దిబ్బపాలెంలో ఇంటింటా సర్వే
ABN , Publish Date - Apr 16 , 2026 | 04:59 AM
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండల పరిధిలో గల సెజ్ (స్పెషల్ ఎకనామిక్ జోన్) పునరావాస కాలనీ (దిబ్బపాలెం)లో ఇంటింటా సర్వే ప్రారంభించినట్టు...
ఇళ్ల స్థలాలు అందని నిర్వాసితుల గుర్తింపు
త్వరలో అందరికీ శాశ్వత పట్టాలు
‘అక్షరం అండగా...’ కార్యక్రమానికి స్పందన
అచ్యుతాపురం, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండల పరిధిలో గల సెజ్ (స్పెషల్ ఎకనామిక్ జోన్) పునరావాస కాలనీ (దిబ్బపాలెం)లో ఇంటింటా సర్వే ప్రారంభించినట్టు ఏపీఐఐసీ ఆర్‌ఐ రమణ తెలిపారు. రెండు దశాబ్దాల కిందట సెజ్ కోసం అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలోని 23 గ్రామాల్లో భూములు సేకరించారు. అందుకు సంబంధించి ఐదు వేల కుటుంబాలకు పరిహారం చెల్లించడంతోపాటు దిబ్బపాలెంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మొదట్లో కుటుంబ యజమానికి ఐదు సెంట్లు, కుటుంబంలోని మేజర్లకు రెండున్నర సెంట్లు ఇచ్చారు. 2015లో టీడీపీ ప్రభుత్వం మేజర్లకు అదనంగా మరో రెండున్నర సెంట్లు, వితంతువులకు కూడా ఐదు సెంట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈవిధంగా కొంతమందికి ఇచ్చింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక దిబ్బపాలెం సమస్యను అసలు పట్టించుకోలేదు. ఇంకా చాలామందికి ఇళ్ల స్థలాలు ఇవ్వవలసి ఉంది. మార్చి 12న ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన ‘అక్షరం అండగా...పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమంలో దిబ్బపాలెం నిర్వాసితులు ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. పాతికేళ్లు గడుస్తున్నా చాలామందికి ఇంటి స్థలాలు రాలేదని, ఇచ్చిన స్థలాల క్రయ విక్రయాలకు అవకాశం లేదని, ఈ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌ను కోరారు. వెంటనే సర్వే జరిపించి శాశ్వత పట్టాలిస్తామని, అంతేకాక మిగిలిన వారికి కూడా ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే విజయకుమార్ ఆదేశాల మేరకు ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నామని ఆర్‌ఐ రమణ తెలిపారు. ఇప్పటికి 1,150 ఇళ్లను సర్వే చేశామని, ఇంతవరకు ఇళ్ల స్థలాలు తీసుకోని వారిని గుర్తిస్తున్నామని చెప్పారు. మరో 15 రోజుల్లో సర్వే పూర్తవుతుందని, నిర్వాసితులందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు.