Share News

భర్తను చంపేసి.. పెరట్లో పాతేసి..

ABN , Publish Date - Mar 28 , 2026 | 04:58 AM

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను రోకలి బండతో కొట్టి చంపేసింది ఓ మహిళ. మృతదేహాన్ని తన ఇంటి పెరట్లోనే పాతిపెట్టింది. విషయం బయటకు చెబితే చంపేస్తానని కన్న కూతుర్ని కూడా బెదిరించింది.

భర్తను చంపేసి.. పెరట్లో పాతేసి..

  • వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఘాతుకం

  • బయటకు చెబితే చంపేస్తానని కుమార్తెకు బెదిరింపు

  • మూడు నెలల తర్వాత వెలుగులోకి.. అనంతలో దారుణం

కళ్యాణదుర్గం రూరల్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను రోకలి బండతో కొట్టి చంపేసింది ఓ మహిళ. మృతదేహాన్ని తన ఇంటి పెరట్లోనే పాతిపెట్టింది. విషయం బయటకు చెబితే చంపేస్తానని కన్న కూతుర్ని కూడా బెదిరించింది. అలా మూడు నెలలపాటు విషయం బయటకు పొక్కకుండా తొక్కిపెట్టింది. ఆ తర్వాత కన్న కుమార్తెను సైతం చంపేందుకు ప్రయత్నించగా.. ఆ బాలిక తప్పించుకుని వెళ్లి బంధువులకు విషయం చెప్పింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాతచెరువు గ్రా మంలో ఆ దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... బెళుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లికి చెందిన హనుమంతరాయుడు (43), కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామానికి చెందిన సుకన్య సుమారు 18 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు అమృత, కుమారుడు సందీప్‌ ఉన్నారు. వీరు సుమారు 15 ఏళ్లుగా కళ్యాణదుర్గం మండలం పాతచెరువులో ఉంటూ, గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో సుకన్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనికి భర్త హనుమంతరాయుడు అడ్డుగా ఉన్నాడనే కారణంగా మూడు నెలల క్రితం రోకలి బండలో కొట్టి చంపేసింది. మృతదేహాన్ని ఇంటి పెరట్లో పూడ్చిపెట్టింది. ఈ విషయం ఇంటర్మీడియట్‌ చదువుతున్న కూతురు అమృతకు తెలిసింది. ఎవరికైనా చెబితే చంపేస్తానని తల్లి బెదిరించడంతో ఆమె మౌనం వహించింది. ఈ క్రమంలో తల్లీకూతుళ్ల మధ్య శుక్రవారం గొడవ జరిగింది. కూతురు అమృతను హతమార్చడానికి తల్లి ప్రయత్నించగా.. ఆమె తప్పించుకుని పారిపోయింది. తన తండ్రి స్వగ్రామం హనిమిరెడ్డిపల్లికి చేరుకుని, బంధువులకు జరిగిన విషయం చెప్పింది. ఈ క్రమంలో సుకన్య కళ్యాణదుర్గం రూరల్‌ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Mar 28 , 2026 | 04:59 AM