Share News

ప్రజా సమస్యలపై చర్చించేనా!

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:24 AM

జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యలు గురువారం జరిగే ఉమ్మడి జిల్లా పరిషత సర్వసభ్య సమావేశంలో చర్చకు వచ్చేనా అనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గత సమావేశాల్లో ప్రజా సమస్యలను విస్మరించి వ్యక్తిగత సమస్యలను తెరపైకి తెచ్చి వైసీపీ సభ్యులు సభ జరగకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు అదే పంథాను అనుసరిస్తారా లేక ప్రజల ఇబ్బందులపై దృష్టి పెడతారా అనే అంశంపై రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే అనేక సమస్యలు జిల్లాలో తిష్ట వేశాయి.

 ప్రజా సమస్యలపై చర్చించేనా!

- నేడు జిల్లా పరిషత సర్వసభ్య సమావేశం

- జిల్లా వాసులను వేధిస్తున్న గ్యాస్‌ సమస్య

- ఎరువుల సరఫరాపై ఇప్పటి నుంచే రైతుల్లో ఆందోళన

- కాలనీల్లో సమకూరని మౌలిక వసతులు

- పూర్తిస్థాయిలో హాజరుకాని ఉమ్మడి జిల్లా శాసన సభ్యులు

జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యలు గురువారం జరిగే ఉమ్మడి జిల్లా పరిషత సర్వసభ్య సమావేశంలో చర్చకు వచ్చేనా అనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గత సమావేశాల్లో ప్రజా సమస్యలను విస్మరించి వ్యక్తిగత సమస్యలను తెరపైకి తెచ్చి వైసీపీ సభ్యులు సభ జరగకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు అదే పంథాను అనుసరిస్తారా లేక ప్రజల ఇబ్బందులపై దృష్టి పెడతారా అనే అంశంపై రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే అనేక సమస్యలు జిల్లాలో తిష్ట వేశాయి.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

జిల్లా పరిషత సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక అధ్యక్షతన జెడ్పీ సమావేశపు హాలులో గురువారం ఉదయం 11 గంటలకు జరగనుంది. జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో చర్చించి, వాటి పరిష్కారం కోసం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. అయితే గతంలో రెండు విడతలుగా జరిగిన సమావేశాలను జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు తమకు గౌరవవేతనం ఇవ్వడం లేదని, ఇతరత్రా అంశాలను చూపి బహిష్కరించారు. ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలో జడ్పీ నిధులతో కేటాయించిన పనులను జడ్పీ సీఈవో రద్దు చేశారనే కారణంతో జడ్పీటీసీలు, ఎంపీపీలు సమావేశం జరగకుండా అడ్డుకున్నారు. సెప్టెంబరు నెలతో జడ్పీ పాలకవర్గం పదవీకాలం పూర్తికానున్న నేపథ్యంలో గురువారం జరిగే జడ్పీ సర్వసభ్య సమావేశంలో జిల్లాలో నెలకొన్న సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారం కోసం సముచిత నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు హాజరయ్యేనా!

జిల్లాల విభజన జరిగినప్పటికీ జిల్లాపరిషత పాలకవర్గం ఉమ్మడి జిల్లా పరిధిలోనే కొనసాగుతోంది. జిల్లా పరిషత సర్వసభ్య సమావేశాలకు జిల్లాకు చెందిన 16 మంది శాసన సభ్యులు హాజరై జిల్లాలో నెలకొన్న సమస్యలపై చర్చించి, ప్రధాన సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్టీఆర్‌, ఏలూరు జిల్లాలకు చెందిన శాసన సభ్యులు ఒక్క సమావేశానికి కూడా హాజరుకాలేదు. కృష్ణాజిల్లాకు చెందిన శాసన సభ్యులు కూడా హాజరుకావడం లేదు. గతంలో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన శాసన సభ్యులు సమావేశానికి హాజరై ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరిపేవారు. దీంతో జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలు పరిష్కారమయ్యేవి. కానీ ఎన్టీఆర్‌, ఏలూరు, కృష్ణాజిల్లాలకు చెందిన శాసన సభ్యులు జడ్పీ సమావేశాలకు రాకపోవడంతో ప్రధాన సమస్యలపై చర్చ జరగడం లేదు. జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు వివిధ ప్రజాసమస్యలపై నిలదీస్తే అధికారులు చూస్తాం, చేస్తాం అంటూ చెప్పి సాచివేత ధోరణిని అవలంభిస్తున్నారు.

యూరియా, గ్యాస్‌ సమస్యపై ఆందోళన

పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో జిల్లాలో గ్యాస్‌ సమస్య వేధిస్తోంది. ఇప్పటికే గ్యాస్‌ బుకింగ్‌పై ఆంక్షలు విధించారు. గ్యాస్‌ సరఫరా సక్రమంగా జరగకపోవడంతో ఈ ప్రభావం జిల్లాలోని అన్ని రంగాల వారిపై పడుతోంది. రానున్న రోజుల్లో గ్యాస్‌ బుకింగ్‌ చేసుకునేందుకు గడువును మరిన్ని రోజులు పెంచుతారని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో గ్యాస్‌ సర ఫరాపై జడ్పీ సమావేశంలో చర్చించాల్సిన అవసరం ఉంది. జిల్లాలో గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధించింది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో రైతులకు ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో యూరియా అందదనే ప్రచారం ఇప్పటినుంచే జరుగుతోంది. ఖరీఫ్‌, రబీ సీజన్‌లకు సంబంధించి జూన్‌ నుంచి పంటల కాలం పూర్తయ్యేవరకు యూరియా కొరత లేకుండా చూడాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించి అఽఽధికారులను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి జిల్లాలో 1400 పైగా లేఅవుట్‌లు ఉన్నాయి. వాటిలో కనీస వసతులులేవు. ఈ లేఅవుట్‌లలో ఈ వేసవిలో రహదారుల నిర్మాణం, తాగునీటి పైపులైన్లు, విద్యుత లైన్ల ఏర్పాటు వంటి పనులు చేపట్టాల్సి ఉంది.

మాఫియా చేతుల్లో ఇసుక అక్రమ రవాణా!

కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విఽధానాన్ని ప్రవేశపెట్టినా తోట్లవల్లూరు, ఘంటసాల, అవనిగడ్డ, పెనమలూరు మండలాల పరిధిలోని ఇసుకరేవుల నుంచి ఇసుక రవాణా ప్రక్రియ యావత్తు ఇసుక మాఫియా చేతుల్లోనే నడుస్తోంది. రాత్రి సమయంలో వందలాది లారీల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇంతా జరుగుతున్నా రెవెన్యూ, పోలీస్‌, మైనింగ్‌శాఖల అధికారులు ఆవైౖపునకు కన్నెత్తి చూడటంలేదు. నూతన ఇసుక రేవులకు అనుమతులు ఇచ్చే అంశాలను ఇసుక మాఫియా తన చెప్పుచేతల్లోనే పెట్టుకుని తెరవెనుక వ్యవహారాలు నడుపుతోంది. జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు కురిసి కృష్ణానదికి వరదలు వస్తే ఇసుక కొరత ఏర్పడుతుంది. ఇసుక కొరత ఏర్పడకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపైనా ఈ సమావేశంలో చర్చించాలి.

ఖరీఫ్‌కు సాగునీటి విడుదలపై స్పష్టత అవసరం

కృష్ణాడెల్టాలో ఖరీఫ్‌ సీజన్‌కు సాగునీటిని విడుదలచేసే తేదీతో పాటు, ఎరువులు, విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచడం తదితర ప్రధాన అంశాలపై సమగ్రంగా చర్చించి, సానుకూలమైన నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లాలో రహదారులతోపాటు, వివిధ అభివృద్ధి పనులు, పంట కాల్వలు, డ్రెయినేజీల్లో నీటి ప్రవాహానికి అడ్డులేకుండా ఓఅండ్‌ఎం పనుల నిర్వహణ, నిధుల కేటాయింపు, తదితర అంశాలపై చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.

Updated Date - Apr 09 , 2026 | 12:24 AM