కుంకీలకు పవన్ స్వాగతం
ABN , Publish Date - Jul 25 , 2026 | 05:22 AM
జనావాసాలు, పంట పొలాలపైకి వచ్చే అడవి ఏనుగులను తరిమికొట్టేందుకు కుంకీ ఏనుగులు.. చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు తరలివెళ్లాయి.
పలమనేరు నుంచి పార్వతీపురానికి రెండు ఏనుగులు తరలింపు
అమరావతి, మంగళగిరి సిటీ, జూలై 24 (ఆంధ్రజ్యోతి): జనావాసాలు, పంట పొలాలపైకి వచ్చే అడవి ఏనుగులను తరిమికొట్టేందుకు కుంకీ ఏనుగులు.. చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు తరలివెళ్లాయి. పలమనేరు మండలం ముసలమడుగు గ్రామంలోని ఏనుగుల శిబిరంలో శిక్షణ పొందిన రెండు కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యు... మానవ-ఏనుగు సంఘర్షణ నివారణ చర్యలను బలోపేతం చేసేందుకు పార్వతీపురం జిల్లాలోని గుచ్చిమి శిబిరానికి తరలాయి. మార్గమధ్యంలో శుక్రవారం ఉదయం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం వద్ద ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వాటికి ఘనస్వాగతం పలికారు. గజరాజులకు పూలు చల్లి, ఆహారం అందజేశారు. అనంతరం జెండా ఊపి గుచ్చిమి శిబిరానికి సాగనంపారు. ప్రయాణంలో కుంకీల భద్రతకు తీసుకోవలసిన చర్యలపై అటవీ శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. గుచ్చిమి క్యాంపునకు చేరిన అనంతరం నిపుణుల పర్యవేక్షణలో అక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జయంత్, అభిమన్యు సేవలు పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో మానవ-ఏనుగు ఘర్షణల నియంత్రణకు దోహదపడతాయని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా తెలిపారు.
మానవ-ఏనుగు ఘర్షణల నివారణ
ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి ఏనుగుల గుంపు తరచూ పార్వతీపురం మన్యం జిల్లాలోకి ప్రవేశిస్తూ పంటలు, ఆస్తులకు నష్టం కలిగిస్తున్నాయి. ప్రజలపైనా దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అడవి ఏనుగులను సురక్షితంగా అడవుల్లోకి తరిమేందుకు కుంకీ ఏనుగులను గుచ్చిమి శిబిరానికి తరలిస్తున్నారు. కుంకీలు జయంత్, అభిమన్యు గతంలో పలమనేరు, చిత్తూరు ప్రాంతాల్లో నిర్వహించిన పలు కీలక ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించాయి.