డిజిటల్ పురపాలన ప్రతి ఇంటికీ డిజిటల్ నంబర్
ABN , Publish Date - Jun 27 , 2026 | 04:26 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్ర-2047 విజన్‌ను మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ అందిపుచ్చుకుంటోంది. సాంకేతికత ఆధారిత పాలనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనుంది.
జీఐఎస్ మ్యాపింగ్, క్యూఆర్ కోడ్ కూడా
స్కాన్ చేస్తే అరచేతిలోకి ప్రాపర్టీ సమగ్ర సమాచారం, సమస్త సేవలు
123 పట్టణాల్లో 50 లక్షల ఆస్తులతో అర్బన్ డిజిటల్ రిజిస్ట్రీకి శ్రీకారం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్ర-2047 విజన్‌ను మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ అందిపుచ్చుకుంటోంది. సాంకేతికత ఆధారిత పాలనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనుంది. పట్టణ పాలనను పూర్తిగా డిజిటల్, పారదర్శక, ప్రజా కేంద్రీకృత వ్యవస్థగా మార్చే దిశగా కీలక అడుగు వేసింది. ప్రభుత్వ సేవలను ప్రజలకు వేగంగా, పారదర్శకంగా అందించడంతో పాటు ప్రతి నిర్ణయం డేటా ఆధారంగా ఉండేలా పాలనను మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఆ దిశలోనే రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని సుమారు 50 లక్షల ఆస్తులకు ప్రత్యేక డిజిటల్ గుర్తింపు(అర్బన్ డిజిటల్ రిజిస్ట్రీ) కల్పించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ప్రతి ఆస్తికీ డిజిటల్ డోర్ నంబర్, జీఐఎస్ మ్యాపింగ్, క్యూఆర్ కోడ్ జతచేసి ఒకే డిజిటల్ వేదికపై అన్ని పౌర సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ప్రాజెక్టు దేశంలోనే అత్యాధునిక పట్టణ డిజిటల్ పాలనకు బాటలు వేయనుంది. ప్రస్తుతం మున్సిపల్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, విద్యుత్, నీటి సరఫరా, టౌన్‌ప్లానింగ్ వంటి విభాగాల్లో ఆస్తుల వివరాలు వేర్వేరుగా ఉండటం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకే ఆస్తికి వేర్వేరు రికార్డులు ఉండటం, పన్నుల అంచనాల్లో తేడాలు, సేవల జాప్యం, ప్రభుత్వ పథకాల అమల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారంగా అర్బన్ డిజిటల్ రిజిస్ట్రీని ప్రభుత్వం రూపొందించింది.
ఒక్క క్యూఆర్‌తో అన్ని సేవలూ...
ప్రతి ఆస్తికీ ప్రత్యేక క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేస్తారు. దానిని మొబైల్‌తో స్కాన్ చేస్తే... ఆస్తి వివరాలు, వివిధ పన్నుల, బిల్లుల చెల్లింపు, మన మిత్ర సేవలు, ఫిర్యాదుల నమోదు, ప్రభుత్వ పథకాల సమాచారం, అత్యవసర సేవలు, స్థానిక ప్రకటనలు... అన్నీ ఒకే వేదికలో అందుబాటులోకి వస్తాయి.
ఆరు కీలక సేవా విభాగాలు...
అర్బన్ డిజిటల్ రిజిస్ట్రీలో ఆరు ప్రధాన మాడ్యూల్స్... 1) పౌరసేవలు, 2) ఆస్తిపన్ను, జనన, మరణ ధ్రువపత్రాలు, 3) ట్రేడ్ లైసెన్స్ సేవల స్థితి ట్రాకింగ్, స్థానిక వ్యాపార అనుసంధానం, 4) రాష్ట్ర ప్రభుత్వ సేవల సమీకరణ, 5) అత్యవసర సేవల నిర్వహణ, 6) ఏఐ ఆధారిత 24 గంటల పౌర సహాయక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.
మున్సిపల్ ఆదాయాలకు భారీ ఊతం...
డిజిటల్ రిజిస్ట్రీతో ఇప్పటి వరకు పన్ను పరిధిలో లేని లేదా తక్కువ అంచనాతో ఉన్న ఆస్తులను గుర్తించడం సులభమవుతుంది. పన్ను ఎగవేత తగ్గి మున్సిపల్ ఆదాయాలు 15 నుంచి 20 శాతం వరకు పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని వల్ల మౌలిక సదుపాయాల అభివృద్ధికి అదనపు నిధులు లభిస్తాయి. అగ్ని ప్రమాదాలు, వరదలు, వైద్య అత్యవసర పరిస్థితుల్లో జీఐఎస్ ఆధారిత క్యూఆర్ సమాచారం ద్వారా సంబంధిత ఆస్తిని వెంటనే గుర్తించి సేవలను వేగంగా అందించే అవకాశముంటుంది. డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీస్ మిషన్, వికసిత్ భారత్-2047 లక్ష్యాలకు అనుగుణంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్టు దేశంలోని ఇతర రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలిచే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
పట్టణ పాలనలో సమూల మార్పులు...
అర్బన్ డిజిటల్ రిజిస్ట్రీ ప్రాజెక్టులో పట్టణాల్లో ప్రతి ఆస్తినీ శాస్త్రీయంగా గుర్తిస్తారు. భౌగోళికంగా మ్యాపింగ్ చేసి, ప్రభుత్వ సేవలన్నింటినీ ఒకే డిజిటల్ గుర్తింపుతో అనుసంధానం చేస్తారు. భవిష్యత్తులో పట్టణ పరిపాలనకు ఇదే ప్రాథమిక డేటా బేస్‌గా మారుతుంది. ఈ ప్రాజెక్టులను పలు దశల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో పట్టణ సరిహద్దులను ఖరారు చేస్తారు. ప్రతి పట్టణ స్థానిక సంస్థ పరిధిలోని రెవెన్యూ గ్రామాలు, వార్డులు, కాలనీలు, వీధుల సరిహద్దులను జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(జీఐఎస్) ఆధారంగా ఖరారు చేస్తారు. గతంలో చోటుచేసుకున్న సరిహద్దు వ్యత్యాసాలను తొలగించి ఒకే ప్రామాణిక మ్యాప్‌ను రూపొందిస్తారు. రెండో దశలో ఇంటింటి సర్వే చేపడతారు. ప్రత్యేక మొబైల్ యాప్‌ల ద్వారా సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి డిజిటల్ సర్వే నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇంటి యజమాని వివరాలు, ఆస్తి వినియోగ స్వభావం, వివిధ సౌకర్యాలు, పన్ను చెల్లింపుల స్థితి, జీపీఎస్ లొకేషన్ వంటి వివరాలను నమోదు చేస్తారు. ప్రతి ఆస్తి ఫొటోను కూడా డేటాబేస్‌లో పొందుపరుస్తారు. మూడో దశలో జీఐఎస్ సమీకరణ చేపడతారు. సర్వేలో సేకరించిన సమాచారాన్ని శాటిలైట్ చిత్రాలు, డ్రోన్ మ్యాపింగ్, మున్సిపల్ రికార్డులు, రెవెన్యూ రికార్డులతో సరిపోల్చి ధ్రువీకరిస్తారు. ఈ ప్రక్రియతో తప్పులు, డూప్లికేట్ రికార్డులు, పన్ను పరిధిలో లేని ఆస్తులను గుర్తించవచ్చు. నాలుగో దశలో... ప్రతి రహదారికి ఒక ప్రారంభ బిందువును నిర్ణయిస్తారు. అక్కడ నుంచి వరుసగా ప్రతి ఇంటికి కొత్త డిజిటల్ డోర్ నంబర్ కేటాయిస్తారు. భవిష్యత్తులో ఏ శాఖ అయినా ఇదే నంబరును ఉపయోగించే అవకాశముంటుంది. ఐదో దశలో క్యూఆర్ కోడ్ ప్లేట్‌లు తయారుచేసి ప్రతి ఇంటికీ అమర్చుతారు. ఈ ప్లేట్‌పై డిజిటల్ డోర్ నంబర్, ప్రత్యేక గుర్తింపు సంఖ్య, క్యూఆర్ కోడ్ ఉంటాయి. ఆరో దశలో ధ్రువీకరణ ఉంటుంది. ప్లేట్ అమర్చిన తర్వాత అధికారులు మళ్లీ స్కాన్ చేసి వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందో లేదో పరిశీలిస్తారు. అనంతరం సేవలను అందుబాటులోకి తీసుకొస్తారు.
ఏఐతో ముందస్తు నిర్ణయాలు...
ఈ ప్రాజెక్టులో కృత్రిమ మేధ(ఏఐ) వినియోగానికీ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. డేటా విశ్లేషణ ఆధారంగా ఎక్కడ జనాభా వేగంగా పెరుగుతోంది?, ఎక్కడ కొత్త మౌలిక సదుపాయాలు అవసరం?, ఏ వార్డులో పన్ను వసూళ్లు తక్కువగా ఉన్నాయి?, ఎక్కడ ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి?, ఏ సేవల్లో ఆలస్యం జరుగుతోందన్న అంశాలను ఏఐ విశ్లేషించి అధికారులకు సూచనలు అందించే అవకాశముంది. ప్రస్తుతం పౌరులిచ్చే ఫిర్యాదులు ఏ దశలో ఉన్నాయో తెలుసుకోవడం కష్టంగా ఉంటోంది. అర్బన్ డిజిటల్ రిజిస్ట్రీలో ప్రతి ఫిర్యాదుకు డిజిటల్ వర్క్ ఫ్లో ఉంటుంది. దీంతో ఫిర్యాదు నమోదు, సంబంధిత అధికారికి కేటాయింపు, పనుల పురోగతి, పూర్తి చేసిన తేదీ అన్నీ రియల్ టైమ్‌లో కనిపిస్తాయి.