Share News

పవన్‌కు శస్త్ర చికిత్స విజయవంతం

ABN , Publish Date - Jul 12 , 2026 | 05:57 AM

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు ముంబైలోని ప్రముఖ ఆస్పత్రిలో నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది. ఇటీవల వైద్యపరీక్షలు చేయించుకున్న సమయంలో ఆయన రెండు భుజాలకు..

పవన్‌కు శస్త్ర చికిత్స విజయవంతం

  • 3.30 గంటల పాటు నిర్వహించిన ముంబై వైద్య బృందం

  • తొలుత కుడి భుజం రొటేటర్‌ కఫ్‌ గాయానికి ఆపరేషన్‌

  • రెండు నెలల తర్వాత ఎడమ భుజానికీ చేయాలని సూచన

  • నేడు ముంబై వెళ్లి పరామర్శించనున్న బాబు

అమరావతి, జూలై 11(ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు ముంబైలోని ప్రముఖ ఆస్పత్రిలో నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది. ఇటీవల వైద్యపరీక్షలు చేయించుకున్న సమయంలో ఆయన రెండు భుజాలకు రొటేటర్‌ కఫ్‌ గాయాలు ఉన్నాయని, కండరాలు పూర్తిగా చిట్లడంతో వీలైనంత త్వరగా ఆపరేషన్‌ అవసరమని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత ఆర్థోపెడిక్‌ సర్జన్‌, స్పోర్ట్స్‌ మెడిసిన్‌ నిపుణుడు డాక్టర్‌ దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం శనివారం ఉదయం ఆయనకు సర్జరీ చేసింది. రెండు భుజాలకు ఒకేసారి ఆపరేషన్‌ చేస్తే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వైద్యులు సూచించడంతో ప్రస్తుతానికి కుడి భుజానికి మాత్రం చేశారు. రొటేటర్‌ కఫ్‌ గాయంతో పాటు భుజానికి అవల్షన్‌ ఫ్రాక్చర్‌ కూడా ఉండటంతో మూడున్నర గంటల పాటు సర్జరీ చేయాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. రెండు నెలల వ్యవధిలో మరో భుజానికి రకూడా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని సూచించారు. పవన్‌ భుజానికి 2016లోనే గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు తగిన విశ్రాంతి అవసరమని సూచించినా ఆయన పలు సమావేశాల్లో పాల్గొన్నారు. 2019 ఎన్నికల అనంతరం రాయలసీమ జిల్లా పర్యటనలోనూ, వారాహి యాత్ర సమయంలోనూ జనసేన పార్టీ శ్రేణులు, అభిమానులు పవన్‌కు చేరువగా వెళ్లి కరచనాలనం చేయడం, ఆప్యాయంగా హత్తుకునే సందర్భాల్లో గాయాలు తిరగబెట్టాయి. 2026 ఏప్రిల్‌లో ఆయన ముక్కుకి శస్త్రచికిత్స చేసిన సందర్భంలో పలు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. భుజాలకు రొటేటర్‌ కఫ్‌ గాయం, మజిల్‌ టేర్స్‌ తీవ్రస్థాయిలో ఉన్నట్లు గుర్తించారు.


పవన్‌ త్వరగా కోలుకోవాలి: సీఎం, లోకేశ్‌

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌, శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆకాంక్షించారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, ఆ భగవంతుడు మరింత బలాన్ని చేకూర్చాలని ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేశారు. పవన్‌కు నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైనందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకుని, రెట్టింపు ఉత్సాహంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాలని, ప్రజలకు మరింతగా సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు స్పీకర్‌ పేర్కొన్నారు. కాగా, సీఎం చంద్రబాబు ఆదివారం ముంబై వెళ్తున్నారు. కోకిలాబెన్‌ ఆస్పత్రిలో శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న పవన్‌ కల్యాణ్‌ను ఆయన పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ముంబై వెళ్లి, పవన్‌ను పరామర్శించిన తర్వాత సాయంత్రం తిరిగి అమరావతికి రానున్నారు.

Updated Date - Jul 12 , 2026 | 05:59 AM