సెల్‌ఫోన్‌తో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి
ABN , Publish Date - Jun 09 , 2026 | 06:02 AM
తిరుమలలో మరోసారి భద్రతా సిబ్బంది వైఫల్యం కనిపించింది. నిబంధనలకు విరుద్ధంగా ఓ భక్తుడు సెల్‌ఫోన్‌ను వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి తీసుకెళ్లడమే గాక అక్కడ భక్తులు వేచిఉండే..
భక్తులు వేచిఉండే దృశ్యాలు, సెల్ఫీ వీడియో చిత్రీకరించిన భక్తుడు
సోషల్ మీడియాలో వీడియో పోస్టు
తిరుమల, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో మరోసారి భద్రతా సిబ్బంది వైఫల్యం కనిపించింది. నిబంధనలకు విరుద్ధంగా ఓ భక్తుడు సెల్‌ఫోన్‌ను వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి తీసుకెళ్లడమే గాక అక్కడ భక్తులు వేచిఉండే దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సాధారణంగా భక్తులు క్యూలైన్‌లోకి వెళ్లిన తర్వాత వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోకి ప్రవేశించే ముందు తనిఖీలు ఉంటాయి. భద్రతా కారణాల రీత్యా ఎవరి దగ్గరైనా సెల్‌ఫోన్, ఇతర ఎలక్ర్టిక్ వస్తువులు ఉంటే తనిఖీల్లో గుర్తించి స్వాధీనం చేసుకుంటారు. అయితే ఓ యాత్రికుడు ఆదివారం ఆ తనిఖీలను దాటి మరీ కంపార్టుమెంట్‌లోకి సెల్‌ఫోన్‌తో ప్రవేశించాడు. భక్తులు వేచిఉండే దృశ్యాలతో పాటు కుటుంబ సభ్యులు, సెల్ఫీ వీడియో తీసి పాటను జత చేసి ‘మమత వాల్మీకి’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ విషయం టీటీడీ దృష్టికి రావడంతో విజిలెన్స్ అధికారులు ఇన్‌స్టా ఖాతా ఆధారంగా భక్తుడిని సంప్రదించి ఆ వీడియోలను డిలీట్ చేయించారు. వ్యక్తిగత వివరాలు సేకరించి కేసు పెట్టే యోచనలో ఉన్నారు. కంపార్టుమెంట్లు, క్యూలైన్లతో పాటు ఆలయంలోనూ వీడియోలు చిత్రీకరించాడా అనే అంశంపై విచారణ చేస్తున్నారు.