Share News

ఉసురు తీసిన వంచన!

ABN , Publish Date - Mar 10 , 2026 | 05:41 AM

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన మెడికల్‌ పీజీ విద్యార్థిని బత్తుల దీపిక (27) కేసులో మిస్టరీ వీడింది.

ఉసురు తీసిన వంచన!

  • ప్రేమ పేరిట మోసాన్ని తట్టుకోలేక ఆత్మహత్య

  • మెడికో దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

  • ప్రభుత్వ వైద్యుడు అమర్‌ సాహస్‌ అరెస్టు

  • ఏడాదిగా అమర్‌-దీపిక మధ్య ప్రేమాయణం

  • మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమైన ప్రియుడు

  • మోసాన్ని జీర్ణించుకోలేని మెడికో బలవన్మరణం

  • విక్రోనియం బ్రోమైడ్‌ ఇంజక్షన్‌ చేసుకుని మృతి

  • ఘటనకు ముందు ఇద్దరి మధ్య ఫోన్‌లో చాట్‌ వార్‌

విజయవాడ, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన మెడికల్‌ పీజీ విద్యార్థిని బత్తుల దీపిక (27) కేసులో మిస్టరీ వీడింది. ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్న యువకుడు ప్రేమ పేరుతో మోసం చేయడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు. దీంతో ఆ యువకుడిని మాచవరం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అనంతపురానికి చెందిన బత్తుల దీపిక విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో అనస్థీషియా విభాగంలో పీజీ చివరి సంవత్సరం చదివేది. హైదరాబాద్‌కు చెందిన అమర్‌ సాహస్‌ ఆమెకు సీనియర్‌. ప్రస్తుతం ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్నాడు. ఏడాది కాలంగా దీపికతో ప్రేమాయణం నడిపాడు. తనతోపాటు చదువుకున్న యువతితోనూ ప్రేమలో ఉన్నాడు. ప్రస్తుతం ఆమె కర్ణాటకలో పీజీ చేస్తోంది. ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన అమర్‌ నెమ్మదిగా దీపికను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఇది గ్రహించిన ఆమె నిలదీయడంతో ఇద్దరి మధ్య కొన్ని నెలలుగా గొడవలు జరుగుతున్నాయి.


ఆ రోజు ఏం జరిగిందంటే..

గత ఫిబ్రవరి 5న దీపిక రాత్రిపూట విధులకు హాజరైంది. సీ బ్లాక్‌ రెండో అంతస్తులోని పీజీ డ్యూటీ గదిలో ఉంది. ఫస్టియర్‌ విద్యార్థిని దివ్య కూడా ఆమెతోపాటు విధుల్లో ఉంది. ఇద్దరూ కలిసి ఫ్రైడ్‌రైస్‌ తెప్పించుకుని తిన్నారు. తర్వాత తనకు వాంతయ్యేలా ఉండడంతో ఉపశమనానికి అన్‌డెన్‌ పెక్ట్రాన్ ఇంజక్షన్‌ను దివ్యతో చేయించుకుంది. ఆ తర్వాత అత్యవసర విభాగంలో రోగిని పరీక్షించేందుకు దివ్య వెళ్లింది. ఆమె వెళ్లిన తర్వాత అమర్‌కు దీపిక ఫోన్‌ చేసింది. ఇద్దరి మధ్య అరట్టై (ఏఐ) చాటింగ్‌ యాప్‌లో రెండు గంటల పాటు వార్‌ నడిచింది. ఈ క్రమంలోనే తనను ప్రేమించి మరో అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావని దీపిక నిలదీసింది. దీంతో దీపికను పెళ్లి చేసుకునేది లేదని అమర్‌ స్పష్టం చేశాడు. సరే కూర్చుని మాట్లాడుకుందాం ఆస్పత్రికి వద్దకు రమ్మని అడిగితే రానని తెగేసి చెప్పాడు. దీంతో దీపిక మనస్తాపం చెందింది. బ్యాగ్‌లో ఉన్న విక్రోనియం బ్రొమైడ్‌ మత్తు ఇంజక్షన్‌ చేసుకుంది. ఆ తర్వాత ఆమె నోటి నుంచి నురగలు కక్కుకుని ప్రాణాలు కోల్పోపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మాచవరం పోలీసులు... దీపిక ఫోన్‌ను స్వాధీనం చేసుకుని విశ్లేషించారు. ఈ క్రమంలో ఆమె అమర్‌కు ఎక్కువ కాల్స్‌ చేసినట్టుగా స్పష్టమైంది. అరట్టైలో కాల్స్‌తోపాటు చాటింగ్‌ ఉంది. దీనితో పోలీసులు అమర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, దీపిక ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ నివేదిక సోమవారం పోలీసులకు చేరింది. ఆమె శరీరంలో మత్తు ఇంజక్షన్‌ నమూనాలు ఉన్నట్టు నిపుణులు నివేదికలో పేర్కొన్నారు.

Updated Date - Mar 10 , 2026 | 05:42 AM