Share News

పవన్‌ ముక్కుకు సర్జరీ!

ABN , Publish Date - Apr 19 , 2026 | 03:39 AM

ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో శనివారం శస్త్రచికిత్స చేశారు.

పవన్‌ ముక్కుకు సర్జరీ!

  • శ్వాస ఇబ్బందితో హైదరాబాద్‌ అపోలోకు

  • శస్త్రచికిత్స అనంతరం ఇంటికి

హైదరాబాద్‌, అమరావతి, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో శనివారం శస్త్రచికిత్స చేశారు. శుక్రవారం ఉదయం అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సమయంలో పవన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ఆయన రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ హరిప్రసాద్‌ వెల్లడించారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవడంతో ఆయన శుక్రవారం నాటి కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. సైనసైటిస్‌ కారణంగా తలెత్తిన ఇబ్బంది అని, ముక్కుకు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు నిర్ధారించడంతో జూబ్లీహిల్స్‌లోని అపోలోలో చేరారు. శనివారం సాయంత్రం సైనసైటిస్‌కు సంబంధించి డాక్టర్‌ మనుస్రుత్‌ డే కేర్‌ సర్జరీ చేసి, పవన్‌కు శ్వాస ఇబ్బందిని తొలగించారు. శస్త్రచికిత్స అనంతరం పవన్‌ ఇంటికి వెళ్లిపోయారు. ‘కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా పవన్‌ ఇబ్బంది పడుతున్నారు. వ్యక్తిగత వైద్యుల సలహా మేరకు సర్జరీ చేయించుకున్నారు. వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని వైద్యులు తెలిపారు’ అని హరిప్రసాద్‌ వివరించారు.


పవన్‌ త్వరగా కోలుకోవాలి: సీఎం చంద్రబాబు

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సర్జరీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్‌లో స్పందించారు. ‘సర్జరీ తరువాత పవన్‌ కల్యాణ్‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో, మరింత శక్తివంతంగా త్వరగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నా’ అని సీఎం పేర్కొన్నారు.

పవనన్నా.. త్వరగా కోలుకోండి: లోకేశ్‌

శస్త్రచికిత్స చేయించుకున్న పవన్‌ కల్యాణ్‌ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నానని మంత్రి లోకేశ్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. ’నిత్యం రాష్ట్రాభివృద్ధి, ప్రజాసంక్షేమమే ఆశ, శ్వాసగా పనిచేసే మీరు త్వరలో పూర్తి ఆరోగ్యవంతులై ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నా. వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకోండి పవనన్నా’ అని పేర్కొన్నారు.

Updated Date - Apr 19 , 2026 | 03:40 AM