తిరుమల అన్నప్రసాదానికి భక్తుల తాకిడి
ABN , Publish Date - Mar 26 , 2026 | 03:15 AM
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద భవనానికి భక్తుల తాకిడి క్రమంగా పెరుగుతోంది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ...
గతనెల కంటే అదనంగా లక్షమందికి భోజనాలు
గ్యాస్ కొరతతో కొండపై 50కిపైగా హోటళ్లు మూత
తిరుమల, మార్చి 25(ఆంధ్రజ్యోతి): తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద భవనానికి భక్తుల తాకిడి క్రమంగా పెరుగుతోంది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరతతో తిరుమల కొండపై హోటళ్లు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. ఇప్పటికే 50కిపైగా హోటళ్లు మూతపడటంతో టీటీడీ ఉచితంగా అందజేసే అన్నప్రసాదాలపై భక్తులు ఆధారపడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు స్వామి ప్రసాదాన్ని ఒక పూట స్వీకరించి, మరో రెండుమూడు పూట్ల హోటళ్లకు వెళ్లేవారు. ఇప్పుడు యుద్ధం వల్ల గ్యాస్ కొరతతో చేసేదేమీ లేక హోటళ్లను మూసివేస్తున్నారు. మరికొందరు ఎక్కువ సమయం ఉడికే ఆహారాలు వండటం మానేశారు. ఇంకొందరు కట్టెలపొయ్యిలపై ఆధారపడుతున్నారు. హోటళ్లు అధికంగా మూతపడటంతో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు తిరుమలలోని వెంగమాంబ అన్నప్రసాద భవనంపైనే ఆధారపడుతున్నారు. ఫిబ్రవరి నెలలో 7వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దాదాపు 12.80 లక్షల మంది అన్నప్రసాదాలు స్వీకరించగా, ఈనెల 7 నుంచి 23వ తేదీ వరకు దాదాపు 13.80 లక్షల మంది అన్నప్రసాదాలు తిన్నారు. అంటే గత నెల కంటే దాదాపు లక్ష మంది అధికంగా అన్నప్రసాద భవనాన్ని సందర్శించి భోజనాలు స్వీకరించారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఫుడ్ కౌంటర్లు, క్యూలైన్లు, కంపార్టుమెంట్లు, యాత్రికులు వసతి సముదాయాల్లోనూ టీటీడీ ఉచిత అన్నప్రసాదాలకు భక్తుల తాకిడి పెరిగింది. గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తొలగకపోతే మరికొన్ని మూతపడే వీలుంది. దీంతో టీటీడీ అన్నప్రసాద విభాగంపై ఒత్తిడి పెరగనుంది. టీటీడీ రోజుకు ఐదున్నర నుంచి ఆరు టన్నుల గ్యాస్‌ను అన్నప్రసాదాల తయారీకి వినియోగిస్తోంది. టీటీడీ ప్రత్యేక విజ్ఞప్తి మేరకు ఐఓసీఎల్ నుంచి ఆంక్షలు లేకుండా ప్రస్తుతం గ్యాస్ సరఫరా జరుగుతోంది.