Share News

మస్కట్‌లో మహిళ నరకయాతన

ABN , Publish Date - May 04 , 2026 | 05:02 AM

అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం గ్రామానికి చెందిన నిరుపేద మహిళ దూదేకుల షెహనాజ్‌.. తమ కుటుంబపోషణకు ఉపాధి నిమిత్తం ఓ ఏజెంట్‌ ద్వారా ఒమన్‌లోని మస్కట్‌కు వెళ్లింది.

మస్కట్‌లో మహిళ నరకయాతన

  • స్పందించిన డిప్యూటీ సీఎం పవన్‌

  • స్వగ్రామానికి రప్పించేందుకు ఏర్పాట్లు

అమరావతి/వాల్మీకిపురం, మే 3 (ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం గ్రామానికి చెందిన నిరుపేద మహిళ దూదేకుల షెహనాజ్‌.. తమ కుటుంబపోషణకు ఉపాధి నిమిత్తం ఓ ఏజెంట్‌ ద్వారా ఒమన్‌లోని మస్కట్‌కు వెళ్లింది. ఏజెంట్‌ చేతిలో మోసపోయిన ఆమె అక్కడ నరకయాతన పడింది. తనకు జీతం ఇవ్వడం లేదని, ఆహారం పెట్టడం లేదని, నీళ్లు ఇవ్వడం లేదని, అడిగితే కొడుతున్నారని, వేధింపులకు గురిచేస్తున్నారని.. తన భర్తకు ఫోన్‌ చేసి చెప్పడంతో పాటు వీడియో కూడా తీసి పంపింది. తనను కాపాడాలంటూ రోదిస్తూ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను వేడుకుంది. ప్రాణాలు పోయేలా ఉన్నాయని ఆమె మాటలకు పవన్‌ చలించిపోయారు. తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని తన కార్యాలయ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు భారత విదేశాంగ శాఖ, ఒమాన్‌లోని దౌత్య కార్యాలయాన్ని సంప్రదించారు. బాధితురాలి భర్త అబూబాకర్‌ అలియాస్‌ బావాజాన్‌ ద్వారా ఒమన్‌లోని ఏజెంట్‌ ద్వారా మాట్లాడారు. పవన్‌ చొరవతో బాధితురాలిని దేశానికి రప్పించేందుకు విమాన టికెట్‌ బుక్‌ చేసినట్టు సమాచారం. మంగళవారం లేదా బుధవారం ముంబై చేరుకొనే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. షహనాజ్‌ ఇబ్బందులపై ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి స్పందించారు. ఏపీఎన్‌ఆర్‌టీఎస్ ప్రెసిడెంట్‌ వేమూరు రవికుమార్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఆపరేషన్‌ సర్వీసెస్‌ నాగేంద్రబాబు అక్కిలితో ఫోన్‌లో మాట్లాడారు.

Updated Date - May 04 , 2026 | 06:22 AM