Share News

ఏటీఎం మిషన్‌నే ఎత్తుకెళ్లారు

ABN , Publish Date - May 07 , 2026 | 03:44 AM

ఏటీఎం మిషన్‌ తలుపు తెరవడం సాధ్యంకాకపోవడంతో దొంగలు ఏకంగా మిషన్‌నే పెకిలించుకుపోయారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.

ఏటీఎం మిషన్‌నే ఎత్తుకెళ్లారు

  • శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఘటన

  • యంత్రాన్ని రాడ్లతో కదిలించిన దొంగలు

  • బొలెరోకు తాడుతో కట్టి బయటకు ఈడ్చారు

  • అదేమిటన్న వాళ్లను బెదిరించి పరారు

  • 7.50 లక్షల వరకు నగదు ఉందన్న మేనేజర్‌

  • 20 కి.మీ. దూరంలో పొలాల్లో ఖాళీ ఏటీఎం

ధర్మవరం, మే 6(ఆంధ్రజ్యోతి): ఏటీఎం మిషన్‌ తలుపు తెరవడం సాధ్యంకాకపోవడంతో దొంగలు ఏకంగా మిషన్‌నే పెకిలించుకుపోయారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ధర్మవరం నుంచి పుట్టపర్తి వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు ఏటీఎం ఉంది. తెల్లవారుజామున 3.32 గంటలకు దాదాపు ఎనిమిది మంది బొలెరో వాహనంలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న బ్యాంకు ఏటీఎం కేంద్రం వద్దకు వచ్చారు. తలకు క్యాప్‌, ముఖానికి మాస్క్‌, చేతులకు గ్లౌజులు ధరించిన దుండగుడు ఏటీఎం సెంటర్‌లోకి వెళ్లి లైట్లు ఆఫ్‌ చేశాడు. ఏటీఎం డోర్‌ తెరిచేందుకు ప్రయత్నించాడు. రాకపోవడంతో బయట ఉన్న సహచరులను పిలిచాడు. వాళ్లు ఇనుప రాడ్లు, బెల్టులాంటి పొడవాటి తాడు తీసుకొచ్చారు. ఏటీఎం మిషన్‌ను ఇనుపరాడ్లతో కదిలించి, దానికి తాడు చుట్టారు. ఆ తాడును బయట ఉన్న బొలెరో వాహనానికి కట్టారు. వాహనాన్ని వేగంగా ముందుకు నడపడంతో ఏటీఎం కేంద్రం తలుపును ధ్వంసం చేస్తూ ఏటీఎం మిషన్‌ బయటకు వచ్చి పడింది. సిద్ధంగా ఉన్న వాహనంలోకి దుండగులు ఆ మిషన్‌ను ఎత్తే సమయంలో అటుగా ద్విచక్రవాహనదారుడు వచ్చాడు. బైక్‌ ఆపి... ఏం జరుగుతోంది? అంటూ ప్రశ్నించేలోపే ఓ దుండగుడు తన వద్దనున్న ఇనుప రాడ్డు చూపించి బెదిరించాడు. దీంతో ఆ వాహనదారుడు వెళ్లిపోయాడు. ఏటీఎం మిషన్‌ను తమ వాహనంలో వేసుకుని దుండగులు పరారయ్యారు. విషయం తెలుసుకున్న మేనేజర్‌ లోక్‌నాథ్‌ బ్యాంకు వద్దకు చేరుకున్నారు. ఏటీఎం మిషన్‌లో రూ.7.50 లక్షల వరకూ నగదు ఉన్నట్లు తెలిపారు. ధర్మవరం ఇన్‌చార్జి డీఎస్పీ నరసింగప్ప, వన్‌టౌన్‌ ఎస్‌ఐ ఉమాదేవి ఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. సీఐ నాగేంద్ర ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు. రెండు రోజుల క్రితం తమిళనాడు రాష్ట్రం హోసూరులోనూ ఇదే తరహాలో జరగడం గమనార్హం.

పొలాల్లో మిషన్‌

మిషన్‌ను బొలెరో వాహనంలో వేసుకున్న దొంగలు... ధర్మవరంలోని గాంధీనగర్‌, కొత్తపేట సర్కిల్‌ మీదుగా 44వ నంబరు జాతీయ రహదారిపైకి వెళ్లారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురం గ్రామం సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి మిషన్‌ను ధ్వసం చేశారు. డబ్బు తీసుకుని పరారయ్యారు.

Updated Date - May 07 , 2026 | 03:44 AM