12న గుండ్రేవులపై చర్చ
ABN , Publish Date - Feb 07 , 2026 | 11:44 PM
గుండ్రేవుల జలాశయం మూడు రాష్ట్రాల మధ్య సమస్య కాబట్టి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో సంప్రదించి ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో జరిగిన సభలో హామీ ఇచ్చారు.
బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలోకి..
సమగ్ర నివేదిక కోరిన ప్రభుత్వం
ఇప్పటికైనా కొలిక్క రావాలని రైతుల ఆకాంక్ష
కర్నూలు, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): గుండ్రేవుల జలాశయం మూడు రాష్ట్రాల మధ్య సమస్య కాబట్టి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో సంప్రదించి ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో జరిగిన సభలో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 12న అసెంబ్లీలో గుండ్రేవులపై చర్చ జరుగుతుందని, సమగ్ర వివరాలతో కేసీ కెనాల్ నంద్యాల డివిజన ఈఈ, సిబ్బంది 11న హాజరు కావాలంటూ జలవనరుల శాఖ ఫేషీ నుంచి శనివారం ఆదేశాలు అందాయి. సీఎం చంద్రబాబు హామీ ఇచ్చి 24 గంటలు గడవక ముందే ఫేషీ నుంచి నివేదిక కోరడం విశేషం.
కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల కరువు రైతుల జీవనాడి కర్నూలు-కడప (కేసీ) కాలువ. దీని కింద 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. నంద్యాల జిల్లా నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, ఆళ్లగడ్డ జిల్లాల్లో అత్యధికంగా ఆయకట్టు సాగులో ఉంది. కేడబ్ల్యూడీటీ-1 (బచావత అవార్డు) ప్రకారం 31.90 టీఎంసీల నీటి వాటా ఉంది. అందులో పది టీఎంసీలు తుంగభద్ర జలాశయం నుంచి తీసుకోవాల్సి ఉంటే.. 21.90 టీఎంసీలు తుంగభద్ర నదీ ప్రవాహం ద్వారా తీసుకోవాలి. యేటేటా తుంగభద్రకు వరద రోజులు తగ్గిపోతుండడంతో కేసీ కెనాల్ ఖరీఫ్‌లో చివరి ఆయకట్టు, రబీ సాగు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ ఏడాది 402 టీఎంసీలు తుంగభద్ర వరద జిలాలు కృష్ణా నదిలో కలసి అక్కడి నుంచి కడలిపాలు అయ్యాయి. ప్రతియేటా ఇదే పరిస్థితి. నికర జలాల్లో వాటా ఉన్నా.. ఆ నీటిని నిల్వ చేసుకునే జలాశయం లేకపోవడంతో వరద నీటిని వృథాగా వదిలేయక తప్పడం లేదు. 1.20 టీఎంసీల సుంకేసుల బ్యారేజీలో 0.20 టీఎంసీలు పూడిక చేరిందని అంటున్నారు. వాటా నికర జలాలు కృష్ణానదికి వదిలేసి.. శ్రీశైలం జలాశయం ఎగువన ముచ్చమర్రి, హంద్రీనీవా ఎత్తిపోతల పథకాలు ద్వారా కేసీ కాలువకు ఎత్తిపోయాల్సి వస్తున్నది. ఆ నీటి కోసం రైతులు సమరం చేయాల్సి వస్తున్నది. ఈ పరిస్థితి నుంచి కేసీ ఆయకట్టు రైతులను, 6.25 లక్షల జనాభా కలిగిన కర్నూలు నగరం తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని దివంగత రిటైర్డ్ ఇంజనీరు సుబ్బరాయుడు 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల జలాశయం నిర్మాణానికి డిజైన చేశారు. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా ఉమ్మడి రాష్ట్రం చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సర్వేకు జీవో.. నిధులు ఇచ్చారు. హైదరాబాదుకు చెందిన ఆర్వే ఆసోసియేట్స్ సంస్థ క్షేత్రస్థాయిలో సర్వే చేసి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) ప్రభుత్వానికి ఇచ్చింది.
ఫ అటకెక్కించిన వైసీపీ:
గుండ్రేవుల జలాశయం నిర్మాణానికి 2019 ఫిబ్రవరి 21న నాటి సీఎం చంద్రబాబు రూ.2,890 కోట్లు మంజూరు చేస్తూ జీఓ నం.153 జారీ చేశారు. టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలు పెట్టాల్సి ఉండగా.. ఎన్నికలు జరిగి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి సీఎం గుండ్రేవుల అంతర్ రాష్ట్ర సమస్య అంటూ అటకెక్కించారు.
ఫ అసెంబ్లీలో చర్చ ఉంది.. గుండ్రేవుల వివరాలతో రండి:
కలుగొట్ల సభలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు 24 గంటలు గడవక ముందే ఈ నెల 12న బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనసభలో గుండ్రేవులపై చర్చకు సన్నాహాలు జరిగాయి. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర వివరాలతో 11న అమరావతికి రావాలంటూ రాష్ట్ర జలవనరులు శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఫేషీ నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రాజెక్టుల సీఈ కబీర్‌బాషాకు ఆదేశాలు అందాయి. దీంతో గుండ్రేవుల ప్రాజెక్టు డిటైల్ రిపోర్టు, సిబ్బందితో కలసి ఈ నెల 11న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఫేసీకి హాజరు కావాలంటూ ఇరిగేషన కర్నూలు సర్కిల్ ఎస్‌ఈ బాలచంద్రారెడ్డి నంద్యాల కేసీ కెనాల్ డివిజన ఈఈ ప్రతాప్‌కు శనివారం లేఖ రాశారు.
ఫ రూ.5,500 కోట్లకు చేరిన అంచనా:
గుండ్రేవుల నిర్మాణం వల్ల ఏపీలో కర్నూలు జిల్లాలో 6,166.15 ఎకరాలు, 12 గ్రామాలు (8 పూర్తిగా, 4 పాక్షికం) తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లాలో 3,003.24 ఎకరాలు భూములు, ఆరు గ్రామాలు (మూడు పూర్తిగా, రెండు పాక్షికం) ముంపుకు గురవుతాయి. కర్ణాటక రాష్ట్రంలో ఒక గ్రామం పాక్షికంగా ముంపుకు గురవుతుందని అంచనా. 2019 ఫిబ్రవరి డీపీఆర్ ప్రకారం ప్రాజెక్టు నిర్మాణం అంచనా రూ.2,890 కోట్లు. ఇప్పుడది రూ.4,330 కోట్లకు చేరింది. తాజా ఎస్‌ఎస్‌ఆర్ రేట్ల ప్రకారం రూ.5,500 కోట్లకు చేరుతుందని అంచనా.