Share News

విధి నిర్వహణలో..అలసత్వాన్ని సహించం

ABN , Publish Date - Jan 31 , 2026 | 05:03 AM

విధి నిర్వహణలో అలక్ష్యాన్ని సహిం చే ప్రసక్తే లేదని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పష్టంచేశారు. తనకు పొగడ్తలు, చప్పట్లు వద్దని..

విధి నిర్వహణలో..అలసత్వాన్ని సహించం

  • లక్ష్యాల్లో విఫలమైతే కఠినంగా వ్యవహరిస్తా.. అధికారులకు ఉపముఖ్యమంత్రి స్పష్టీకరణ

  • ప్రతి ఒక్కరూ నిబంధనలకు లోబడి పనిచేయాలి

  • కొందరికి ఇప్పటికీ వైసీపీ నేతలతో సంబంధాలు

  • ప్రభుత్వ విధానాల అమలులో నిర్లక్ష్యం

  • ప్రజలు ఎన్నో ఆశలతో కూటమిని గెలిపించారు

  • వారికి మంచి చేయాలన్న తపనతో పనిచేస్తున్నాం

  • అధికారులూ చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వర్తించాలి

  • పవన్‌ కల్యాణ్‌ పిలుపు

  • విశాఖలో ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులతో సమీక్ష

విశాఖపట్నం/మహారాణిపేట, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో అలక్ష్యాన్ని సహిం చే ప్రసక్తే లేదని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పష్టంచేశారు. తనకు పొగడ్తలు, చప్పట్లు వద్దని.. పని మాత్రమే కావాలన్నారు. ఉన్నతస్థాయి అధికారి నుంచి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ వరకు ప్రతిఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని.. జలజీవన్‌ మిషన్‌, ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యాన్ని, నిధుల దుర్వినియోగాన్ని సహించేది లేదని తేల్చిచెప్పారు. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైనా, పనిపట్ల నిర్లక్ష్యం చూపినా కఠినంగా ఉంటానన్నారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్‌లో ఉత్తరాంధ్ర జిల్లాల పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ‘అధికారులు కొందరు ఇప్పటికీ వైసీపీ నాయకులతో సంబంధాలు నెరపుతూ ప్రభుత్వ విధానాల అమలులో నిర్లక్ష్యం వహిస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. రాజకీయ ప్రలోభాలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ నిబంధనల మేరకు పనిచేయాలి. ప్రజలు ఎన్నో ఆశలతో కూటమిని గెలిపించారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా మేమంతా పనిచేస్తున్నాం. ప్రతి అడుగులో ప్రజలకు మంచి చేయాలనే తపనతో ముందుకు వెళ్తున్నాం. ఈ మంచిని జనాలకు చేరువ చేసేందుకు అధికారులు చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వర్తించాలి’ అని కోరారు. పంచాయతీరాజ్‌’ను ప్రభావవంతమైన శాఖగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేస్తున్నామని చెప్పా రు. ఉద్యోగులు కూడా అంతే చిత్తశుద్ధి, జవాబుదారీతనంతో పనిచేయాలని ఆశిస్తున్నామన్నారు. అలసత్వం, అవినీతికి తావులేకుండా చూడాలని సూచించారు. సోషల్‌ ఆడిట్‌ మొక్కుబడిగా కాకుండా పక్కాగా జరగాలని.. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలా లు అందాలన్నారు. ఇదే సమయంలో తన వైపు నుంచి ఎటువంటి రాజకీయ సిఫారసులు ఉండవని స్పష్టంచేశారు.


ఉపాధి పనులపై ఆరా..

ఉపాధి హామీ పథకం కింద పల్లెపండుగ 1.0, పల్లెపండుగ 2.0, అడవితల్లిబాట, జలజీవన్‌ మిషన్‌ కింద ఇప్పటివరకూ చేపట్టిన పనులపై ఉపముఖ్యమంత్రి ఆరా తీశారు. గత ఏడాది లక్ష్యాలను పూర్తిచేశారా.. చేయకపోతే కారణాలేమిటో అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్‌ శాఖను నిర్వీర్యం చేసి నిధులు దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. ‘పంచాయతీల్లో స్వపరిపాలనకు చోటు లేకుండా చేసింది. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా విచ్చలవిడితనంతో ఇష్టారాజ్యంగా నిధులు దారిమళ్లించింది. జలజీవన్‌ మిషన్‌ ఉద్దేశాన్ని నిర్వీర్యం చేసి సుమారు రూ.4 వేల కోట్లు దుర్వినియోగం చేసింది. పనులు చేసినట్లు రికార్డుల్లో చూపించి నిధులు డ్రాచేశారు తప్ప ఒక్క ఇంటికి కూడా నీరిచ్చిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం’ అని వివరించారు. పంచాయతీరాజ్‌ శాఖను బలోపేతం చేయడానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు ఇచ్చామని తెలిపారు. ‘ఒకేసారి పది వేల మందికి పదోన్నతులు కల్పించి ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకుంది. ఉద్యోగి నుంచి అధికారి వరకూ ఏ కష్టం వచ్చినా అండగా ఉంటున్నాం. కడప జిల్లాలో ఎంపీడీవోపై దాడి జరిగితే నేను స్వయంగా వెళ్లి భరోసా ఇచ్చాను. పదోన్నతులు పొందిన సంతో షం.. ప్రజలకు అభివృద్ధి ఫలాలు ఇచ్చేటప్పుడు కనిపించాలి. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మేమంతా కష్టపడుతున్నాం. కేంద్ర పెద్దల మద్దతుతో నిధులు సాధిస్తున్నాం. కూటమి ప్రభుత్వ కష్టానికి సార్థకత చేకూరేలా అధికారులు పనిచేయాలి. ప్రజల సంక్షేమం, సంతోషం ధ్యేయంగా పనిచేయాలి’ అని విజ్ఞప్తిచేశారు.

Updated Date - Jan 31 , 2026 | 05:03 AM