తవ్వుకో.. దోచుకో
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:24 AM
మచిలీపట్నం దక్షిణ మండలంలో శివగంగ గుడి వెనుక భాగంలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉంటున్న ప్రభుత్వ పోరంబోకు, సీలింగ్ భూములపై అక్రమార్కుల కన్నుపడింది. ఇక అంతే కొందరు రెవెన్యూ అధికారుల అండతో తప్పుడు పత్రాలు సృష్టించి యథేచ్ఛగా చేపల చెరువులు తవ్వేస్తున్నారు. ఇక్కడి నుంచి వచ్చిన మట్టిని ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యవహారం మొత్తం మట్టి డాన్ కనుసన్నల్లోనే జరుగుతుందని విమర్శలు వస్తున్నాయి.
- మచిలీపట్నంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ
- సీలింగ్, ప్రభుత్వ పోరంబోకు భూముల్లో మట్టి తవ్వకాలు
- చెరువులుగా మార్చి చేపల సాగుకు ప్రయత్నం
- మట్టి డాన్ కనుసన్నల్లోనే అంతా వ్యవహారం
- కన్నెత్తి చూడని రెవెన్యూ అధికారులు
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు
మచిలీపట్నం దక్షిణ మండలంలో శివగంగ గుడి వెనుక భాగంలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉంటున్న ప్రభుత్వ పోరంబోకు, సీలింగ్ భూములపై అక్రమార్కుల కన్నుపడింది. ఇక అంతే కొందరు రెవెన్యూ అధికారుల అండతో తప్పుడు పత్రాలు సృష్టించి యథేచ్ఛగా చేపల చెరువులు తవ్వేస్తున్నారు. ఇక్కడి నుంచి వచ్చిన మట్టిని ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యవహారం మొత్తం మట్టి డాన్ కనుసన్నల్లోనే జరుగుతుందని విమర్శలు వస్తున్నాయి.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
మచిలీపట్నం దక్షిణ మండలంలోని బందరు పశ్చిమ ప్రాంతంలో 40 ఎకరాల చల్లపలి ్లరాజాకు చెందిన సీలింగ్ భూములు, ప్రభుత్వ పోరంబోకు భూములు ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా ఈ భూములు ఖాళీగానే ఉంటున్నాయి. పేదలు ఈ భూములను కొంతకాలంపాటు సాగు చేసుకున్నారు. సాగు నీరు సక్రమంగా అందకపోవడంతో ఈ భూములను సాగు చేయకుండా వదిలేశారు. దీంతో గత 35 సంవత్సరాలకుపైగా ఈ భూములు బీడు భూములుగానే ఉంటున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ భూములను ఆక్రమించేందుకు, కొనుగోలు చేసేందుకు ఎవ్వరూ సాహసించలేదు. ఇటీవల కాలంలో ఈ భూములపై కన్నేసిన కొందరు ప్రబుద్ధులు ఈ భూములు పేదలు సాగు చేసుకుంటున్నట్లుగా చూపి తప్పుడు పత్రాలు పుట్టించి వారి నుంచి కొనుగోలు చేసినట్లుగా చూపడం గమనార్హం. ఈ భూములకు సమీపంలోనే మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ 30వ డివిజన్ ఉంది. ఇక్కడ వందలాది కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.
మట్టి మాఫియా డాన్ కనుసన్నల్లో తవ్వకాలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీకీ చెందిన ద్వితీయ శ్రేణి నాయకుడు ఒకరు ఇటీవల కాలంలో మట్టి మాఫియా డాన్‌గా ఎదిగాడు. మంత్రి, అధికార యంత్రాంగం యావత్తు తన చెప్పుచేతల్లో ఉన్నారంటూ, వారు తన మాట వినాల్సిందేనని విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నాడు. ఈ డాన్ మచిలీపట్నం దక్షిణ మండలంలోని ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో చెరువుల తవ్వకాలు, మట్టి రవాణాను తన గుప్పిట్లోకి తీసుకుని చెలరేగి పోతున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శివగంగ గుడి వెనుక భాగంలోని ప్రభుత్వ భూములను చేపల చెరువులుగా తవ్వించే పనిని తాను చేయిస్తానని, అధికారుల నుంచి ఇబ్బందులు రాకుండా చూసుకుంటానని ఈ డాన్ భరోసా ఇచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ పోరంబోకు భూముల్లో చెరువుల తవ్వకాలపై అధికారులు ప్రశ్నిస్తే తనదైన శైలిలో బెదిరింపు ధోరణితో మాట్లాడుతుండటంతో అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ మండలంలో పనిచేయలేమని దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోతామని లేదా బదిలీ చేయించుకుంటామని కొందరు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మాఫియా డాన్ తీసుకునే సొంత నిర్ణయాలకు, చేసే అక్రమాలకు సొంత పార్టీ నాయకులు సైతం ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇతని పనితీరుతో పార్టీకి కూడా చెడ్డపేరు వస్తోందని టీడీపీకి చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు బాహటంగానే చెప్పుకుంటున్నారు.
పోలాటితిప్ప నుంచి మట్టి రవాణా
మచిలీపట్నం దక్షిణ మండలం పోలాటితిప్ప గ్రామంలోని ప్రభుత్వ భూముల నుంచి మట్టిని తవ్వేసి టిప్పర్ల ద్వారా రాత్రి సమయంలో తరలిస్తున్నారు. రోజుల తరబడి మట్టి రవాణా కొనసాగడంతో అధికలోడుతో వెళుతున్న టిప్పర్ల కారణంగా గ్రామంలోని రహదారులు దెబ్బతినడంతో గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 10వ తేదీ రాత్రి రెవెన్యూ అధికారులు దాడి చేసి మట్టి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. మట్టిని అక్రమంగా తరలించడంలో ఈ మట్టి డాన్ దే కీలకపాత్ర అని రెవెన్యూ అధికారులు సైతం చెప్పుకుంటున్నారు. అధికారుల దాడి అనంతరం వారం రోజుల పాటు మట్టి రవాణా చేయకుండా మిన్నకుండిపోయి వారం రోజుల నుంచి మళ్లీ రాత్రి సమయంలో ఇదే ప్రాంతం నుంచి మట్టిని టిప్పర్ల ద్వారా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడని గ్రామస్థులు చెబుతున్నారు.