మహిళల ప్రాతినిధ్యాన్ని ప్రతిపక్షం అడ్డుకుంది: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Apr 19 , 2026 | 03:35 AM
భారత శాసన సభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసే చరిత్రాత్మక అవకాశాన్ని ప్రతిపక్షం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుందని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
అమరావతి, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): భారత శాసన సభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసే చరిత్రాత్మక అవకాశాన్ని ప్రతిపక్షం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుందని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. మహిళా రిజర్వేషన్, డీ-లిమిటేషన బిల్లులపై ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ‘భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసి, మహిళలకు సాధికారత కల్పించే పరివర్తనాత్మక సంస్కరణలకు మద్దతిచ్చే సంకల్పం ప్రతిపక్షంలో లేదని వారి వైఖరి స్పష్టం చేస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వడానికి నిరాకరించడం ద్వారా వారు మరోసారి జాతీయ పురోగతి కంటే రాజకీయ లెక్కలకే ప్రాధాన్యమిచ్చినట్లు అయింది. ఒక ముందడుగను ఆలస్యంచేశారు. ఒకవేళ ఇది ఆమోదం పొందిఉంటే, దేశ వ్యాప్తంగా లక్షలాది మహిళలకు ఇది గర్వకారణమైన, ప్రగతికి చిహ్నమైన ఘట్టమై ఉండేది.’ అని పవన్ పేర్కొన్నారు.