Share News

తిన్న టిఫిన్‌కు డబ్బులడిగాడని.. హోటల్‌ యజమాని దారుణ హత్య

ABN , Publish Date - Mar 01 , 2026 | 06:40 AM

హోటల్‌లో టిఫిన్‌ తిన్నారు.. బిల్లు కట్టమంటే ఎదురుతిరిగారు.. అనంతరం మమ్మల్నే డబ్బులు అడుగుతావా అంటూ కత్తితో విచక్షణారహితంగా నరికేశాడు.

తిన్న టిఫిన్‌కు డబ్బులడిగాడని.. హోటల్‌ యజమాని దారుణ హత్య

  • కత్తితో విచక్షణా రహితంగా వ్యక్తి దాడి

తడ, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): హోటల్‌లో టిఫిన్‌ తిన్నారు.. బిల్లు కట్టమంటే ఎదురుతిరిగారు.. అనంతరం మమ్మల్నే డబ్బులు అడుగుతావా అంటూ కత్తితో విచక్షణారహితంగా నరికేశాడు. తిరుపతి జిల్లా తడ మండలం పెరియవట్టు గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా.. పెరియవట్టు గ్రామానికి చెందిన ప్రభాకర్‌ అలియాస్‌ ప్రభు(40) ఓ దాబా హోటల్‌ను నడుపుతున్నాడు. అదే గ్రామానికి చెందిన దినేష్‌, విఘ్నేష్‌ ప్రభు శనివారం దాబా హోటల్‌ వద్దకు వచ్చి టిఫిన్‌ తిన్నారు. బిల్లు కట్టమని ప్రభు అడగడంతో గొడవ జరిగింది. శనివారం మధ్యాహ్నం ప్రభు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దినేష్‌, విఘ్నేష్‌ కోసం గ్రామానికి వెళ్లారు. వారు లేకపోవడంతో పోలీసుస్టేషన్‌కు రమ్మని చెప్పాల్సిందిగా కుటుంబసభ్యులకు తెలిపారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం పూటుగా మద్యం తాగిన దినేష్‌ పదునైన కత్తి తీసుకొని దాబా హోటల్‌ వద్దకెళ్లి ప్రభుతో మరోసారి గొడవకు దిగాడు. నాపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ చేతిలో ఉన్న కత్తితో విచక్షణారహితంగా నరకడంతో ప్రభు అక్కడికక్కడే మృతి చెందాడు. దినేష్‌ పరారు కాగా, పోలీసులు గాలిస్తున్నారు.

Updated Date - Mar 01 , 2026 | 06:44 AM