తిరుమలలో మంచి మార్పులొచ్చాయ్!
ABN , Publish Date - May 20 , 2026 | 05:45 AM
దాదాపు ఆరేడేళ్ల తర్వాత తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చానని, తిరుమలలో చాలా మార్పులను గమనించానని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు.
టీటీడీకి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ధన్యవాదాలు
తిరుమల, మే 19 (ఆంధ్రజ్యోతి): దాదాపు ఆరేడేళ్ల తర్వాత తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చానని, తిరుమలలో చాలా మార్పులను గమనించానని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. తిరుమల శ్రీవారిని మంగళవారం తోమాల సేవలో, ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆయన దర్శించుకున్నారు. ఆయనకు రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం శివకుమార్ ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. చాలా రోజుల తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తిరుమల చాలా అభివృద్ధి చెందిందని, మంచి పరిశుభ్రతతోపాటు మౌలిక వసతులు కల్పిస్తున్నారని తెలిపారు. అద్భుత పరిపాలన చేస్తున్నారంటూ ప్రభుత్వానికి, టీటీడీ అధికార యంత్రాంగానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. ఇక, దేశవ్యాప్తంగా సకాలంలో వర్షాలు కురిసి ప్రజలకు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆర్థికంగా బాగుండాలని స్వామిని ప్రార్థించినట్టు శివకుమార్ చెప్పారు.