Share News

లోటు రూ.15,651 కోట్లు!

ABN , Publish Date - Jan 22 , 2026 | 04:15 AM

విద్యుత్తు కొనుగోలు, పంపిణీ ఆదాయ వ్యయాల మధ్య 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారు రూ.15,651 కోట్ల లోటును మూడు డిస్కమ్‌లు ప్రతిపాదించాయి.

లోటు రూ.15,651 కోట్లు!

  • గృహ వినియోగదారులపై ఆ భారం మోపం: డిస్కమ్‌లు

  • వాణిజ్య వినియోగదారుల నుంచే లోటు భర్తీ

  • 2026-27 కోసం డిస్కమ్‌ల ప్రతిపాదన

  • ఇప్పటికే ఏపీఈఆర్సీకి నివేదన

  • దీనిపై నేడు, రేపు విజయవాడలో ప్రజాభిప్రాయ సేకరణ

అమరావతి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు కొనుగోలు, పంపిణీ ఆదాయ వ్యయాల మధ్య 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారు రూ.15,651 కోట్ల లోటును మూడు డిస్కమ్‌లు ప్రతిపాదించాయి. అయితే, గృహ వినియోగదారులపై ఆ భారం మోపబోమని స్పష్టం చేశాయి. వాణిజ్య వినియోగదారుల నుంచే ఈ మొత్తం లోటును భర్తీ చేసుకుంటామని తెలిపాయి. ఈ మేరకు విద్యుత్తు నియంత్రణ మండలికి (ఏపీఈఆర్సీ) గత ఏడాది నవంబరులో ప్రతిపాదనలు సమర్పించాయి. వీటిపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని ఏపీఈఆర్సీ సేకరిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 20న తిరుపతిలో ప్రజాభిప్రాయసేకరణ చేపట్టగా, గురు, శుక్రవారాల్లో విజయవాడలో ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రెండు రోజులపాటు ఏపీఈఆర్సీ ఇన్‌చార్జి చైర్మన్‌ పీవీఆర్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో డిస్కమ్‌లు ప్రతిపాదించిన విద్యుత్తు యూనిట్ల ధరలు, వివిధ కేటగిరీల టారి్‌ఫలపై వినతులు, అభిప్రాయాలు సేకరిస్తారు. 27న కర్నూలులో ప్రజాభిప్రాయ సేకరణ జరపనున్నారు. ఏటా రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయవ్యయాల ప్రతిపాదనలను ఏపీఈఆర్సీకి డిస్కమ్‌లు సమర్పిస్తాయి. వీటిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన అనంతరం వాటి ప్రతిపాదనల్లో కోత విధించాలా లేక యథాతథంగా ఆమోదించాలా అన్న అంశంపై ఏపీఈఆర్సీ నిర్ణయం తీసుకుంటుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. ఏపీఎస్పీడీసీఎల్‌ సమర్పించిన ఆదాయవ్యయాల ప్రతిపాదనల నివేదికలో రూ.7,733.85 కోట్ల లోటును పేర్కొంది. ఏపీసీపీడీసీఎల్‌ తన నివేదికలో రూ.3,465.35 కోట్ల లోటు ఉన్నట్టు తెలిపింది. ఏపీఈపీడీసీఎల్‌ తన నివేదికలో రూ.4,452.73 కోట్ల లోటును పేర్కొంది. మొత్తం మీద మూడు డిస్కమ్‌ లు కలిపి రూ.15,651.93 కోట్ల లోటును ప్రతిపాదించాయి.

Updated Date - Jan 22 , 2026 | 04:15 AM