Share News

రేయ్‌ చిలకం..నీకు నెక్స్ట్‌ బర్త్‌డే ఉండదు

ABN , Publish Date - Apr 12 , 2026 | 05:49 AM

రాష్ట్రంలో వైసీపీ దౌర్జన్యాలు తారస్థాయికి చేరాయి. ‘నీకు నెక్ట్స్‌ బర్త్‌డే ఉండదు’ అంటూ ఓ నేతకు ఇచ్చిన మాస్‌ వార్నింగ్‌ ఇప్పుడు అనంతపురం జిల్లా ధర్మవరంలో కలవరం రేపుతోంది.

రేయ్‌ చిలకం..నీకు నెక్స్ట్‌ బర్త్‌డే ఉండదు

  • జనసేన నేతకు కేతిరెడ్డి అనుచరుడి హెచ్చరిక

  • నీ బావమరిదిని కుక్కను కొట్టినట్లు కొట్టాం

  • నిన్ను అంతం చేయడానికి మాకు అధికారం అక్కర్లేదు

  • బెదిరిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు

  • పోలీసులకు ఫిర్యాదు చేసిన చిలకం

ధర్మవరం, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైసీపీ దౌర్జన్యాలు తారస్థాయికి చేరాయి. ‘నీకు నెక్ట్స్‌ బర్త్‌డే ఉండదు’ అంటూ ఓ నేతకు ఇచ్చిన మాస్‌ వార్నింగ్‌ ఇప్పుడు అనంతపురం జిల్లా ధర్మవరంలో కలవరం రేపుతోంది. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డిని ఉద్దేశించి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అనుచరుడు బెదిరింపు ధోరణిలో సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టాడు. ‘రేయ్‌ చిలకం.. గతం గుర్తు లేదా? నీ బావమరిది రాజాను కుక్కను కొట్టినట్లు కొట్టాం..! నీ బర్త్‌డేను సంతోషంగా చేసుకున్నవ్‌ కదరా..? నెక్స్ట్‌ బర్త్‌డేకు మేమిటో చూపిస్తాం’’ అంటూ ఆ పోస్టుల్లో బెదిరించాడు. నిన్ను అంతం చేయడానికి తమకు అధికారం అక్కర్లేదని హెచ్చరించాడు. ‘మరాఠీ వాడికే (మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, స్థానిక ఎమ్మెల్యే) మాయమాటలు చెప్పి రూ.60 లక్షలకు అమ్ముడుపోయిన కుక్కవి నువ్వు.. నీ అంతు చూడకపోతే నేను రెడ్డినే కాదురా’ అని వార్నింగ్‌ ఇచ్చాడు. త్వరలోనే రేగాటిపల్లిలో (చిలకం స్వగ్రామం) ఫ్యాక్షన్‌ను పునఃప్రారంభిస్తామని, అధికారంతో తమకు సంబంధం లేదని, ఎప్పటికీ ఇక్కడ తమదే ఆధిపత్యం అని సవాలు విసరడం గమనార్హం. దీనిపై చిలకం మధుసూదన్‌రెడ్డి ధర్మవరం రూరల్‌ పోలీసుస్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. కాగా, కేతిరెడ్డి అనుచరుడు దేవరపల్లి ఓబుళరెడ్డి అనే వ్యక్తి తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో పోస్టు పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. అయితే, ఆ పోస్టు విషయం తనకు తెలియదని, తన ఖాతాను ఎవరైనా హ్యాక్‌ చేసి ఇలాంటి పోస్టు పెట్టి ఉంటారని ఓబుళరెడ్డి పోలీసుల వద్ద అన్నట్లు తెలిసింది. ఓబుళరెడ్డి గతంలో ‘రప్పా రప్పా’ అంటూ హల్‌చల్‌ చేసిన బ్యాచ్‌లో ఉన్నాడు.

Updated Date - Apr 12 , 2026 | 05:49 AM