Share News

వైసీపీ గూండాలను తొక్కి నారతీస్తా

ABN , Publish Date - Jun 21 , 2026 | 04:11 AM

‘వైసీపీ అధికారంలో లేకపోయినా పదేపదే క్రిమినల్స్‌లా బెదిరిస్తోంది. ఆ పార్టీ గూండాలను తొక్కి నార తీస్తా. రెండేళ్లు సహనం పట్టా. కూటమి ప్రభుత్వానికి ఇంకా మూడేళ్లు ఉంది.

వైసీపీ గూండాలను తొక్కి నారతీస్తా

  • అధికారంలో లేకున్నా క్రిమినల్స్‌లా ఆ పార్టీ బెదిరింపులు

  • రెండేళ్లు సహనం వహించా.. ఇక యాక్షన్‌ ఏంటో చూపిస్తా

  • క్రిమినల్స్‌తో ఉండడమే వైసీపీ బలం

  • నేరాలు చేసేవారిని నేరగాళ్లగానే చూడాలి

  • కులాలను చూసి వారిని వెనకేసుకురాకూడదు

  • కులాల దరిద్రం పోతేగానీ రాష్ట్రం బాగుపడదు

  • ప్రతిదానికీ నన్ను కులాల్లోకి లాగుతున్నారు

  • నేను హోంమంత్రిని కాదు.. అది క్రిమినల్స్‌ అదృష్టం

  • వైసీపీ లాయల్టీ అధికారులను గుర్తుపెట్టుకుంటా

  • కాకినాడ మాటామంతీలో పవన్‌

కాకినాడ, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ అధికారంలో లేకపోయినా పదేపదే క్రిమినల్స్‌లా బెదిరిస్తోంది. ఆ పార్టీ గూండాలను తొక్కి నార తీస్తా. రెండేళ్లు సహనం పట్టా. కూటమి ప్రభుత్వానికి ఇంకా మూడేళ్లు ఉంది. ఈ మూడేళ్లలో యాక్షన్‌ ఏంటో నేను చూపిస్తా’ అని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ హెచ్చరించారు. వైసీపీ బలం కులాన్ని వాడుకోవడం, క్రిమినల్స్‌తో ఉండడమేనని అన్నారు. క్రిమినల్స్‌ ఎప్పటికీ పాలకులు కాకూడదని పిలుపునిచ్చారు. శనివారం కాకినాడలో ప్రజలతో ‘మన ఊరు- మాటామంతీ’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. చీటికీమాటికీ కులాల్లోకి తనను లాగొద్దని, కులాల దరిద్రం పోతేగానీ రాష్ట్రం బాగుపడదన్నారు. ‘‘శవాలు లేస్తేనేగానీ వైసీపీకి సంతోషం రావడం లేదు. నేరాలు చేసేవారిని నేరగాళ్లగానే చూడాలి కానీ కులాలను చూసి వారిని వెనకేసుకురాకూడదు. క్రిమినల్స్‌ను వెనకేసుకు వచ్చే పార్టీలను ఆమడ దూరంలో పెట్టాలి. లేదంటే క్రిమినల్స్‌ రాజ్యాలు ఏలుతారు. నేరం చేసేవారి విషయంలో చట్టాలకు కులం, మతంతో సంబంధం లేదు. క్రిమినల్స్‌ను యువత కులాల కోణంలో చూడకూడదు. అమ్మాయిలను ఏడిపించినవారు ఏ కులం అని చూడవద్దు. దీనివల్ల నేరం తీవ్రత పోతుంది. తప్పు చేసేవాడికి కులం ఎందుకు ఉంటుంది’’ అని పవన్‌ అన్నారు.


కుత్తుకలు కోస్తామంటే.. ఊరుకోను

‘‘వైసీపీ రౌడీమూకకు ఒకటే చెబుతున్నా. మీరు పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోను. రక్తాలతో తడిపేస్తాం.. కుత్తుకలు కోస్తాం.. అంటే ఊరుకోను. భవిష్యత్తులో మేం వస్తాం.. అని భయపెడితే భయపడడానికి సిద్ధంగా లేం. ప్రతి వైసీపీ గూండాకు చెబుతున్నా.. మీరు గనుక ఇష్టారాజ్యంగా చేస్తాం.. మా ప్రభుత్వం వస్తుంది.. అంటే ఒకవేళ మీ ప్రభుత్వం వచ్చినా తొక్కి నారతీస్తాం. ప్రభుత్వం రావడం, పోవడం ప్రజల చేతుల్లో ఉంటుంది గుర్తుపెట్టుకోండి. కూటమి ప్రభుత్వానికి ఇంకా మూడేళ్లు ఉంది. ఈ మూడేళ్లలో మీకు యాక్షన్‌ నేను చూపిస్తా. ఇప్పటివరకు నేను మాట్లాడలేదు. మీరేం మాట్లాడినా.. వాగినా లా అండ్‌ ఆర్డర్‌ నాది కాదు అని కూర్చున్నా. ఇక నుంచి నా అభిప్రాయం సీఎంకు కూడా చెప్పను. నేరుగా ప్రజలకు చెబుతా. నాయకులకు చెప్పను.. ఇకపై నా డైలాగ్‌లు ప్రజలతోనే. కొంతమంది అధికారులేమో భవిష్యత్తులో వైసీపీ వస్తే అనే భయంతో గూండాలను వెనకేసుకు రావాలని చూస్తున్నారు. మీ లాయల్టీ వైసీపీ అనుకుంటే అటువంటి అధికారులు ఏ స్థాయి అధికారంలో ఉన్నా గుర్తుపెట్టుకుంటా’’ అని పవన్‌ హెచ్చరించారు.


నేరభావజాలాన్ని ప్రోత్సహించరాదు

‘‘సమాజంలో ప్రస్తుతం అనేకమంది కులాలు, మతాల వారీగా వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. మీ ఏరియాలో శాంతిభద్రతల విషయంలో ఓ వెయ్యిమంది స్థానికులు కలిసి వాట్సాప్‌ గ్రూపు ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదు. నేను వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఉన్న వ్యక్తిని. బలహీనపర్చడానికి కాదు. వైసీపీలా జైలుకు వెళ్లి.. బాగా చంపావు అని ఎమ్మెల్సీ అనంతబాబుకు చప్పట్లు కొట్టేవాడిని కాదు. పాపం చిన్న వయసులో 23 నేరాలు చేశాడు.. పాపం పసివయసులో బీరు బాటిల్‌ తీసుకుని గొంతుకోసేశాడు.. తెలిసీ తెలియని పని వయసు అని సమర్థించే వ్యక్తులను ప్రజలు ప్రోత్సహిస్తే భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుంది. శాంతిభద్రతలు బలంగా ఉంటేనే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయి. నేరాలు, క్రిమినల్స్‌ రాజ్యమేలుతుంటే ఇవేవీ రావు. నేను హోంమంత్రిని కాదు. అది నా పరిధిలోకి రాదు. అది క్రిమినల్స్‌ చేసుకున్న అదృష్టం. ఒకప్పుడు బిహార్‌లో లాలు ప్రభుత్వంలో ఒక ఐఏఎస్‌ భార్యను గూండాలు తీసుకుపోయారు. ఈరోజు కూర్చుని మాట్లాడుతున్న సంఘాలు ఒక్కటి కూడా నాడు మాట్లాడలేదు. ఆ దళిత ఆఫీసర్‌కు ఎవరూ అండగా నిలవలేదు. రౌడీలను ప్రజలే ప్రోత్సహిస్తే.. గూండాలను వెనకేసుకువస్తే దేశాన్ని ఎవడూ బాగు చేయలేడు. అంబేడ్కర్‌పై గౌరవం ఉంటే ఎవరూ తప్పుడు అట్రాసిటీ కేసులు పెట్టకూడదు. కొందరు నాయకులు వీటిని ప్రోత్సహించకూడదు. అక్రమ అట్రాసిటీ కేసులపై కలెక్టర్లు, ఎస్పీలు సీఎంకు సమీక్షల్లో వివరించాలి’’ అని అన్నారు.


ప్రీతి కేసులో ఆధారాలన్నీ ధ్వంసం చేశారు

‘‘చాలామంది క్రిమినల్స్‌ నేరం చేసినప్పటికీ ఆధారాలు లేక వదిలేయాల్సి వస్తుంది. నేరం చేసిన వాళ్లెవరో తెలిసినా ఆధారాలు లేక వదిలేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో నేను ఓడిపోయిన తర్వాత సుగాలిప్రీతి తల్లి నావద్దకు వచ్చింది. తన బిడ్డను చంపేశారని తెలిపింది. అప్పటి వైసీపీ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని ఓ కాగితం కేంద్రానికి రాసి తూతూమంత్రంగా వదిలేసింది. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసును తొలి కేసుగా తీసుకుందామనుకుంటే వైసీపీ ప్రభుత్వం ముందుగానే సాక్ష్యాధారాలను చంపేసింది. డీఎన్‌ఏ ఫైల్స్‌ మాయం చేసేసింది. వివేకా హత్యకేసులో నేరస్తులెవరో మనకు తెలుసు. కానీ నిర్ధారించడానికి ఆధారాలు లేకపోతే ఎవరినీ ఏం చేయలేం. నేను ఏదైనా భరిస్తా. కానీ క్రిమినల్స్‌ రాజ్యాంగ పదవుల్లో కూర్చొని ప్రజల జీవితాలను శాసిస్తుంటే తిరగబడడానికి జీవితకాలం సంసిద్ధంగా ఉంటాను. క్రిమినల్స్‌ను మళ్లీ తెచ్చుకుని నెత్తిన కూర్చోబెట్టుకుంటే మన తలరాతలను ఎవరూ బాగుచేయలేరు. వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో శాంతిభద్రతలు దారుణంగా విఫలమయ్యాయి. అయినా ఏ ఒక్కరైనా వచ్చి అడిగారా? మా కూటమి పాలనలో శాంతిభద్రతల గురించి ప్రజలకు బాధ్యతగా చెప్పడానికి వచ్చాను. నేను మళ్లీ గెలుస్తానో.. లేదో.. కానీ మీకోసం జీవితకాలం పొరాడతా. సివిల్‌ సొసైటీ బలహీనంగా ఉంటే క్రిమినల్స్‌ రాజ్యాలు ఏలుతారు. గతంలో ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో నచ్చని అంశంపై అభిప్రాయం తెలిపితే కొందరు వాళ్ల ఇంటికి వెళ్లి బెదిరింపులకు దిగేవారు. గతంలో ఇలాంటి బెదిరింపులు కోనసీమలో జరిగాయి. చాలామంది మళ్లీ వైసీపీ వస్తుందేమో అని భయపడుతున్నారు. ఆ భయం వద్దు. వాళ్లు రారు. ఎందుకంటే క్రిమినల్స్‌ను నేను ఎంకరేజ్‌ చేయను’’ అని పవన్‌ అన్నారు.


ఇష్టానుసారం మాట్లాడతారా?

‘‘గతంలో కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ జిల్లాగా పేరు పెడితే.. వ్యతిరేకించిన వారి ఇళ్లపై దాడులు చేశారు. అత్యాచారాలు చేస్తామని బెదిరించారు. అప్పుడు ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. శాంతిభద్రతలు దిగజారిపోయాయి. ఇప్పుడు వైసీపీ వాళ్లు అధికారంలో లేకపోయినా క్రిమినల్స్‌లా బెదిరిస్తున్నారు. ఈ రెండేళ్లు సహనం పట్టా. మీరు రౌడీల్లా అవాకులూ చవాకులూ పేలినా నేను శాంతంగా ఉన్నా. మిమ్మల్ని ఒక్క మాట మాట్లాడలేదు. మొన్నటికిమొన్న సాక్షాత్తూ హోం మంత్రిని వైసీపీ నేత ఒకరు మేకప్‌ విషయంలో ఇష్టానుసారంగా మాట్లాడారు. ఇంట్లో ఉండే ఆడబిడ్డలు పౌడర్‌ రాసుకోకూడదా? అలంకారాలు చేసుకోకూడదా? వీరిని చూసి రేపు కాలేజీల్లో ఎవడోఒకడు ఆడబిడ్డలను ఇంకా మరింత అంటారనేది నా భయం. హోంమంత్రిని అంటే అది అక్కడితో ఆగదు. ఆ పరిణామాలు ఇంకా ఎక్కడికో వెళ్తాయి’’ అని అన్నారు.


నన్ను కులాల్లోకి లాగొద్దు

‘‘నేను కులాలు దాటి దేశం కోసం ఆలోచిస్తుంటాను. కానీ మళ్లీ నన్ను కులచట్రంలోకి తీసుకువస్తున్నారు. అందరూ కలిపి కులం అని చిన్నదాంట్లో నన్ను ఇరికిస్తున్నారు. దాంట్లో నన్ను ఎవరూ బంధించలేరు. శాంతిభద్రతల సమస్య వస్తే జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వెళ్లి ధైర్యంగా మాట్లాడాలి. అన్నిసార్లు నేను వెళ్లి మట్లాడలేను. శాంతిభద్రతల పేరుతో కులాన్ని వాడుకుంటే.. ఆ కులానికి నన్ను దయచేసి పరిమితం చేయవద్దు. ఎవడో క్రిమినల్‌ నేరం చేస్తే నేను బాధ్యత వహించాలా? ఎవరో కులం వ్యక్తి 14 ఏళ్ల బిడ్డను రేప్‌ చేస్తే నేను వెనకేసుకు రావాలా? ఇటీవల ఓ కులం వ్యక్తి లాక్‌పడెత్‌ అయితే సీఐపై కేసు పెట్టారు. చంపిన వ్యక్తి కూడా అదే కులం వాడు. అది కదా మాట్లాడాలి. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కాపు నేత. దళిత డ్రైవర్‌ను చంపి డోర్‌ డెలివరీ చేస్తే దాని గురించి వైసీపీ వాళ్లు మాట్లాడరు. అప్పుడు కులాలు రావు. ఎక్కడో రౌడీ చనిపోతే నన్ను లాగుతారు. ఇంతమంది జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలున్నా నోరు తెరవరా.. ఏం చేస్తున్నారు మీరంతా? ఇన్ని సీట్లు యువత ఇచ్చారు మనకు. పౌరుషం లేకపోతే ఎలా? అనంతబాబు మర్డర్‌ చేస్తే అది కాపులందరికీ చెడ్డపేరా? నాడు దిశ కేసులో వైసీపీ అధినేత తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా చప్పట్లు కొట్టాడు. తీరా ఏపీ విషయానికి వచ్చేసరికి అదే మనిషి కులం ప్రస్తావన తెస్తారు’’ అని పవన్‌ మండిపడ్డారు.

Updated Date - Jun 21 , 2026 | 04:13 AM