కరువు కనిపించలేదా..?
ABN , Publish Date - Oct 05 , 2026 | 11:30 PM
కందనవోలు ముంగిట ఎల్‌నినో రూపంలో కరువు రక్కసి కన్నెర్రజేసింది.
పొలాల్లోని కరువు.. లెక్కల్లో లేదు
ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు
90 శాతానికిపైగా ఎండిన పంటలు..
మట్టిపాలైన పెట్టుబడులు
కష్టజీవుల కంట కన్నీరు
12 మండలాల్లో కరువే లేదని తేల్చిన ప్రభుత్వం
కర్నూలు, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కందనవోలు ముంగిట ఎల్‌నినో రూపంలో కరువు రక్కసి కన్నెర్రజేసింది. వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లా అంతటా కరువు తాండవిస్తోంది. చినుకు జాడ లేక చాలామంది రైతులు పంటలే వేయలేదు. వానలు వస్తాయి.. కష్టాలు తీరుతాయనే ఆశతో జూనలో కురిసిన వర్షాలకు పత్తి, ఆముదం. కంది.. వంటి పంటలు సాగు చేస్తే, ఆ తరువాత వర్షాలు కురవక పంటలు ఎండిపోయాయి. పనులు లేక ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. పశువులకు మేత లేక సంతలో వచ్చినకాడికి అమ్మేస్తున్నారు. పెట్టుబడి మట్టిపాలై అప్పుల ఊబిలో కూరుకుపోయారు. కరువు కోరల్లో చిక్కుకొని ప్రతి పల్లెలో రైతులు ఏ‘కరువు’ పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరువు మండలాలను ప్రకటించి అండగా నిలవాలి.. మేమున్నామనే భరోసా రైతులకు ప్రభుత్వం కల్పించాలి. అయితే.. జిల్లాలోని 12 మండలాల్లో కరువే లేదన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ మండలాలను కరువు జాబితాలో చేర్చలేదు. పొలాల్లో కనిపిస్తున్న కరువు.. అధికారిక జాబితాలో ఎందుకు కనిపించడం లేదన్నదే ఇప్పుడు రైతుల ప్రశ్న. ప్రభుత్వం రైతుల గోడును ఆలకించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పునఃపరిశీలన చేయాలి. ఆ మండలాలను కరువు జాబితాలో చేర్చాలి. అన్నదాతకు అండగా నిలవాలని కోరుతున్నారు.
జిల్లాలో ఈ ఏడాది (2026-27 ఖరీఫ్ సీజన) ఎల్‌నినో ప్రభావంతో జూన మినహా ఆ తరువాత మూడు నెలలు లోటు వర్షాపాతమే నమోదైంది. వ్యవసాయ శాఖ అధికారుల రికార్డులను పరిశీలిస్తే.. జూన నెలలో సాధారణ వర్షాపాతం 77.7 మి.మీలు కాగా 98.4 మి.మీలు కురిసింది. అదికూడా నాలుగైదు రోజుల్లో పడిన వర్షమే. జూలైలో సాధారణం 90.5 మి.మీలు కాగా 34.6 మి.మీలు (61.76 శాతం లోటు), ఆగస్టులో సాధారణ వర్షపాతం 117 మి.మీలు కాగా పడిన వర్షం 49.8 మి.మీలు (46.29 శాతం లోటు), సెప్టెంబరులో సాధారణ వర్షపాతం 116.2 మిల్లిమీటర్లకు గానూ 47.6 మి.మీలు వర్షం (59.03 శాతం లోటు) కురిసింది. అంటే.. మూడు నెలలు లోటు వర్షాలు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. అదే క్రమంలో తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. పల్లెల్లో పశుగ్రాసం దొరకక పశు పాడి పశువులను సైతం సంతలో అమ్మేస్తూ.. కన్నీటితో సాగనంపుతున్నారు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 4,35,104 హెక్టార్లు కాగా, 3,23,332 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేస్తే, అందులో ప్రధాన వాణిజ్య పంటలైన పత్తి 2,21,801 హెక్టార్లు, కంది 47,020 హెక్టార్లలో సాగు చేశారు. పత్తి సాగుకు ఎకరాకు రూ.45-50 వేల వరకు పెట్టుబడి మట్టిలో పోశారు. సాధారణంగా ఎకరాకు 8-10 క్వింటాళ్లు దిగుబడి వచ్చేదని రైతులు అంటున్నారు. ఈ ఏడాది కరువు దుర్భిక్ష పరిస్థితుల వల్ల రెండు, మూడు క్వింటాళ్లు కూడా దిగుబడి రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా అంతటా 27 మండలాలను కరువు మండలాల జాబితాలో చేర్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ దిశగా 15 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించింది.
ఫ మేమేమి పాపం చేశాం
కరువు మండలాల ప్రకటన కోసం దేనిని ప్రామాణికంగా తీసుకున్నారో అధికారులకే తెలియాలి. నిత్యం కరువుతో తల్లడిల్లే మండలాలు సైతం కరువు మండలాల జాబితాలో లేకపోవడంతో రైతులు విస్తుపోతున్నారు. ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో ఒక్క మండలం కూడా ఆ జాబితాలో చోటు దక్కలేదు. ఆ నియోజకవర్గాల్లో కరువు లేదా.. పచ్చని పైర్లలో పల్లెసీమలు సస్యశామలంగా ఉన్నాయా..? పాలకులు, అధికారుల నుంచి సమాధానం లేని ప్రశ్నలివి. ఆదోని నియోజకవర్గంలో ఆదోని-2, ఆలూరు నియోజకవర్గంలో ఆస్పరి, దేవనకొండ, కోడుమూరు నియోజకవర్గంలో సి.బెళగల్, పాణ్యం నియోజకవర్గంలో కల్లూరు మండలాలు కరువు మండలాల జాబితాలో లేవు. అంటే.. ఈ మండలాల్లో కూడా గ్రామసీమలు సుభిక్షంగా ఉన్నాయా..? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. 12 మండలాల్లో సాధారణ సాగు విస్తీర్ణం 2.21 లక్షల హెక్టార్లు కాగా, 2.02 లక్షల హెక్టార్లలో సాగు చేశారు. 75 శాతం తెల్లబంగారమని నమ్ముకొని పత్తి సాగు చేసి, ఎకరాకు రూ.35-45 వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. ఒకటి రెండు క్వింటాళ్లు కూడా దిగుబడి రాలేదని కన్నీరు పెడుతున్నారు. చినుకు జాడ లేకపోవడంతో పెట్టుబడి మట్టిపాలైందని రైతులు ఏకరువు పెడుతున్నారు.
ఫ కరువు కనిపించలేదా..?
స్పేస్ అప్లికేషన సెంటర్ (ఏపీఎ్‌సఏసీ) అందించే కీలక సమాచారం అధారంగా కరువు మండలాలు గుర్తిస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. మూడు దశల్లో పరిశీలించి కరువు మండలాలు ఎంపిక చేస్తారు.
మొదటి దశ: వర్షపాతం, పొడి వాతావరణం అంచనా.
రెండో దశ: సాగు విస్తీర్ణం, భూమిపై పచ్చదనం ఎంత వరకు తగ్గింది, పంటల పరిస్థితి ఎలా ఉందో శాటిలైట్ డేటా (ఉపగ్రహ చిత్రాలు) ద్వారా అంచనా, నేలలో తేమ శాతం, జలవనరుల లభ్యత.
మూడో దశ: రెండు దశల్లో ఇచ్చిన నివేదికల ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి కరువు అంచనా వేస్తారు.
పంట దిగుబడి నష్టం 50 శాతం, అంతకంటే ఎక్కువ ఉంటే తీవ్ర కరువు, 33-49.9 శాతం మధ్యస్థ కరువు మండలాలుగా గుర్తిస్తారు. అంటే.. జిల్లాలో కరువు మండలాలు జాబితాలో స్థానం దక్కని 12 మండలాల్లో 63 శాతానికి పైగా పంట దిగుబడులు వచ్చాయా..? పొలాల్లో కరువు.. కష్టజీవుల కన్నీళ్లు స్పష్టంగా కనిపిస్తుంటే, క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులకు కరువు కనిపించలేదా..? శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ ఇండెక్స్ పంపిన చిత్రాల్లో భూమి పచ్చదనంగా చూపినా..? క్షేత్రస్థాయి పరిశీలన అధికారులకు ఆ పచ్చనదం మాటున దాగిన పంట నష్టం, రైతుల కన్నీటి కష్టాలు, కోరలు చాచిన కరువు రక్కసి కనిపించలేదా..? అంటూ అన్నదాతలు ప్రశిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, పాలకులు స్పందించి క్షేత్రస్థాయిలో పునఃపరిశీలన చేసి 12 మండలాలను కరువు మండలాల జాబితాలో చేర్చి అదుకోవాలిన రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఫ అధికారిక లెక్కలు 12 మండలాల్లో జూన - ఆగస్టు వరకు వర్షాపాతం వివరాలు (మిల్లీ మీటర్లలో):
--------------------------------------------------------------------------
మండలం సాధారణం పడిన వర్షం
---------------------------------------------------------------------------
ఎమ్మిగనూరు 287.3 239.2
గోనేగండ్ల 287.9 171.7
నందవరం 254.9 190.4
మంత్రాలయం 299.9 259.1
కౌతాళం 310.1 193.6
కోసిగి 324.1 208.9
సి.బెళగల్ 284.4 158.8
ఆదోని-2 332.4 199.0
కల్లూరు 351 174
పెద్దకడుబూరు 326 270.9
దేవనకొండ 381.8 236.9
ఆస్పరి 287.1 79.8
-------------------------------------------------------------------------------
ఫ అప్పుల ఊబిలో కూరుకుపోయాను - మలిగేని తాయన్న, రైతు, కోసిగి
నాకు ఐదెకరాల పొలం ఉంది. గతేడాది అధిక వర్షాలకు తీవ్రంగా నష్టపోయాను. ఈ ఏడాదైనా కలసి వస్తుందని పత్తి, వేరుశనగ పంటలు వేశాను. జూనలో విత్తనం వేస్తే, ఆ తర్వాత చినుకు జాడ లేదు. అప్పుడప్పుడు పడని వానలకు ఎకరాకు ఒకటి రెండు క్వింటాళ్లు కూడా దిగుబడి రాలేదు. అప్పులు రెట్టింపు అయ్యాయి. మా మండలంలో కరువు లేదని అధికారులు చెప్పడం చూస్తే విడ్డూరంగా ఉంది. ఆఫీసుల్లో కూర్చోని లెక్కలు వేస్తే రైతు కష్టాలు ఎలా తెలుస్తాయి..? కరువు మండలంగా ప్రకటించి పత్తి రైతులకు ఎకరానికి రూ.50 వేలు పరిహారం చెల్లించాలి.
ఫ రూ.1.20 లక్షలు మట్టిలో పోశాను
- బెస్తా పెద్ద సవారి, రైతు, గంజహళ్లి గ్రామం, గోనెగండ్ల మండలం
వర్షాలు లేక పంటలెండిపోతే.. మా మండలంలో కరువు లేదంటున్నారు. ఇదెక్కడి న్యాయం సారూ..! నాకు నాలుగు ఎకరాల పొలం ఉంటే పత్తి పంట వేశాను. రూ.1.20 లక్షలు పెట్టుబడి మట్టిలో పోశాను. ఎకరానికి రెండు క్వింటాళ్లు కూడా రాలేదు. పత్తితీత కూలీలు కూడా గిట్టుబాటు కాలేదు. ప్రభుత్వం ఆదుకోవాలి.
ఫ కరువు మండలంగా ప్రకటించాల్సిందే
- కురువ లక్ష్మన్న, అలిగెర గ్రామం, ఆస్పరి మండలం
నాకు తెలిసి ఇలాంటి కరువు ఎప్పుడు చూడలేదు. వర్షాలు లేక వంకలు కూడా పారలేదు. చెరువులు, కుంటలు ఎండిపోయాయి. తాగడానికి కూడా నీళ్లు దొరకడం లేదు. పశువులకు మేతలేక సంతలో అమ్మేస్తున్నాం. నాకున్న 8 ఎకరాల్లో పత్తి పంట వేసి రూ.2.50 లక్షలు మట్టిపాలైంది. కరువు మండలంగా ప్రకటించి ప్రభుత్వం ఆదుకోవాలి. ఇప్పటికే గ్రామాల్లో రైతులు వలసపోతున్నారు. ఆదుకోకపోతే పల్లెలు ఖాళీ అవుతాయి.