026 | 04:29 AM
నాడు అసెంబ్లీ సాక్షిగా అమరావతే రాజధాని అని ఒప్పుకున్న జగన్... తన పాలనలో మూడు ముక్కలాట ఆడారు. ఇప్పుడు నదీ గర్భంలో కడుతున్నామనడం...
ఆయన మిడి మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు
రైతుల్ని భయపెట్టేలా తప్పుడు వ్యాఖ్యలు.. సహించం
అమరావతికి చట్ట బద్ధత కల్పిస్తాం: మంత్రి నారాయ
‘నాడు అసెంబ్లీ సాక్షిగా అమరావతే రాజధాని అని ఒప్పుకున్న జగన్... తన పాలనలో మూడు ముక్కలాట ఆడారు. ఇప్పుడు నదీ గర్భంలో కడుతున్నామనడం... విడ్డూరంగా ఉంది’ అని మంత్రి నారాయణ అన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడారు. ‘జగన్ అధికారంలోకి వచ్చాక రాజధానికి భూములిచ్చిన రైతులతో పాటు, పనులు చేసిన కాంట్రాక్టర్లకూ డబ్బులివ్వకుండా మోసం చేశారు. అమరావతిని ధ్వంసం చేశారు. కూటమి అధికారంలోకి రాగానే రాజధాని పనులు పునఃప్రారంభించాం. పనులన్నీ చురుగ్గా సాగుతున్నాయి. రాజధాని నదిలో ఎందుకు కడతాం? అమరావతిపై జగన్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. నదీ గర్భంలో భవనాలు కడుతున్నామా? రివర్ బేసిన్ అంటే ఏమిటో జగన్‌కు తెలుసా? ఆయనకు రివర్ బేసిన్‌కు, రివర్ బెడ్‌కు తేడా తెలీదు. నది వెడల్పు ఎంత? కరకట్ట ఎంత ఉండాలనేది పరిగణనలోకి తీసుకునే భవనాలు కడుతున్నాం. పట్టా భూములు నదీ గర్భంలో ఎక్కడా లేవు. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌లో భూములిచ్చేందుకు రైతులు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. దీన్ని ఎలాగైనా ఆపేయాలని జగన్ విష ప్రచారం చేస్తున్నారు. ఇలా తప్పుడు ప్రచారం చేయడం వల్లే వైసీపీకి 11 సీట్లు వచ్చాయి. ఆయన ఇలాగే మాట్లాడితే ఈసారి అవి కూడా రావు. రాజధాని గ్రామాల్లోనే ఇళ్లు, రోడ్లు అన్నీ ఉన్నాయి. రాజధాని నగరాలన్నీ నదుల ఒడ్డునే ఉన్న విషయం జగన్‌కు తెలియపోవడం విడ్డూరం. వర్షాల కారణంగా అమరావతి పనులు కాస్త ఆలస్యమైనాయి. అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు సీఎం చంద్రబాబు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా అమరావతి నిర్మాణం ఆగదు’ అని మంత్రి స్పష్టంచేశారు.