Share News

సిరసపల్లి సమీపంలో బీభత్సం

ABN , Publish Date - May 18 , 2026 | 11:58 PM

అనకాపల్లి మండలం జీవీఎంసీ విలీన గ్రామాలైన సిరసపల్లి సమీప జాతీయ రహదారిపై ఆదివారం అర్థరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఎటువంటి ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

సిరసపల్లి సమీపంలో బీభత్సం
బోల్తా పడిన మామిడిపండ్ల ఆటో

మామిడిపండ్ల లోడుతో వెళుతున్న ఆటో బోల్తా

వెనుక వస్తున్న వాహనాలు నిలిపివేత

ఆగి ఉన్న వాహనాలను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

తప్పిన పెనుప్రమాదం

కొత్తూరు, మే 18 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి మండలం జీవీఎంసీ విలీన గ్రామాలైన సిరసపల్లి సమీప జాతీయ రహదారిపై ఆదివారం అర్థరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఎటువంటి ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించి అనకాపల్లి రూరల్‌ ఎస్‌ఐ జి.రవికుమార్‌ సోమవారం తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. ఆదివారం అర్థరాత్రి 1.30 గంటల సమయంలో అనకాపల్లి నుంచి విశాఖపట్నం వైపు మామిడిపండ్ల లోడుతో వెళుతున్న ఒక ఆటో ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. దీనిని గమనించిన వెనుక వస్తున్న మూడు కార్లలోని ప్రయాణికులు కార్లను నిలిపివేసి బోల్తా పడిన ఆటోను సరి చేస్తున్న క్రమంలో వెనుక కొబ్బరికాయల లోడుతో ఆగి ఉన్న వ్యాన్‌ను రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం మీదుగా టెక్కలి వెళుతున్న ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో ఆ వ్యాన్‌ ముందుకు దూసుకుపోయి కార్లను ఢీకొంది. ఈ ప్రమాదంలో ముందు ఉన్న రెండు కార్లు పూర్తిగా ధ్వంసం కావడమే కాకుండా బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. అయితే బస్సులోని ప్రయాణికులు, కార్లలో ఉన్న వారికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న అనకాపల్లి రూరల్‌ ఎస్‌ఐ రవికుమార్‌, సిబ్బంది, నైట్‌ రౌండ్స్‌ సీఐ సీహెచ్‌ నర్సింగరావు సంఘటనా స్థలానికి చేరుకొని బస్సులోని ప్రయాణికులను వేరే బస్సులో విశాఖపట్నం పంపించారు. బోల్తా పడిన మామిడిపండ్ల ఆటోను, వ్యాన్‌ను రోడ్డు పైనుంచి తరలించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూశారు.

Updated Date - May 18 , 2026 | 11:58 PM