Share News

శ్రీకాకుళంలో ప్రబలిన డయేరియా

ABN , Publish Date - Feb 25 , 2026 | 05:23 AM

శ్రీకాకుళం నగరంలో డయేరియా ప్రబలింది. గత రెండు రోజుల్లో పదుల్లో కేసులు నమోదయ్యాయి. పరిస్థితి విషమించి ఒకరు మృతి చెందారు.

శ్రీకాకుళంలో ప్రబలిన డయేరియా

  • ఒకరి మృతి.. పలువురి పరిస్థితి విషమం

  • కలుషిత నీరే కారణమని గుర్తింపు

శ్రీకాకుళం, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరంలో డయేరియా ప్రబలింది. గత రెండు రోజుల్లో పదుల్లో కేసులు నమోదయ్యాయి. పరిస్థితి విషమించి ఒకరు మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా మారింది. నగరంలోని దమ్మలవీధి, గోల్కొండరేవు, కాకివీధి, సారంగడాల వీధి, ఎచ్చెర్లవారి వీధి, గుడివీధి, కుమ్మరివీధి, రంగిరీజు వీధుల్లో డయేరియా ప్రబలింది. కొద్ది రోజుల క్రితం మురుగు కాలువల్లో పూడికను యంత్రాలతో తొలగించారు. ఆ సమయంలో నగరపాలక సంస్థకు చెందిన పైపులైన్లు విరిగిపోయాయి. దీంతో నీరు కలుషితమైంది. మూడ్రోజుల నుంచి ఆయా ప్రాంతాల్లో పలువురు వాంతులు, విరేచనాలతో ఆసుపత్రుల్లో చేరారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. మంగువారితోట ప్రాంతంలో కండ్రవీధికి చెందిన మండల సురేశ్‌(43) మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో అధికార యంత్రాంగం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ జిల్లా అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకున్నారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆసుపత్రులకు వెళ్లి రోగులను పరామర్శించారు. ఇప్పటి వరకు మొత్తం 60 డయేరియా కేసులు నమోదు అయ్యాయి. కాగా.. డయేరియాతో మృతి చెందిన మండల సురేశ్‌ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, తక్షణమే ప్రభుత్వం తరపున రూ.10 లక్షలు పరిహారంగా అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలియజేశారు.

Updated Date - Feb 25 , 2026 | 05:23 AM