Share News

ఇంజనీరింగ్‌కు డిప్లొమా దారి!

ABN , Publish Date - Jul 11 , 2026 | 04:44 AM

బీటెక్‌లో చేరుతున్న విద్యార్థులు ప్రధానంగా డిప్లొమాను ఎంచుకుంటున్నారు. వాస్తవానికి ఇంజనీరింగ్‌లో చేరేందుకు ఇంటర్మీడియట్‌ తర్వాత ఈఏపీసెట్‌ లేదా మేనేజ్‌మెంట్‌ కోటా ద్వారా బీటెక్‌లో చేరే అవకాశం ఉంది.

ఇంజనీరింగ్‌కు డిప్లొమా దారి!

  • విద్యార్థుల ప్రధాన ఆప్షన్‌ ఇదే

  • డిప్లొమా పూర్తికాగానే ఈసెట్‌

  • అనంతరం ‘బీటెక్‌’ ప్రవేశాలు అనుభవం ఉండడమే కారణం

  • ఈ ఏడాది తొలిదశ అడ్మిషన్లలో 43 వేల మంది అభ్యర్థులు చేరిక

  • మూడేళ్లలో 47-62 శాతానికి పెంపు

డిప్లొమా చదివిన అభ్యర్థులకు ఏపీ సహా ఇతర రాష్ర్టాల్లో డిమాండ్‌ ఉంది. సూపర్‌వైజింగ్‌ స్థాయిలో వీరిని నియమించుకునేందుకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయి. మంచి ప్యాకేజీలను కూడా ఆఫర్‌ చేస్తున్నాయి. అయినప్పటికీ కొందరు బీటెక్‌ వైపు మొగ్గు చూపుతున్నారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

బీటెక్‌లో చేరుతున్న విద్యార్థులు ప్రధానంగా డిప్లొమాను ఎంచుకుంటున్నారు. వాస్తవానికి ఇంజనీరింగ్‌లో చేరేందుకు ఇంటర్మీడియట్‌ తర్వాత ఈఏపీసెట్‌ లేదా మేనేజ్‌మెంట్‌ కోటా ద్వారా బీటెక్‌లో చేరే అవకాశం ఉంది. అలాగే, పదో తరగతి తర్వాత డిప్లొమా చేసి అనంతరం లేటరల్‌ ఎంట్రీ విధానంలో ‘ఈసెట్‌’ రాసి బీటెక్‌లో చేరొచ్చు. అయితే, గత మూడేళ్లుగా బీటెక్‌లో చేరేవారిలో డిప్లొమా నుంచి వచ్చేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇంటర్‌ ద్వారా బీటెక్‌ చేసినా, డిప్లొమా ద్వారా బీటెక్‌ చేసినా మొత్తంగా ఆరేళ్లే పడుతుంది. అలాంటప్పుడు డిప్లొమా ద్వారానే బీటెక్‌ చదవడం ఉత్తమమని విద్యార్థులు భావిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం.. డిప్లొమా ద్వారా బీటెక్‌లో చేరేవారికి ప్రాక్టికల్‌ అనుభవం ఎక్కువగా ఉండడమే. దీంతో డిప్లొమా ద్వారా ఇంజనీరింగ్‌ కోర్సుకు వెళ్లేందుకు ఆసక్తి చూపే వారి సంఖ్య పెరుగుతోంది. ఈసెట్‌ ద్వారా వచ్చేవారికి బీటెక్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ సీటు కూడా సులభంగా లభిస్తోంది. దీంతో ఈసెట్‌ రాసిన వారు బీటెక్‌కు మొగ్గు చూపుతున్నారు. గతేడాది ఈసెట్‌ ద్వారా 21 వేల మంది బీటెక్‌లో చేరారు. ఈ ఏడాది ఇంతకుమించి చేరతారనే అంచనాలు ఉన్నాయి. కాగా, ప్రస్తుతం కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది.


పనిచేస్తూనే చదువుకునే చాన్స్‌

ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో చదివిన వారిలో 51శాతం మంది, ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో చదివినవారిలో దాదాపు 90శాతం మంది ఇంజనీరింగ్‌ బాట పడుతున్నారు. దీంతో డిప్లొమాలో ఒకటి రెండు సబ్జెక్టుల్లో ఫెయిలైన వారికి కూడా కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. ఉత్పత్తి రంగంలోని కంపెనీలకు అటు ఐటీఐ చదివినవారు, ఇటు బీటెక్‌ చదివిన వారు దొరుకుతున్నా.. డిప్లొమా చదివిన వారు మాత్రం దొరకడం లేదు. ఈ క్రమంలో కొన్ని కంపెనీలు అక్కడ పనిచేస్తూనే ఉన్నత విద్య చదువుకునే అవకాశం కూడా కల్పిస్తున్నాయి.

పెరుగుతున్న సీట్లు

ఈ సంవత్సరం పాలీసెట్‌ రాసిన వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. 1.63లక్షల మంది పాలీసెట్‌ రాయగా వారిలో 1.48 లక్షల మంది అర్హత సాధించారు. గతేడాది కంటే దాదాపు 16 వేల మంది అదనంగా అర్హత సాధించారు. దీంతో డిప్లొమా అడ్మిషన్లు పెరుగుతున్నాయి. డిప్లొమాలో చేరేవారి సంఖ్య పెరుగుతున్నందున పాలిటెక్నిక్‌ కాలేజీల్లో సీట్లు పెంచుకుంటున్నాయి. ఈ ఏడాది దాదాపు 7వేల సీట్లకు అదనంగా ఏఐసీటీఈ నుంచి అనుమతులు వచ్చాయి. కొత్తగా తొమ్మిది పాలిటెక్నిక్‌ కాలేజీలు ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభంకావడం పాలీసెట్‌కు ఉన్న డిమాండ్‌ను స్పష్టం చేస్తోంది.


గత మూడేళ్లుగా..

గత మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే డిప్లొమా కోర్సుల్లో చేరే వారి సంఖ్య భారీగా పెరిగింది. 2023-24లో 39,044 మంది డిప్లొమా కోర్సుల్లో చేరారు. 2024-25 నాటికి అది 41,985కు చేరింది. 2025-26లో ఏకంగా 49,786 మంది డిప్లొమాలో చేరారు. 2026-27 పాలీసెట్‌ కౌన్సెలింగ్‌ తొలిదశలో అడ్మిషన్లు పొందిన వారి జాబితా ఇటీవల విడుదల చేయగా 42,925 మందికి సీట్లు లభించాయి. ఇంకా రెండు, మూడు విడతల కౌన్సెలింగ్‌ ప్రక్రియ జరగాల్సి ఉంది. ఇవి కూడా పూర్తయితే చేరేవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది, దాదాపు గతేడాది జరిగిన అడ్మిషన్ల స్థాయిలోనే ఉంటుందనని భావిస్తున్నారు. డిప్లొమాలో చేరుతున్న విద్యార్థులను గమనిస్తే.. వారి కుటుంబాల ఆర్థిక స్థితి కూడా ఓ కారణంగా కనిపిస్తోంది. మెడిసిన్‌ వైపు వెళ్లేవారు, జేఈఈ ద్వారా ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో చేరాలనుకునే వారు తప్పనిసరిగా ఇంటర్‌ చదవాలి. అయితే, రాష్ట్ర స్థాయిలో ఈఏపీసెట్‌ ద్వారా బీటెక్‌లో చేరాలన్నా ఇంటర్మీడియట్‌కు భారీగా ఖర్చు అవుతోంది. అదే డిప్లొమాలో చేరితో ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకం వర్తిస్తుంది. తర్వాత మూడేళ్లు బీటెక్‌లోనూ ఆ పథకం అమలవుతోంది. దీంతో అధిక సంఖ్యలో విద్యార్థులు డిప్లొమా ద్వారా బీటెక్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. బీటెక్‌లో చేరిన వారు 2023-24లో 47.1శాతం ఉంటే, గతేడాది 62.2శాతానికి చేరింది.

Updated Date - Jul 11 , 2026 | 04:45 AM