Share News

డిస్కంల మోసం..!

ABN , Publish Date - Jan 24 , 2026 | 07:00 AM

సోలార్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న చిన్న వినియోగదారులను డిస్కంలు మోసం చేస్తున్నాయని పలువురు వక్తలు విద్యుత్‌ నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు.

డిస్కంల మోసం..!

  • ‘సోలార్‌’లో చిన్న వినియోగదారులపై వివక్ష

  • కంపెనీల నుంచి బకాయిలు వసూలు చేయాలి

  • నెల బిల్లు చెల్లించకపోతే కనెక్షన్‌ తొలగించాలి

  • ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణలో వక్తలు

విజయవాడ, జనవరి 23(ఆంధ్రజ్యోతి): సోలార్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న చిన్న వినియోగదారులను డిస్కంలు మోసం చేస్తున్నాయని పలువురు వక్తలు విద్యుత్‌ నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు. సోలార్‌ విద్యుత్‌కు సంబంధించిన చెల్లింపుల విషయంలో చిన్న వినియోగదారుల పట్ల ఒకవిధంగా, పెద్ద కంపెనీల పట్ల మరోలా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. 2026-27 విద్యుత్‌ చార్జీల సవరణకు సంబంధించి విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్సీ) శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. విద్యుత్‌రంగ నిపుణులు, టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ నేతలు, సీపీఐ నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి సాంబరెడ్డి మాట్లాడు తూ... ఇళ్లపై సోలార్‌ విద్యుత్‌ను ఏర్పాటు చేసుకున్నవారు ఉపయోగించుకున్న యూనిట్లుపోను మిగిలిన యూనిట్లను విక్రయిస్తే ఒక్కో యూనిట్‌కు రూ.2 చెల్లిస్తున్నారన్నారు. అదే వివిధ ప్రైవేటు సంస్థలకు మాత్రం రూ.4.05 చెలిస్తున్నారని వివరించారు. చిన్న వినియోగదారులను నిరుత్సాహపరచవద్దని, వారికీ రూ.4.05 చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఆంజనేయులు మాట్లాడుతూ.. డిస్కంలు చార్జీలు పెంచడం లేదని చెబుతూనే ప్రతి ఏటా ట్రూ అ్‌పలు, ఎఫ్‌పీపీసీల పేరుతో ఆ ఏడాది వాడిన యూనిట్లపైనే చార్జీలు వసూలు చేస్తున్నాయన్నారు. ప్రజాభిప్రాయసేకరణలో మా త్రం ఎలాంటి చార్జీలు పెంచడం లేదని డిస్కంలు చూపిస్తున్నాయన్నారు.


డిస్కంలు టైమ్‌ ఆఫ్‌ ది డేను మార్పు చేశాయన్నారు. ప్రజల ఏ సమయం లో విద్యుత్‌ను వినియోగిస్తున్నారో దాన్ని బట్టి మార్పు చేయాలని సూచించారు. సబ్సిడీలు 2024 మార్చి నాటికి రూ.11,776 కోట్లు, సెప్టెంబరు నాటికి రూ.12,718 కోట్లకు చేరాయని, సబ్సిడీలకు సంబంధించిన డబ్బులను ప్రభుత్వం ఏనాడూ పూర్తిగా ఇవ్వలేదని అన్నారు. ఈడీసీఎల్‌లో 2014-15 నుంచి 2021-22 వరకు ఎనిమిదేళ్లపాటు సబ్సిడీలు ఇవ్వలేదన్నారు. సాధారణ వినియోగదారుడు ఒక నెల బిల్లు చెల్లించకపోతే కనెక్షన్‌ తొలగిస్తున్నట్టుగానే ప్రైవేటు సంస్థలకు చేయాలని సూచించారు. బకాయిలను మార్చి లోపు వసూలు చేయాలని డిమాండ్‌ చేశారు. మత సంస్థలకు యూనిట్‌కు రూ.5, ఎత్తిపోతల, తాగునీటి పథకాలకు రూ.7 వసూలు చేయడం సరికాదన్నారు. సీపీఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. అనేక ప్రజాభిప్రాయ సేకరణలో తాము చేసిన ప్రతిపాదనలు ఈఆర్సీ పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు.

Updated Date - Jan 24 , 2026 | 07:00 AM