Share News

భాష జాగ్రత్త!

ABN , Publish Date - Aug 15 , 2026 | 04:51 AM

సోషల్‌ మీడియా వేదికగా విభిన్నమైన విషయాలు మాట్లాడేటప్పుడు, పోస్టులు చేసేటప్పుడు జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ అధ్యక్షుడు..

భాష జాగ్రత్త!

  • భావ వ్యక్తీకరణలో పరిధి దాటొద్దు.. జనసైనికులకు పవన్‌ నిర్దేశం

  • సోషల్‌ మీడియాలో ఇష్టానుసారం మాట్లాడొద్దు.. దూషణలొద్దు.. అసభ్య పదజాలం వాడొద్దు

  • మహిళలను గౌరవిస్తూ మాట్లాడాలి.. చర్చల సమయంలో ఆవేశాలకు లోనుకావొద్దు

  • పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగానే స్పందించాలి.. రాజకీయ శత్రువుల వలలో పడొద్దు

  • అంతర్గత విభేదాలు సృష్టించే కుట్రలను, విషప్రచారాలను తిప్పికొట్టాలి: జనసేనాని

అమరావతి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియా వేదికగా విభిన్నమైన విషయాలు మాట్లాడేటప్పుడు, పోస్టులు చేసేటప్పుడు జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ దిశానిర్దేశం చేశారు. వాడే భాష, భావ వ్యక్తీకరణలో పరిధి దాటొద్దని ఆదేశించారు. అనవసర విషయాలపై ఇష్టానుసారం మాట్లాడడం సరికాదని స్పష్టం చేశారని ఆ పార్టీ కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ‘ప్రసార మాధ్యమాలు, సోషల్‌ మీడియాలో మాట్లాడే సమయంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు కచ్చితంగా పార్టీ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలి. వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత దూషణల జోలికి వెళ్లవద్దు. పార్టీ సిద్ధాంతాలు, మార్గదర్శకాలకు అనుగుణంగానే స్పందించాలి, ఏదైనా విషయంపై మాట్లాడే సమయంలో ఆవేశాలకు లోను కావద్దు. అసభ్య పదజాలం వాడవద్దు. మహిళలను గౌరవించి మాట్లాడాలి. పార్టీ అంతర్గత అంశాలపై సోషల్‌ మీడియా వేదికగా ఇష్టానుసారం మాట్లాడొద్దు. పార్టీ భావజాలాన్ని కించపరిచేలా మాట్లాడే వారిని ఉపేక్షించొద్దు. పార్టీ క్రమశిక్షణకు విఘాతం కలిగించేలా, జనసైనికులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసే వారిపై జాగ్రత్తగా ఉండాలి. వారి ప్రభావానికి లోనుకావొద్దు. కూటమి ప్రభుత్వ స్ఫూర్తిని నిలబెట్టేలా మాట్లాడాలి. రాజకీయ శత్రువుల సోషల్‌ మీడియా ప్రచార వలలో పడొద్దు. పార్టీలో అంతర్గత విభేదాలు సృష్టించే కుట్రలను, రకరకాల విషప్రచారాలను తిప్పికొట్టాలి’ అని పవన్‌ స్పష్టం చేశారు.

Updated Date - Aug 15 , 2026 | 05:06 AM