ధవళేశ్వరం గేట్ల పనులకు నేడు సీఎం శ్రీకారం
ABN , Publish Date - Jul 13 , 2026 | 03:56 AM
పూర్వపు ఉమ్మడి గోదావరి జిల్లాల ఆయకట్టు భూములకు సాగునీరందించే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ఆధునికీకరణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం శ్రీకారం చుట్టనున్నారు.
రూ.150 కోట్లతో 117 కొత్త గేట్లు,బ్యారేజ్ ఆధునికీకరణ పనుల ప్రారంభం
పిచ్చుకలంకలో రైతులతో ముఖాముఖి
తర్వాత పోలవరం సందర్శన.. ఏరియల్ సర్వే
అమలాపురం/పోలవరం, జూలై 12 (ఆంధ్రజ్యోతి): పూర్వపు ఉమ్మడి గోదావరి జిల్లాల ఆయకట్టు భూములకు సాగునీరందించే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ఆధునికీకరణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం శ్రీకారం చుట్టనున్నారు. సుమారు రూ.150 కోట్ల అంచనా వ్యయంతో 117 కొత్త గేట్ల బిగింపు, ఇతర పనులను ప్రారంభిస్తారు. ధవళేశ్వరం వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక పరిధిలోని పిచ్చుకలంక చేరుకుంటారు. అక్కడ రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో ప్రసంగిస్తారు. అనంతరం పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు. ఏరియల్ సర్వే తర్వాత ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. ఈసీఆర్‌ఎఫ్ డ్యాం గ్యాప్-2, జలవిద్యుత్కేంద్రం, ఇతర నిర్మాణాలకు సంబంధించి ఫొటో ఎగ్జిబిషన్లను పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్టు కార్యాలయంలో ప్రాజెక్టు అఽధికారులతో సమీక్ష నిర్వహించి.. నిర్మాణాలపై దిశానిర్దేశం చేస్తారు. అనంతరం ఉండవల్లి బయల్దేరి వెళ్తారు.