Share News

శిక్ష పడాల్సిందే!

ABN , Publish Date - Feb 25 , 2026 | 03:13 AM

తిరుమల లడ్డూ ప్రసాదంలో కెమికల్‌ నెయ్యి వాడటం అత్యంత తీవ్రమైన నేరం. ఈ నేరానికి పాల్పడిన బాధ్యులకు శిక్షపడాలి.

శిక్ష పడాల్సిందే!

  • పాలు లేకుండా నెయ్యి చేసిన ఘనత వైసీపీదే

  • కెమికల్‌ నెయ్యి పాపం గత టీటీడీ పాలక మండలిదే

  • వారిని వెనుకేసుకొస్తున్న నాటి ‘ముఖ్య నేత’ కూడా బాధ్యుడే

  • ‘నివేదిక’ కొవ్వు కలిసిందంటే, ‘సిట్‌’ పాలే లేవంది

  • ఇస్లాం, క్రైస్తవ మతాల్లో ఇలా జరిగితే దేశం గగ్గోలు పెట్టేది

  • దేవుడి డబ్బు దోచుకునేవారు, వారి తరాలూ లేచిపోతాయి

  • దోషులను కూటమి ప్రభుత్వం శిక్షిస్తుంది: డిప్యూటీ సీఎం పవన్‌

అమరావతి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : తిరుమల లడ్డూ ప్రసాదంలో కెమికల్‌ నెయ్యి వాడటం అత్యంత తీవ్రమైన నేరం. ఈ నేరానికి పాల్పడిన బాధ్యులకు శిక్షపడాలి. దోషులను కూటమి ప్రభుత్వం కచ్చితంగా శిక్షిస్తుంది’’ అని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మంగళవారం శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కుట్ర జరిగిందని తెలిపారు. ఎన్‌డీడీబీ నివేదికలో నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చెబితే, సీబీఐ నేతృత్వంలోని సిట్‌ చేపట్టిన విచారణలో నెయ్యిలో అసలు నెయ్యే లేదని తేలిందన్నారు. అరాచకాల్లో నూతన ఆవిష్కరణలు చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. తిరుమలలో జరిగిన తప్పులకు గత టీటీడీ పాలక మండలిదే బాధ్యతనీ, అలాంటి వారిని వెనకేసుకొస్తున్న గత ప్రభుత్వంలోని ముఖ్యమైన వ్యక్తి కూడా బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీకి 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి వాడారని సిట్‌ విచారణలో తేలిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో ఎన్డీఏ శాసనసభ్యుల సమావేశంలో సీఎం చంద్రబాబు గత ప్రభుత్వ అరాచకాలను వివరిస్తున్న క్రమంలో, కల్తీ నెయ్యి వ్యవహారాన్ని ప్రస్తావించారన్నారు. ఎన్‌డీడీబీ నివేదికను తాను కూడా చదివానని, అప్పటికే పలు సందర్భాల్లో భక్తులు లడ్డూలో నాణ్యత లేదని తనతో చెప్పారన్నారు. సున్నితమైన వ్యవహారంలో రాజకీయ ఆరోపణలు చేయకూడదని అనుకున్నామని తెలిపారు. అయితే, గత పాలకులు అసలు నెయ్యిలో కల్తీయే జరగలేదని చెబుతుండటంతో ఆ వ్యవహారంపై వివరణ ఇవ్వాలనిపించిందన్నారు. గతంలో తిరుమల వెళ్లిన సందర్భంలోనూ చాలామంది ప్రసాదం నాణ్యత అంశాన్ని తన దృష్టికి తీసుకువచ్చారని, తప్పు జరిగిందని తెలిసీ దాన్ని సరిగా ముందుకు తీసుకువెళ్లకపోతే ఎలాగన్న పశ్చాత్తాపంతోనే దీక్ష చేశానని గుర్తుచేశారు. లడ్డూ కల్తీని గత ప్రభుత్వంలోని వ్యక్తులు చేశారని తామెక్కడా చెప్పలేదన్నారు. గత ప్రభుత్వం నియమించిన పాలకమండలి చేసిన తప్పునకు ఆ ప్రభుత్వంలోని వారే జవాబుదారీ అవుతారని మాత్రమే అన్నానని తెలిపారు. ఇంకా ఏమన్నారంటే..


48.76 కోట్ల లడ్డూలు..

‘‘2019-24 మధ్య సుమారు 11 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ కాలంలో 48.76 కోట్ల లడ్డూ ప్రసాదాలు విక్రయం జరగ్గా, అందులో సుమారు 20.10 కోట్ల లడ్డూలు నకిలీ నెయ్యితో తయారయ్యాయని టీటీడీ రికార్డులు చెబుతున్నాయి. ఇందులో నుంచే లక్ష లడ్డూలు అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా పంపిణీ చేశారు. మళ్లీ ఆ లడ్డూలు కల్తీ నెయ్యితో చేసినవి కాదు అంటారు. సిట్‌ రిపోర్టు నెయ్యిలో రసాయనాలు ఉన్నాయని సృష్టంగా చెబుతోంది. వీళ్లేమో లడ్డూలో కల్తీ లేదంటున్నారు. సీబీఐ నేతృత్వంలోని సిట్‌ ఆ నెయ్యి తయారీకి ఒక్క లీటరు పాలు కూడా వినియోగించలేదని పేర్కొంది. పామాయిల్లో రసాయనాలు కలిపి తయారు చేసినట్లు చెప్పింది. ఈ కేసులో 36 మందిని నిందితులుగా తేల్చింది. తమకి నచ్చిన సంస్థలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ఓ ప్రణాళిక ప్రకారం టెండర్‌ నిబంధనలు సవరించారు. ఇలాంటి ఘోర తప్పిదాలు ఇంకే మత ధర్మం విషయంలో జరిగినా ఈపాటికే దేశం మొత్తం గగ్గోలు పెట్టేసేవారు. ఇతర మతాల గురించి మాట్లాడితే ఓట్లు పోతాయని, హిందువుల గురించి మాట్లాడడం తేలిక అన్న పద్ధతిలో మార్పు రావాలి. దీనిని హిందువులూ గుర్తించాలి. సరైన సమయంలో సమాధానం చెప్పాలి.’’


‘భగవంతుడి సేవలో వారుండకూడదు’

ఆముక్త మాల్యదలోని పద్యం వినిపించిన పవన్‌

శ్రీకృష్ణ దేవరాయలు రచించిన ఆముక్త మాల్యదలోని 218వ పద్యంలో రాజుకు కర్తవ్యాన్ని ఉపదేశిస్తూ.. ఉన్న పద్యాన్ని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చదవి వినిపించారు. ’’రాజు కోసం పన్నులు వసూలు చేసే వారికి దేవాలయాలపై అధికారం ఇవ్వొద్దు. అలాంటివారు డబ్బు మీద ఆశతో, రాజ్యానికి సంబంధించిన వసూళ్లలో నష్టం వచ్చినప్పుడల్లా దేవుడి ధనాన్ని రాజు ఖజానాకు చేర్చేస్తారు. అందువల్ల ఎలాంటి మమకారాలూ లేని ఒంటరి వ్యక్తే ఆలయ అధికారిగా ఉండాలి. ఒకవేళ ఆ వ్యక్తి దేవుడి సొత్తు తింటే,ఆ పాపానికి వాడే నాశనం అవుతాడు. అలా కాకుండా ఆ డబ్బు తెచ్చి రాజు ఖజానాకు చేర్చడం వల్ల రాజ్యమే నాశనం అవుతుంది’’ అని వివరించారు. గత ప్రభుత్వంలో అంతా ఇలానే జరిగిందన్నారు. భగవంతుడి డబ్బుని దోచుకునేవారు, వారి తరాలూ లేచిపోతాయని వ్యాఖ్యానించారు. కేసును సాగదీసే కొద్దీ వాళ్ల పాపమే పెరుగుతుందంటూ వైసీపీ నేతలను ఉద్దేశించిన పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు.

Updated Date - Feb 25 , 2026 | 03:41 AM