‘డిజిటల్ అరెస్ట్’ ముఠా ఆటకట్టు
ABN , Publish Date - May 23 , 2026 | 06:29 AM
డిజిటల్ అరెస్ట్ పేరుతో అమాయకులను భయభ్రాంతులకు గురిచేసి పెద్దమొత్తంలో దోచుకుంటున్న ముఠాను బాపట్ల జిల్లా చీరాల టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు.
విశాఖకు చెందిన ముగ్గురు నిందితులు అరెస్ట్
చీరాల, మే 22(ఆంధ్రజ్యోతి): డిజిటల్ అరెస్ట్ పేరుతో అమాయకులను భయభ్రాంతులకు గురిచేసి పెద్దమొత్తంలో దోచుకుంటున్న ముఠాను బాపట్ల జిల్లా చీరాల టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. చీరాల డీఎస్పీ ఎండీ మొయిన్ కథనం మేరకు.. మనీలాండరింగ్‌కు పాల్పడినందుకు డిజిటల్ అరెస్టు చేస్తున్నామంటూ స్థానిక కొత్తపేటకు చెందిన విశ్రాంత ఉద్యోగి కె.మోహన్‌రావుకు మార్చి నెలలో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చింది. ఆ కేసు నుంచి బయటపడాలంటే రూ.30 లక్షల వరకు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆందోళన చెందిన ఆయన నేరగాళ్లు సూచించిన బ్యాంకు ఖాతాలకు రూ.26.50 లక్షలు చెల్లించారు. ఆ తర్వాత అటువైపు నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక బృందాలతో విచారణ జరిపిన పోలీసులు.. పెందుర్తికి చెందిన బొందలపు గోవిందు, కంచరపాలేనికి చెందిన నాగాల ప్రదీప్ కుమార్, మల్కాపురానికి చెందిన గండిబోయిన నీల్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.10 లక్షల నగదు, 2 ల్యాప్‌టా్‌పలు, 6 సెల్‌ఫోన్‌లు, పాస్‌పోర్ట్, ఆధార్, పాన్ కార్డులు, 3 సిమ్ కార్డులు, పెన్‌డ్రైవ్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.