Share News

అభివృద్ధి బాట

ABN , Publish Date - Feb 21 , 2026 | 01:14 AM

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌)కు ముందడుగు పడింది. తొలి దశ పనులు ఉమ్మడి కృష్ణాజిల్లాలోనే ప్రారంభం కానున్నాయి. ఇందుకు అవసరమైన డీపీఆర్‌ సిద్ధమైంది. మొదటి దశ పనులు కేతనకొండ నుంచి నున్న మీదుగా చోడవరం వరకు 67.6 కిలోమీటర్లు సాగనున్నాయి. త్వరలోనే భూ సేకరణ నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

అభివృద్ధి బాట

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు పనులకు రంగం సిద్ధం

- సిద్ధమైన డీపీఆర్‌.. తొలి దశ మన దగ్గరే..

- 67.6 కిలోమీటర్లు మొదటి విడత పనులు

- కేతనకొండ నుంచి నున్న మీదుగా చోడవరం వరకు..

- త్వరలో భూ సేకరణ నోటిఫికేషన్‌!

- భూ సమీకరణ విధానంలో కూడా..

- ఆరు నెలల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తి

- పీపీపీ విధానంలో నిర్మాణ పనులు

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌)కు ముందడుగు పడింది. తొలి దశ పనులు ఉమ్మడి కృష్ణాజిల్లాలోనే ప్రారంభం కానున్నాయి. ఇందుకు అవసరమైన డీపీఆర్‌ సిద్ధమైంది. మొదటి దశ పనులు కేతనకొండ నుంచి నున్న మీదుగా చోడవరం వరకు 67.6 కిలోమీటర్లు సాగనున్నాయి. త్వరలోనే భూ సేకరణ నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మొత్తం 96.2 కిలోమీటర్ల పొడవున ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణ పనులను రెండు దశల్లో చేపట్టేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) నిర్ణయించింది. తొలి దశ ఐఆర్‌ఆర్‌ పనులకు డీపీఆర్‌ కూడా సిద్ధమైంది. మొదటి దశ పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. ముందుగా తొలి దశలో ఎన్టీఆర్‌ జిల్లా కేతనకొండ నుంచి నున్న వరకు, నున్న నుంచి చోడవరం వరకు ఐఆర్‌ఆర్‌ పనులు చేపట్టనున్నారు. మొదటి దశలో 67.6 కిలోమీటర్ల పొడవున పనులు చేయనున్నారు. నిర్మాణ పనులకు అవసరమైన భూములను సేకరించేందుకు భూ సేకరణ నోటిఫికేషన్‌ను వెలువరించటానికి సీఆర్‌డీఏ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అతి త్వరలో భూ సేకరణ నోటిఫికేషన్‌ వెలువరించే అవకాశం ఉంది. మొత్తం ఆరు నెలల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తి కానుంది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం రెండో దశలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో నిర్మాణ పనులు చేపడతారు. భూసేకరణతో పాటు భూ సమీకరణ కూడా ఉంటుందని మంత్రి నారాయణ అసెంబ్లీలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీనిపై మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. భూ సమీకరణను ఏ ప్రాంతాలలో పరిగణనలోకి తీసుకుంటారన్నది తెలియాల్సి ఉంది. ఎవరైతే భూ సమీకరణకు ఆసక్తి చూపిస్తారో వారి దగ్గర సమీకరణలోనూ, ఎవరైతే దీనికి అంగీకరించరో.. వారి నుంచి భూ సేకరణ విధానంలో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

పీపీపీ విధానంలో పనులు

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు పనులు పీపీపీ విధానంలో చేపట్టాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. ఈ విధానంలో ముందుకు వచ్చే సంస్థలకు అప్పగించే అవకాశం ఉంది. గతంలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు పనులను చేపట్టడానికి అదానీ సంస్థ ముందుకు వచ్చింది. అదానీ ఇప్పటికీ ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. అదానీయే కాకుండా ఔత్సాహిక సంస్థల భాగస్వామ్యం కోసం ఆసక్తి వ్యక్తీకరణ కోరే అవకాశం ఉంది.

4, 8 వరసలుగా రోడ్డు

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును 4, 8 వరసలుగా విస్తరించేందుకు సీఆర్‌డీఏ నిర్ణయించింది. నాలుగు వరసలు ఎక్కడ ?, ఎనిమిది వరసలు ఎక్కడ ? అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మొత్తంగా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌) వెడల్పు 75 మీటర్లుగా ఉంటుంది. ఎనిమిది వరసలకు అనుగుణంగానే భూమి సేకరణ, సమీకరణ చేయనున్నారు.

కొండపల్లిలో టన్నెల్స్‌

తొలి దశ నిర్మాణాలు చాలా కీలకమైనవి. వీటిలో భాగంగా కొండపల్లి పర్వత శ్రేణుల మీదుగా భారీ టన్నెల్‌ను నిర్మించనున్నారు. అలాగే కవులూరు దగ్గర కూడా మీడియం టన్నెల్‌ను నిర్మించాల్సి ఉంది. కీలకమైన సొరంగాల పనులన్నీ కూడా మొదటి దశలోనే జరగనున్నాయి.

కేతనకొండ దగ్గర ఐకానిక్‌ బ్రిడ్జికి అనుసంధానం

కేతనకొండ నుంచి రాజధాని అమరావతికి కృష్ణానది మీదుగా ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అమరావతికి వెళ్లే ఐకానిక్‌ బ్రిడ్జికి కేతనకొండ దగ్గర అనుసంధానమవుతుంది.

Updated Date - Feb 21 , 2026 | 01:14 AM