డిప్యూటీ కలెక్టర్ భవానీ శంకర్‌పై బదిలీ వేటు
ABN , Publish Date - Mar 26 , 2026 | 03:29 AM
పిఠాపురం ఏరియా డెవల్‌పమెంట్ అథారిటీ (పాడా) డైరెక్టర్‌పై సర్కారు బదిలీ వేటు వేసింది. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వినతి మేరకు పాడా పీడీగా ఉన్న భవానీ శంకర్‌ను బదిలీ చేస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది.
పాడా నుంచి ఫైబర్ నెట్‌కు
అమరావతి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): పిఠాపురం ఏరియా డెవల్‌పమెంట్ అథారిటీ (పాడా) డైరెక్టర్‌పై సర్కారు బదిలీ వేటు వేసింది. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వినతి మేరకు పాడా పీడీగా ఉన్న భవానీ శంకర్‌ను బదిలీ చేస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఆయన్ను ఫైబర్ నెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బదిలీ చేస్తూ సీఎస్ జి.సాయిప్రసాద్ ఉత్తర్వు జారీ చేశారు. ఆయన స్థానంలో అటవీ శాఖ సీనియర్ అధికారి, జాయింట్ కమిషనర్ డాక్టర్ ఎన్.వి.శివరామ్‌ప్రసాద్‌ను పాడా పీడీగా నియమిస్తూ మరో ఉత్తర్వు (జీవో 66) ఇచ్చారు. కొంతకాలంగా పోస్టింగ్ లేకుండా వెయిటింగ్‌లో ఉన్న డిప్యూటీ కలెక్టర్ భవానీ శంకర్‌ను ఈ నెల 16న పాడా డైరెక్టర్‌గా నియ మిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆయన విశాఖపట్నం డీఆర్‌వోగా ఉన్న సమ యంలో ఆయన పనితీరుపై అనేక విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. విశాఖ పరిధిలోని మండలాల తహశీల్దార్లకు నెలవారీ టార్గెట్‌లు పెట్టి వేధించారని నాటి ఆర్ డీవో కలెక్టర్‌కు, ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. నాడు సీఎం కార్యాలయంలో పనిచేసిన ఓ ఉన్నతాధికారి అండదండలతో డిప్యూటీ కలెక్టర్‌పై చర్యలు తీసుకోలేదు. సరైన ఆధారాలు లేవనే సాకు చూపి ఆయన్ను విశాఖ కలెక్టర్ ఒడ్డున పడేశారన్న ఆరోపణలున్నాయి. ఈ పరిణామాలపై నివేదిక తెప్పించుకున్న సర్కారు డీఆర్‌వోతో పాటు ఆయనపై ఆరోపణలు చేసిన ఆర్‌డీవోను గత ఏడాది బదిలీ చేసింది. భవానీశంకర్‌కు పోస్టింగ్ ఇవ్వలేదు. అనూహ్యంగా పాడా ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమిస్తూ 16న సర్కారు ఆదేశాలివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై ఆరోపణలున్న అధికారికి అందలం శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ వార్తను ప్రచురించింది. ఈ వార్త వచ్చాక పవన్ కల్యాణ్ అప్రమత్తమయ్యారని తెలిసింది. భవానీ శంకర్ నియామకం కోసం తన పేషీ నుంచే లేఖ వెళ్లడం, ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఆరా తీశారు. ఆయన్ను బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.