Kondagattu Anjaneya Swamy Visit: నేడు కొండగట్టుకు డిప్యూటీ సీఎం పవన్
ABN , Publish Date - Jan 03 , 2026 | 05:45 AM
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులోని ఆంజనేయ స్వామిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం దర్శించుకోనున్నారు.
టీటీడీ నిధులతో నిర్మించే భవనాలకు శంకుస్థాపన
అమరావతి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులోని ఆంజనేయ స్వామిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం దర్శించుకోనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన జారీచేసింది. టీటీడీ సమకూర్చిన నిధులతో నిర్మించనున్న భవనాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. కాగా, కొండగట్టు ఆంజనేయస్వామిని పవన్ కల్యాణ్ ఇలవేల్పుగా కొలుస్తారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కొండగట్టు స్వామిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. ఆ సమయంలో ఆలయ అధికారులు, అర్చకులతో మాట్లాడిన సందర్భంగా.. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, వారి కోసం దీక్ష విరమణ మండపం, విశ్రాంతి గదులతో కూడిన సత్రం అవసరమని పవన్‌ను కోరారు. ఆలయ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. టీటీడీ సహకారంతో కొండగట్టు క్షేత్రంలో వీటి నిర్మాణానికి డిప్యూటీ సీఎం ప్రతిపాదించగానే, దానిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. టీటీడీ చైర్మన్‌తో చర్చించడంతో.. ఆయన వెంటనే రూ.35.19 కోట్లు మంజూరుకు అంగీకరించారు. ఈ పనులకు పవన్ శనివారం ఉదయం శంకుస్థాపన చేస్తారు. అనంతరం జనసేన తెలంగాణ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. ఇటీవల తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ మద్దతుతో గెలిచిన వారిని కలుస్తారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు.