విద్యార్థులు సమాజానికి ఉపయోగపడాలి
ABN , Publish Date - Apr 09 , 2026 | 06:20 AM
విద్యార్థుల ధ్యేయం సమాజ సేవ కావాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. వారు ఆర్జించిన జ్ఞానం దేశానికి ఉపయోగపడాలని స్పష్టంచేశారు.
ఆఖరి శ్వాస వరకు భావితరాల కోసం పనిచేస్తా
ఏయూ మెగా కల్చరల్ ఫెస్ట్‌లో ఉపముఖ్యమంత్రి పవన్
విశాఖపట్నం, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల ధ్యేయం సమాజ సేవ కావాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. వారు ఆర్జించిన జ్ఞానం దేశానికి ఉపయోగపడాలని స్పష్టంచేశారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో బుధవారం నిర్వహించిన మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పవన్ మాట్లాడుతూ ‘దేశ భవిష్యత్తుకు మీరే నాయకులు. విద్య అంటే పుస్తకాల్లో లభించే జ్ఞానం మాత్రమే కాదు, సమస్యలను ఎదుర్కోగలిగే ధైర్యం, సరైన నిర్ణయాలు తీసుకునే వివేకం, సమాజానికి ఉపయోగపడే బాధ్యత’ అని పేర్కొన్నారు. భవిష్యత్తును నిర్ణయించేవి పరిస్థితులు కాదని, ఆలోచనలు, విలువలు, చర్యలే నిర్ణయిస్తాయని తెలిపారు. చదివిన చదువు వృథా కాదన్నారు. ఆఖరి శ్వాస వరకు భావితరాల కోసం పనిచేస్తానని చెప్పారు. విద్యార్థులు సమాజానికి, దేశానికి ఉపయోగపడటం ద్వారా రుణం తీర్చుకోవాలన్నారు. పవన్‌కల్యాణ్ సరిగా లేకపోయినా తీసి పడేయాలని, విద్యార్థుల ఆలోచన విధానం అలా ఉండాలని స్పష్టం చేశారు. ఏ ఐడియాలజీని గుడ్డిగా నమ్మవద్దని, వాటిని నిరంతరం పరీక్షిస్తూ ఉండాలని సూచించారు. తాను నలిగి, దెబ్బతిని మాట్లాడుతున్నానన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఆత్మ నిర్భర్ భారత్, మేకిన్ ఇండియా, వికసిత్ భారత్-2047 వంటి కార్యక్రమాలతో దేశం స్వయం సమృద్ధి దిశగా వెళుతోందన్నారు. రాష్ట్రంలో కూడా ప్రభుత్వం విద్య, ఎంపవర్‌మెంట్, యూత్, ఇన్నోవేషన్, అవకాశాలు అనే విధానంతో ముందుకు వెళుతోందని చెప్పారు. యువతతోనే మార్పు సాధ్యమవుతుందన్నారు. ఏయూ వీసీ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్, కల్చరల్ ఫెస్ట్ చైర్మన్ విజయ్‌మోహన్ మాట్లాడారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పలు పోటీల విజేతలకు డిప్యూటీ సీఎం చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.