Share News

ఏడాదిలోగా సమస్యలన్నీ పరిష్కరిస్తా!

ABN , Publish Date - Jun 18 , 2026 | 03:56 AM

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం సెజ్‌ పునరావాస కాలనీ (దిబ్బపాలెం)లో బుధవారం ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌ ఆర్వో ప్లాంటును ప్రారంభించారు.

ఏడాదిలోగా సమస్యలన్నీ పరిష్కరిస్తా!

  • అనకాపల్లి జిల్లా దిబ్బపాలెంలో వాటర్‌ ప్లాంటు ప్రారంభించిన ఎమ్మెల్యే సుందరపు

  • విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన

  • ‘అక్షరం అండగా’ కార్యక్రమానికి స్పందన

  • ‘ఆంధ్రజ్యోతి’ చొరవతో తమ సమస్య పరిష్కారమైందని స్థానికుల హర్షం

అచ్యుతాపురం, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం సెజ్‌ పునరావాస కాలనీ (దిబ్బపాలెం)లో బుధవారం ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌ ఆర్వో ప్లాంటును ప్రారంభించారు. దిబ్బపాలెం పంచాయతీ పరిధిలో ఐదు వేల కుటుంబాలు ఉంటున్నాయి. పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఉన్న ఆర్వో ప్లాంటు పాడైపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నామని దిబ్బపాలేనికి చెందిన లాలం శ్యామలాదేవి, మరికొందరు మార్చి 12వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’, ‘ఏబీఎన్‌’ సంస్థలు నిర్వహించిన ‘అక్షరం అండగా...పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనికి వెంటనే స్పందించిన ఆయన సాధ్యమైనంత త్వరలో ఆర్వో ప్లాంటుకు మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. సామాజిక బాధ్యత కింద ఆర్వో ప్లాంటు మరమ్మతులు చేయించాలని సెజ్‌లో గల లారస్‌ కర్మాగారం ప్రతినిధులను ఆయన కోరారు. దీంతో లారస్‌ యాజమాన్యం ఆర్వో ప్లాంట్‌లో పాడైపోయిన యంత్రాలను తొలగించి సుమారు రూ.రెండు లక్షల ఖర్చుతో కొత్తవాటిని ఏర్పాటుచేసింది. ఎమ్మెల్యే విజయకుమార్‌ దానిని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఆంధ్రజ్యోతి’ కారణంగా 22 గ్రామాలకు చెందిన నిర్వాసితులకు మౌలిక సదుపాయాలు కల్పించబడుతున్నాయన్నారు. ఏడాదిలోగా కాలనీలో అన్ని సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. దిబ్బపాలెంలో ఒక పాఠశాలను లారస్‌ యాజమాన్యం దత్తత తీసుకుందని, అన్ని వసతులతో పాఠశాలను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. ‘అక్షరం అండగా’ సమావేశంలో ఇచ్చిన హామీలన్నీ ఏడాదిలోగా నెరవేరుస్తానన్నారు. వారానికొక అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. విద్యుత్‌ సమస్య పరిష్కారం కోసం ఆయన సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు బుధవారం శంకుస్థాపన చేశారు. సుమారు ఎకరా విస్తీర్ణంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు రూ.3 కోట్లు మంజూరయ్యాయన్నారు.


‘ఆంధ్రజ్యోతి’ చొరవతో తాగునీరు: శ్యామలాదేవి

‘ఆంధ్రజ్యోతి’ చొరవతో తమకు మంచినీరు వచ్చిందని గృహిణి లాలం శ్యామలాదేవి ఆనందం వ్యక్తంచేశారు. ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన సమావేశంలో తాను లేవనెత్తిన సమస్య ఇంత త్వరగా పరిష్కారం అవుతుందని ఊహించలేదన్నారు. మూడేళ్లుగా ప్లాంటు మూతపడి ఉందని, ఎన్నిసార్లు ఎంతమందికి విన్నవించినా ఫలితం దక్కలేదని ఎమ్మెల్యే విజయకుమార్‌ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆర్వో ప్లాంటు తిరిగి ప్రారంభమైందన్నారు.

Updated Date - Jun 18 , 2026 | 03:58 AM